జగన్‌ బుద్ధి మారేలా చెయ్యి ప్రభువా...

 

రలోకమందున్న మా తండ్రీ! నీ నామం పరిశుద్ధ పరచబడును గాక! నీ రాజ్యం వచ్చు గాక... కానీ వీటికంటే ముందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా వున్న జగన్ బుద్ధి మారుగాక! అవును ప్రభువా... తన వైఎస్సార్‌ ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని జగన్ లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు భారీ స్థాయిలో వున్నా, ఆయన నెత్తిమీద బోలెడన్ని కేసులు వున్నా, పదహారు నెలలు జైల్లో వుండి వచ్చినా, ఏ క్షణంలో తిరిగి జైలుకి వెళ్తాడో తెలియకపోయినా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిపక్ష నాయకుడిని చేశారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ఆయన అలా కాకుండా, కేవలం అధికారమే పరమావధిగా జగన్ వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా వుంది. అవినీతి డబ్బుతో స్థాపించిన తన మీడియాలో ప్రభుత్వం మీద లేనిపోని నిందలు, అపవాదులు, దుష్ప్రచారం చేస్తున్నారు. పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలనలో విసిగి వేసారిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజన లాంటి దారుణాన్ని కూడా ఎదుర్కొన్నారు. పదేళ్ళ నరకం తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్‌లో శ్రమించి పనిచేసే సమర్థమైన ప్రభుత్వం వచ్చిందని ప్రజలు ఆనందిస్తున్న వేళ జగన్ మాత్రం ప్రజల పంటికింద రాయిలా మారారు. పొరపాటున సాక్షి టీవీ పెట్టినా, బుద్ధి గడ్డితిని సాక్షి పేపర్ చూసినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించడం తప్ప మరొకటి కనిపించదు. వాస్తవాలకు వక్రభాష్యం ఇవ్వడం తప్ప మరోటి చూసే అదృష్టం కలగదు.

 

సరే, చంద్రబాబు ప్రభుత్వం మీద జగన్ రెగ్యులర్‌గా జల్లే బురద సంగతి అలా వుంచుదాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెను విపత్తును ఎదుర్కొంది. హుదుద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర కకావికలు అయిపోయింది. విశాఖపట్నం దారుణంగా దెబ్బతింది. హుదూద్ తుఫాను సముద్రంలో ఏర్పడినప్పటి నుంచి, తీరం దాటిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ఎలర్ట్‌గా వుండి అవసరమైన చర్యలు తీసుకుంది. తుఫాను తీరం దాటినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలోనే వుంటూ జనాల్లో కలసిపోయి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి అండగా వుండాల్సిన ప్రతిపక్ష నాయకుడు జగన్ తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించడం లేదు. తుఫాను బాధితులకు అండగా నిలిచిన ప్రభుత్వం మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు. తుఫాను సహాయక పనుల మీద కూడా విషప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు. తుఫాను బాధితులకు అండగా నిలుస్తున్న చంద్రబాబు నాయుడికి పొలిటికల్ మైలేజ్ ఎక్కడ పెరిగిపోతుందోనని భయపడిపోతున్న జగన్ ఆయన మీద ఆరోపణల బురద చల్లుతూ ఆత్మానందం చెందుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మారని జగన్ బుద్ధి ఇంకెప్పుడు మారుతుంది? ఆయన బుద్ధిని ఆయన మార్చుకోడని, ఆ బుద్ధిని మార్చడం నరమానవుల వల్ల కాదని అర్థమైపోయింది. అంచేత ప్రభువా.. కనీసం నువ్వయినా జగన్ బుద్ధిని మార్చు. ఆమెన్.