Latest News

‘పొత్తు’ పొడిస్తే వైసీపీకి చుక్కలే!

posted on: May 8, 2022 6:22AM

ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మూడేళ్లలోనే తన పాలనా వైఫల్యాలతో నాడు తనకు మద్దతు పలికిన అన్ని వర్గాలలో అసహనం నింపేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు, కర్షకులు, కార్మికులు ఇలా ఏ వర్గం తీసుకున్నా సంతోషంగా లేని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది. 
2019 ఎన్నికలలో అంత వేవ్ ఉండి కూడా మెజారిటీల పరంగా వైసీపీ అభ్యర్థులు చాలా వరకూ స్వల్ప మెజారిటీలతోనే గట్టెక్కారు. పైగా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా త్రిముఖ పోటీ నెలకొని ఉంది. జగన్ వ్యతిరేక ఓటు తెలుగుదేశం, జనసేన మధ్య చీలిపోయింది. అప్పట్లోనే 2004 ఎన్నికలలో వలె తెలుగుదేశం, బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటే వైసీపీకి విజయం అంత సులువు అయ్యుండేది కాదు. 
అన్ని రంగాలలో వైఫల్యాలతో ప్రజాదరణను వేగంగా కోల్పోతున్న జగన్ ప్రభుత్వ ప్రతిష్ట మరింత మసకబారేలోపే ముందస్తుకు వెళ్లి లబ్ధి పొందాలని యోచన చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలన్న ఆశలకు ‘పొత్తు’లతో గండి కొట్టాలని విపక్షాలు స్కెచ్ వేస్తున్నాయి. పొత్తులు కుదిరితే 2019 ఎన్నికలలో వైసీపీకి చుక్కలు కనబడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఎలా అంటే  2019లో వైసీపీకి తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ప్రత్యర్థులుగా వేరువేరుగా పోటీ చేశాయి. దీంతో ఓట్ల చీలక వల్లనే వైసీపీ అధికారంలోకి రాగలిగింది. పేరుకు 151 స్థానాలలో విజయం సాధించినా, నిజానికి వాటిలో దాదాపు 80 స్థానాలలో ఆ పార్టీ మెజారిటీ వేయి లోపే.. అంటే ఓట్లు చీలిపోవడం వల్ల వైసీపీ సీట్ల పరంగా భారీగా లాభపడింది. అదే వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఉంటే... 2014 ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలే ఎక్కవ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు వారు 2019 ఎన్నికల లెక్కలనే ఆధారాలుగా చూపుతున్నారు.  
 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలలో విజయం సాధించింది కానీ భారీ మెజారిటీ వచ్చిన స్థానాలు మాత్రం 60లోపే.  మిగిలిన స్థానాలలో వైసీపీ విజయం వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్లనేనన్నది వారి విశ్లేషణ. మల్లాది విష్ణు కేవలం పాతిక ఓట్ల తేడాతో విజయం సాధించారు.  జనసేన, తెలుగుదేశం పార్టీలు వేరువేరుగా పోటీ చేసిన కారణంతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలి తెలుగుదేశం నష్టపోయింది. వచ్చే ఎన్నికలలో పొత్తుల వల్లనే కాకుండా.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం వల్ల కూడా తెలుగుదేశం ఈ సారి భారీగా లబ్ధి పొందే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు విపక్ష ఓటు చీలకుండా పొత్తులు ఉంటే.. వైసీపీ రెండో సారి అధికారంలోకి రావాలన్న కల సాకారమయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని చెబుతున్నారు. 
అలాగే తెలుగుదేశం పార్టీకి  గట్టి పట్టు ఉన్న ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి గత ఎన్నికలలో దాదాపు స్వీప్ చేసినంత పనైంది. అయితే ఆ ప్రాంతాల్లో మెజారిటీలు మాత్రం స్వల్పంగానే ఉన్నాయి. ఇప్పడు ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను పరిగణనలోనికి తీసుకుంటే గోదావరి జిల్లాలు; ఉత్తరాంధ్రలో వైసీపీకి పూర్వపు ఆదరణ ఉండే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నాయి. ఎలాగూ అక్కడ గట్టి పునాది ఉన్న తెలుగుదేశం పూర్వవైభవం తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయనీ, దానికి ‘పొత్తు’ బలం కలిస్తే ఎదురే ఉండదనీ అంటున్నారు.  అదే జరిగితే ఈ సారి ఎన్నికలలో 2019 ఎన్నికల నాటి సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...