గోరంట్లా ఎంత పని చేశావయ్యా?.. వైసీపీలో అయోమయం.. పార్టీ పరువు గంగలో కలుస్తున్నా కిమ్మనని వైనం

posted on: Aug 8, 2022 11:31AM

గోరంట్ల మాధవ్ విషయంలో చర్య తీసుకోవడానికి వైసీపీ జంకుతోందన్న భావన అందరిలో రోజు రోజుకూ బలపడుతోంది. దీంతో వైసీపీ నైతికంగానూ, రాజకీయంగానూ కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. మాధవ్ అసభ్య వీడియో బయటపడి ఇన్ని రోజులైనా వైసీపీ ఆయన విషయంలో ఎలాంటి చర్యా తీసుకోకపోవడం అటుంచి వైసీపీ ఎంపీ మాధవ్ నిస్సిగ్గుగా పార్లమెంటులోని వైసీపీ కార్యాలయంలో జరిగే సమావేశాలకు హాజరౌతుండటం, ఫొటోలకు పోజులిస్తుండటం.. విసీపీ ఇమేజ్ ను మరింత దిగజారుస్తోంది.  

వీడియో బయటపడిన గంటల తరువాత  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎంపీ మాధవ్  తప్పు చేస్తే చర్యలుంటాయనీ, ఆయన తప్పు చేసినట్లు రుజువు కావాలని మీడియా సమావేశంలో చెప్పారు. కానీ ఆ వీడియో మార్ఫింగా కాదా అన్నది  ఎలా నిర్ధారిస్తారు? ఆ వీడియోను ఇప్పటివరకూ ప్రభుత్వం పరంగా కానీ, పార్టీ  పరంగా ఏమైనా ఫోరెన్సిక్ లాబ్ కు పరీక్షకు పంపించారా?  ఎంపీ చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ ప్రాథమిక దర్యాప్తు చేపట్టందా? అన్నదానిపై స్పష్టత లేదు.  సాధారణంగా అధికార పార్టీ ప్రముఖులపై ఎవరైనా పోస్టులు పెడితే, క్షణం ఆలస్యం చేయకుండా వారిపై చర్యలు తీసుకునే సీఐడీ ఒక వేళ నిజంగా ఎంపీ మాధవ్ వీడియోను మార్ఫింగ్ చేసినట్టయితే, ఆ మార్ఫింగ్ వీడియో  సృష్టించిన వారిని ఇప్పటిదాకా చర్యలు తీసుకోకుండా ఉంటుందా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. సీఐడీ ఇప్పటి వరకూ స్పందించలేదంటే.. ఆ వీడియో మార్ఫింగ్ అయ్యే అవకాశమే లేదని సామాన్య జనం కూడా అభిప్రాయపడుతున్నారు.

మరో వైపు మాధవ్ విషయంలో పార్టీ హై కమాండ్ అంటే జగన్ వెనుకాడటం పట్ల వైసీపీలోనే విమర్శలు వినవస్తున్నాయి.  రాజకీయపరమైన వివాదమయితే, దానిపై చర్యలకు సమయం తీసుకోవడంలో అర్థం ఉంటుంది కానీ, ఇలాంటి అనైతిక వ్యవహారాల విషయంలో కూడా  ఎటువంటి చర్యా తీసుకోకపోవడం వల్ల పార్టీ ఇమేజ్ దారుణంగా దెబ్బతింటుందని పార్టీలోని సీనియర్లు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మాధవ్ వ్యవహారం వల్ల మీడియా ముందుకు కూడా రాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని వారు అంటున్నారు. ఏదైనా విషయంపై మీడియాతో మాట్లాడదామన్నా తొలుత మాధవ్ విషయాన్ని పార్టీ సమర్ధిస్తోందా, సమర్ధించనట్లైతే చర్య ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్నలే ఎదురౌతున్నాయని వారు చెబుతున్నారు. అయితే మాధవ్ విషయంలో చర్యలు అన్న విషయంలో పార్టీలో ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఏ నిర్ణయమైనా జగనే తీసుకోవాలి. అసలు మాధవ్ విషయంలో జగన్ ఏం అనుకుంటున్నారు,

చర్య విషయంలో ఆయన అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నకు జగన్ వినా మరెవరూ సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే జగన్ ఏం చేస్తారన్నది ఆయనతో సన్నిహితంగా మెలిగే వారికి కూడా ముందుగా తెలియదని పార్టీ వర్గాలే చెబుతుంటాయి. ఒక్క గోరంట్ల మాధవ్ విషయంలోనే కాదు.. ఏ విషయంలోనైనా సరే పార్టీలోని ముఖ్యులకు కూడా జగన్ ఒక నిర్ణయం తీసుకున్న తరువాతే తెలుస్తుంది. ఈ కారణంగానే అవసరం ఉన్నా లేకున్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే నేతలు కూడా ఇప్పుడు మీడియా అంటే మొహం చాటేస్తున్నారు.  ఇక విపక్షంపై విమర్శలు గుప్పించే రోజా వంటి మహిళా మంత్రులకు కూడా మాధవ్ వ్యవహారంతో నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందంగా నోరు మెదపడానికి కూడా ఇష్టపడటం లేదు.  మాధవ్ అంశంపై ఇప్పటికే తెలుగు మహిళా నేతలు,  నిత్యం వైసీపీని విమర్శలతో చెరిగేస్తున్నా, ఆ విమర్శలను ఖండించేందకు కూడా అవకాశం లేని నిస్సహాయ స్థితిలో వైసీపీ, ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

   రోజా మాత్రం ‘సీఎం విచారణ జరిపిస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో కాల్ మనీ వ్యవహారంలో మహిళలను వేధించలేదా?” అన్న అరిగిపోయిన రికార్డునే వినిపించాల్సి వచ్చిందే తప్ప, ఆ వీడియో మాధవ్ ది కాదని గట్టిగా చెప్పకపోవడాన్ని బట్టే, ఎంపీ వీడియో వ్యవహారం పార్టీని ఏ స్థాయిలో డిఫెన్స్ లో పడేసిందన్నది అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.మాధవ్ పై చర్యలు తీసుకోనున్నట్లుగా వైసీపీ నుంచి వచ్చిన లీకులు కూడా ఇప్పుడు చర్య విషయంలో జాప్యంతో బూమరాంగ్ అయ్యింది. మాధవ్ కు మద్దతుగా కుల సంఘాల ర్యాలీలు, వ్యతిరేకంగా అదే కులానికి చెందిన వారి విమర్శలు పార్టీని మరింత ఇరుకున పడేశాయి.

ఇప్పుడు మాధవ్ పై చర్య తీసుకుంటే అనంతపురం జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గం పార్టీకి దూరమౌతుందన్న భయం, చర్య తీసుకోకుంటే.. మహిళా సమాజం మొత్తం వైసీపీని బహిష్కరిస్తుందన్న బెంగ జగన్ ను కుదిపేస్తోందని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నారు. గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో బయటపడిన వెంటనే నిర్ణయం తీసుకుని ఉంటే పార్టీకి ఇప్పుడీ సంకట స్థితి వచ్చి ఉండేది కాదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 
  

google-ad-img
    Related Sigment News
    • Loading...