వెలుగుల భవిష్యత్తు కోసం గంటసేపు చీకటి - EARTH HOUR

 

ప్రపంచం విద్యుత్తు మీద విపరీతంగా ఆధారపడుతోందనీ, ఆ విద్యుత్తుని ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనూ, విద్యుత్ పరికరాల వల్లా విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోందని పరిశోధనలు రుజువు చేస్తున్న విషయం తెలిసిందే! ఈ విషయమై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 2004లో World wildlife fund (WWF) ఏదన్నా కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంది. కానీ ఏం చేస్తే తాము చెప్పదల్చుకున్న విషయం ప్రజల్లోకి వెళ్తుందో ఆ సంస్థకి తెలియలేదు. చివరికి 2007లో ‘EARTH HOUR’ అనే ప్రచారం చేపట్టింది. ఒక గంటపాటు విద్యుత్ వాడకం లేకుండా చేయడమే ఈ ఎర్త్ అవర్ లక్ష్యం.

 

ఇలా 2007 మార్చి 31న సిడ్నీలో (ఆస్ట్రేలియా) సాగిన ఎర్త్ అవర్ కార్యక్రమం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక అప్పటి నుంచి ఈ ప్రయోగానికి తిరుగులేకుండా పోయింది. 2008లో ఈ కార్యక్రమంలో 35 దేశాలలోని 400 నగరాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయంటే ఈ ఆలోచన ఎంత విజయవంతమైందో తెలిసిపోతుంది. అది మొదలు ఏటా ఎర్త్ అవర్కు ప్రచారం, ప్రాధాన్యత పెరుగుతూ వస్తున్నాయి. నేషనల్ జాగ్రఫిక్, గూగుల్ వంటి సంస్థలు ఒకొక్కటిగా ఎర్త్ అవర్ను ప్రచారం చేసేందుకు సిద్ధపడుతున్నాయి.

 

 

ఎర్త్ అవర్ వల్ల ఓ గంట పాటు విద్యుత్తు వాడకం తగ్గుతుంది. దీని వల్ల కొన్ని టన్నుల కొద్దీ కార్బన్ డై ఆక్సైడ్ గాల్లోకి చేరకుండా ఆపినవారవుతాం. అంతేకాదు! ఎర్త్ అవర్ని పాటించడం వల్ల ప్రజల్లో పర్యావరణం పట్ల స్పృహ పెరుగుతోందని తేలింది. ఒక అంచనా ప్రకారం ఎర్త్ అవర్ తర్వాత, ప్రజల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాలనే తపన ఓ నాలుగు శాతం పెరిగిందట. చాలా సంస్థలు విద్యుత్తు పొదుపుని ఎర్త్ అవర్కే పరిమితం చేయకుండా... దీర్ఘకాలికంగా విద్యుత్తుని పొదుపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయట.

 

ఒక గంటసేపు విద్యుత్తు వాడకాన్ని తగ్గిస్తే ఏం ఒరుగుతుంది అని పెదవి విరిచేవారూ లేకపోలేదు. ఎర్త్ అవర్కు వ్యతిరేకంగా వీరు వినిపించే వాదనలూ లేకపోలేవు. ఎర్త్ అవర్ సమయంలో లైట్ల బదులు కొవ్వొత్తులను వెలిగించడం వల్ల వచ్చే కార్బన్ డై ఆక్సైడ్ సంగతి ఏంటి అని వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచాన్ని చీకటిలో మగ్గించే ఎర్త్ అవర్ సమయంలో నేరాలు, ప్రమాదాలు ఎక్కువయే ప్రమాదం ఉందని ఎత్తి చూపుతున్నారు.

 

 

ఎన్ని విమర్శలు ఎదురైనా ఎర్త్ అవర్ వెనుక ఉన్న ఉద్దేశం ఉన్నతమైనదే అని చాలామంది అభిప్రాయం. అందుకే ప్రభుత్వాలు సైతం ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈఫిల్ టవర్, బకింగ్హామ్ ప్యాలెస్, ఒపెరా హౌస్ వంటి ప్రముఖ పర్యటక స్థలాలన్నీ ఎర్త్ అవర్లో పాలు పంచుకుంటున్నాయి. మన దేశంలోనూ ఎర్త్ అవర్కు ఏటా ప్రాచుర్యం పెరుగుతూ వస్తోంది. గత ఏడాది రాష్ట్రపతి భవన్లో సైతం ఎర్త్ అవర్ను పాటించారు. ఈ ఏడాది ఎర్త్ అవర్ను మార్చి 25 రాత్రి 8:30 నుంచి 9:30 వరకూ జరుపుకోవాలని WWF పిలుపునిస్తోంది. మరి ఈ పిలుపుని అందుకునేదెవరో. ఎవరో దాకా ఎందుకు! మనమే ఓ గంటపాటు ఇంట్లో వీలైనన్ని విద్యుత్ పరికరాలను నిలిపివేస్తే సరి!

- నిర్జర.