టెన్షన్ పడుతున్నారా? మంచిదే!

 

ఇప్పటి యువతది అంతా ప్రాక్టికల్‌ మార్గం. టెన్షన్‌ పడటం వల్ల పని జరుగుతుందా? టెన్షన్‌ పడితే మూడ్‌ పాడవటం వల్ల ఉపయోగం ఉందా? అందుకే టెన్షన్ పడకుండా కూల్‌గా ఉండాలన్నది చాలామంది దృక్పథం. వ్యక్తిత్వ వికాస నిపుణులు, పుస్తకాలు ఇదే మాటని పదే పదే చెబుతూ ఉంటాయి. టెన్షన్‌ పడేవాడు జీవితంలో పైకి ఎదగలేడు అని నూరిపోస్తుంటాయి. కానీ టెన్షన్‌ వల్ల ఉపయోగం ఉందంటున్నారు నిపుణులు.

 

ఆరోగ్యం బాగుంటుంది

 

ఈ విషయం చెప్పుకొనేందుకు ఆడవారినే ఉదాహరణగా తీసుకుందాం. ఒక వయసు దాటిన ఆడవారు బ్రెస్ట్ కేన్సర్‌కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఏ విషయానికీ పెద్దగా టెన్షన్ పడనివారు, ఈ సలహాని కూడా పట్టించుకోరు. దాంతో ఒకోసారి పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం గురించి కంగారు పడేవారు మాత్రం ఠంచనుగా సమయానికి తగిన పరీక్షలు చేయించుకుంటారు. ఇలా ఆరోగ్యసూత్రాలు ఠంచనుగా పాటించేలా ప్రోత్సహించే టెన్షన్ మంచిదేగా!

 

సిద్ధంగా ఉంటారు

 

టెన్షన పడేవారు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆలోచనలో ఉంటారు. తాము భయపడినట్లు జరిగితే ఏం చేయాలి అన్న ఉపాయం కూడా వారిదగ్గర సిద్ధంగా ఉంటుంది. కాబట్టి నిజంగానే ఏదన్నా అనుకోని ఆపద జరిగినప్పుడు ఠక్కున రంగంలోకి దూకేస్తారు. తమ ఉపాయాన్ని అమలుచేస్తారు. టెన్షన్ లేకుండా నిర్లప్తంగా ఉండేవారిలో ఇంతటి సంసిద్ధత ఉండకపోవచ్చునంటున్నారు.

 

సంతోషం రెట్టింపు

 

టెన్షన్‌తో ఉండేవారిలో సానుకూల దృక్పథం తక్కువగా ఉంటుంది. తాము తలపెట్టిన కార్యం పూర్తవుతుందో లేదో, పరిస్థితులు తమకి అనుకూలంగా ఉంటాయో లేదో అన్న అనుమానంలో ఉంటారు. అలాంటి సమయంలో విజయం వరించిందనుకోండి... ఇక వారి సంతోషానికి అవధులు ఉండవు. జీవితంలో టెన్షన్ పడనివారేమో- ‘ఆ జరగక చస్తుందా! జరిగితే మాత్రం అంత సంతోషించాల్సిన పని ఏముంది,’ అన్న స్తబ్దతలో ఉండిపోతారు.

 

నిబంధనలు పాటిస్తారు

 

టెన్షన్ పడేవారు ఎందుకొచ్చిన తంటా అనుకుంటూ అన్ని నిబంధనలూ ఖచ్చితంగా పాటిస్తారు. ఇవి వారికీ, సమాజానికీ కూడా మేలు చేయవచ్చు. ఉదాహరణకు సీట్‌ బెల్టు పెట్టుకోవడం, ఇన్‌ష్యూరెన్స్ పాలసీలు తీసుకోవడం, పన్నులు కట్టడం... లాంటి పనులన్నమాట!

 

అన్నింటా ముందుంటారు

 

టెన్షన్ పడేవారిలో తాము ఎక్కడ వెనకబడిపోతామో అన్న భయం ఉంటుంది, తమకి తెలియని విషయం ఏదన్నా ఉందేమో అన్న అనుమానం ఉంటుంది. అందుకే చదువులోనూ, ఉద్యోగంలోనూ... తలపెట్టే ప్రతి పనిలోనూ పరిపూర్ణతని సాధించే ప్రయత్నం చేస్తారు. అలా అన్నింటా ముందుంటారు.

 

ఇదంతా చదివాక లేనిపోని టెన్షన్‌ని అలవాటు చేసుకోమని ఎవ్వరూ చెప్పడం లేదు. కాకపోతే కాస్త టెన్షన్ ఉండటం సహజమే అనీ... అది అదుపులో ఉన్నంతవరకూ మంచిదేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

- నిర్జర.