Latest News

అబద్ధాల ప్రచారం.. అడ్డంగా దొరికిపోయి నవ్వుల పాలు!

posted on: Jun 16, 2022 7:14AM

అబద్ధాలు చెప్పడం.. ఆ తరువాత అడ్డంగా దొరికిపోవడం నవ్వులపాలు కావడం వైసీపీకి ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఎంతలా అంటే అసలు ఏమాత్రం అవసరం లేని విషయాలలో కూడా బొంకేయడం.. దొరికిపోయి నాలుక కరుచుకోవడం. ఏదైనా సరే నిజం నిప్పులాంటిది. అది బయటపడక తప్పదన్న విషయం  ఏ మాత్రం ఇంగితం ఉన్నవారికైనా ఇట్టే బోధపడే వాస్తవం. మరి ఘనత వహించిన వైసీపీ పెద్దలకు మాత్రం అది ఎందుకు ఎప్పటికీ తెలిసేలా లేదు. ఏ విషయం తీసుకున్నా అబద్ధమే వైసీపీ నోట ముందుకు వస్తుంది.

వైఎస్ వివేకా హత్య కేసు నుంచి నిన్నటి  మమతా బెనర్జీ సమావేశం వరకూ వైసీపీ చెప్పినవన్నీ అబద్ధాలే. వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించాడంటూ తొలుత అవాస్తవాలు ప్రచారం చేశారు. గంటల వ్యవధిలోనే వైసీపీ అగ్రనేతల నోట వచ్చింది పచ్చి అబద్ధమనీ, ఆయన దారుణ హత్యకు గురయ్యారనీ తేలిపోయింది. ఆ వెంటనే వివేకా హత్య వెనుక ఉన్నది తెలుగుదేశం అధినేత, ఆయన కుమారుడు అంటూ మరో ప్రచారాన్ని తలెత్తుకున్నారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తులో వెలుగు చూస్తున్న నిజాలన్నీ ఆ హత్య వెనుక ఉన్నది వైసీపీ అగ్రనేతల వైపే వేళ్లు చూపుతున్నాయి. ఆ తరువాత ఇటీవల జరిగిన కోనసీమ అల్లర్ల విషయం తీసుకుంటే.. తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు గుప్పించారు.

కానీ పోలీసుల అరెస్టు చేసిన వారంతా వైసీపీ కార్యకర్తలే. ఏకంగా మంతి నివాసం దగ్ధం అయినా, ఎమ్మెల్యే నివాసాన్ని ధ్వంసం చేసినా ఆ చేసిన వారంతా వైసీపీ వారేనని తేలిపోయినా.. ఆ పార్టీ అధినేత మాత్రం విపక్షాలేనని ఆరోపణలు గుప్పిస్తుంటారు. ఇక తాజాగా ఎందుకు దాచారో, ఎందుకు అలా చెప్పారో అర్థం కాదు. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ ఢిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు ఆహ్వానం అందలేదంటూ వైసీపీ ప్రచారం చేసుకుంది. అయితే హస్తినలో సమావేశం పూర్తయిన స్వల్ప వ్యవధిలోనే జగన్ ను మమత సమావేశానికి ఆహ్వానించారనీ, జగన్ ఆ సమావేశానికి డుమ్మా కొట్టారనీ తేలిపోయింది.

సమావేశం జరుగుతున్న సమయంలో హస్తినలోనే ఉన్న విజయసాయి రెడ్డిని మీడియా ప్రశ్నించిన సందర్భంలో తమకు అసలు ఆహ్వానమే అందలేదని ఆయన విస్పష్టంగా చెప్పారు. ఆయన అలా చెప్పిన కొద్ది సేపటికే మమతా బెనర్జీ వైసీపీ సీఎం జగనను ఆహ్వానించారనీ తేలిపోయింది. మమత జగన్ కు పంపిన లేఖ బయటకు వచ్చింది. ఆహ్వానం అందినా అందలేదన్న అబద్ధం వైసీపీ నేతలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్నది రాజకీయ పరిశీలకులకు కూడా అంతుబట్టడం లేదు. మొత్తం ఎనిమిది మంది ముఖ్యమంత్రులకు మమతా బెనర్జీ ఆహ్వానం పంపితే.. వారిలో ఒక్కరు కూడా మమత నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. కానీ వారెవరూ కూడా జగన్ లా అసలు ఆహ్వానమే అందలేదని అవాస్తవాలు చెప్పలేదు.

 మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా అందరికీ పంపినట్లే జగన్ కూ లేఖ పంపారు. అందరికీ ఫోన్ చేసి ఆహ్వానించినట్లే జగన్ కూ ఫోన్ చేశారు. అయితే జగన్ మాత్రం మిగిలిన వారికి భిన్నంగా అసలు ఆహ్వానమే అందలేదంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అయితే విపక్షాల నుంచి ఆహ్వానం అందిందంటేనే మోడీగారు గుస్సా అవుతారని జగన్ భయపడుతున్నారా అందుకే ఆహ్వానం అందినా లేదని అబద్ధాన్ని ప్రచారం చేశారా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తమౌతున్నాయి. మోడీ సర్కార్ కు ఇంతగా భయపడుతూ.. విపక్షం నుంచి ఆహ్వానం అందితేనే కేంద్రం పెద్దలకు కోపం వస్తుందని వణికిపోయే జగన్ ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తీసుకురాగలరని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అవసరం ఉన్నా లేకున్నా అబద్ధాలు ప్రచారం చేయడం తీరా అవి బయటపడి పరువు పోగొట్టుకోవడం వైసీపీకి ఒక అలవాటుగా మారిపోయింది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్న పరిస్థితి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...