నారా రోహిత్ ‘ప్రతినిధి’ మీద కన్నేసిన జగన్ పార్టీ

 

నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి’ సినిమా ఈమధ్యే విడుదలై విజయవంతంగా ప్రదర్శిమవుతోంది. ఈ సినిమా మీద జగన్ పార్టీ కన్నేసింది. ఏ రకంగా కన్నేసిందనే విషయాన్ని క్లియర్‌గా చెప్పేముందు కొంచెం ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళాల్సిన అవసరం వుంది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా మీద మొన్నీమధ్య జగన్ పార్టీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. బాలకృష్ణ ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీకి ప్రచారం కూడా చేస్తున్నాడు. కాబట్టి ‘లెజెండ్’ సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం వుంది. అంచేత ఎన్నికలు అయ్యేంతవరకూ ‘లెజెండ్’ సినిమాని నిలిపేయాలంటూ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ ఈ సినిమా ప్రదర్శనని నిలిపేయడం ఖాయమన్నట్టుగా జగన్ మీడియా కూడా ప్రచారం చేసింది. అయితే ఎన్నికల కమిషన్ సభ్యులు ఈ సినిమాని చూసి ప్రదర్శన ఆపాల్సిన అవసరం లేదంటూ, నాలుగు కట్స్ తో సరిపెట్టారు. ఈమాత్రం దానికే ఏదో సాధించేసినట్టు జగన్ పార్టీ వాళ్ళు సంతోషపడిపోయారు. ‘లెజెండ్’ మీద సాధించిన ‘విజయం’ స్ఫూర్తితో ఇప్పుడు నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి’ సినిమా మీద జగన్ పార్టీయులు కన్నేశారు. ఈ సినిమాలో కూడా కొంచెం రాజకీయ నేపథ్యం వుంది. ఈ సినిమా హీరో నారా రోహిత్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నాడు. ఈ రెండు పాయింట్లనీ లింక్ చేసి, ‘ప్రతినిధి’ సినిమా ఓటర్లని ప్రభావితం చేసి, తెలుగుదేశం పార్టీకి మేలు చేసే అవకాశం వుందని, ఈ సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ని కోరాలని జగన్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇవాళో రేపో ‘ప్రతినిధి’ మీద కంప్లయింట్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది.