తప్పు చేస్తే తప్పించుకోలేరు.. ఏ కలుగులో దాగినా వదిలేదేలే..!

posted on: Nov 25, 2024 5:36AM

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఏపీలోని అన్ని రంగాల్లో అభివృద్ధి జ‌రుగుతోంది. ప్ర‌తీ విభాగంలోనూ అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన ఫైళ్లు చ‌క‌చ‌కా ముందుకు క‌దులుతున్నాయి. దీంతో వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో తీవ్ర ఇబ్బందులు ప‌డిన ప్ర‌జ‌లు ప్ర‌స్తుత ఎన్డీయే కూట‌మి పాల‌న ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ హ‌యాంలో ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్క‌డా రోడ్లు వేసినా దాఖ‌లాలు లేవు. క‌నీసం గుంత‌లు పూడ్చిన ఆనవాళ్లు కూడా లేవు.   కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తోనే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న సాగింది. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లపై అక్ర‌మ కేసులు పెట్టి జైళ్లకు పంపించ‌డం, వారిని చిత్ర‌హింస‌ల‌కు గురిచేయ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌కే వైసీపీ నేత‌లు, పోలీసులు ప‌రిమిత‌మ‌య్యారు. ఇదే క్ర‌మంలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుపైనా రాళ్ల దాడికి పాల్ప‌డ్డారు. కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన స‌మ‌యంలోనూ, నందిగామ‌లో ప‌ర్య‌ట‌న స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు నాయుడు టార్గెట్ గా వైసీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్ల‌దాడికి పాల్ప‌డ్డారు. నందిగామ‌లో రాళ్ల దాడి ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లో వారు ప‌ట్టించుకోలేదు. ఆ ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపేందుకు ప్రాధాన్య‌త‌నివ్వ‌కుండా.. పూలు చ‌ల్లుతున్న స‌మ‌యంలో రాళ్లు ప‌డ్డాయంటూ పోలీసులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. తాజాగా.. నందిగామ‌లో చంద్ర‌బాబుపై రాళ్ల‌దాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. ఈ క్ర‌మంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై సీఎం చంద్ర‌బాబు నాయుడు కొర‌డా ఝ‌ళిపిస్తున్నారు. మ‌రోవైపు టీడీపీ, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ‌ల కేసులు పెట్టిన పోలీసుల‌పైనా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ బ్యాచ్ రెచ్చిపోయింది. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లోని ప‌లువురి నేత‌ల‌పైనా, వారి కుటుంబాల్లోని ఆడ‌వారిపైన‌ అస‌భ్య ప‌ద‌జాలంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెట్టారు. మార్ఫింగ్ ఫొటోలను పోస్టుచేసి రాక్ష‌సానందం పొందారు. అప్ప‌ట్లో అస‌భ్య పోస్టుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేదు. చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత సోష‌ల్ మీడియాలో అస‌భ్య ప‌దజాలంతో, మార్పింగ్ ఫొటోల‌తో పోస్టులు పెట్టిన వైసీపీ నేత‌ల‌పై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్టు చేయ‌గా.. మ‌రికొంద‌రికి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు ఇచ్చారు. తాజాగా, చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా రాళ్ల‌దాడి ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన కేసులు రీ ఓపెన్ చేస్తున్నారు పోలీసులు. దీంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. 

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఎం చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడికి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను తాజాగా నందిగామ పోలీసులు అదుపులో తీసుకున్నారు. 2022 నవంబర్ 5వ తేదీన అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నందిగామలో పర్యటించారు. స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్​లో వీధిలైట్లు ఆర్పి చంద్రబాబు లక్ష్యంగా రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావుకు గాయాలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఈ కేసు గురించి పట్టించుకోలేదు. విచారణ చేయాల్సిన కాంతిరాణా టాటా పూలు చ‌ల్లే స‌మ‌యంలో పొర‌పాటున చిన్న‌చిన్న‌ రాళ్లు పడ్డాయని కవర్ చేశారు. కేసును చాలా తేలిక సెక్షన్లతో నమోదు చేశారు. అవే రాళ్లు చంద్రబాబుకు తగిలి ఉంటే ప్రాణపాయం జరిగేదని తెలిసిన‌ప్పటికీ సీపీ కుట్రపూరితంగా వ్యవహరించారు. చంద్రబాబుపై రాళ్ల దాడులు చాలా సంద‌ర్భాల్లో జరిగాయి. చంద్ర‌బాబును హ‌త‌మార్చాల‌న్న‌ ఉద్దేశంతో కుట్ర పూరితంగా పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్క అయ్యి దాడులు చేశారని ఇవి ఖచ్చితంగా హత్యా ప్రయత్నాలేనన్న అనుమానాల‌ను టీడీపీ శ్రేణులు గ‌తంలో ప‌లుసార్లు వ్య‌క్తం చేశారు.

ఇదిలాఉంటే కుప్ప‌లోనూ చంద్ర‌బాబుపై ప‌లుసార్లు రాళ్ల‌దాడికి వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కూడా కేసులు రీ ఓపెన్ చేసి విచార‌ణచేప‌ట్టాల‌ని తెలుగుదేశం నేత‌లు పోలీసుల‌ను కోరుతున్నారు. మొత్తానికి ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ నేత‌ల అక్ర‌మాల‌పై కేసులు న‌మోదు చేయ‌డంతోపాటు.. సోష‌ల్ మీడియాలో అస‌భ్య ప‌ద‌జాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నేత‌ల‌పై ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. ఇదే క్ర‌మంలో వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌ల‌పై న‌మోదైన కేసుల‌ను రీ ఓపెన్ చేసేందుకు పోలీసులు సిద్ధ‌మ‌వుతుండ‌టంతో వైసీపీ నేత‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...