1000కోట్లు... డబ్బు కాదు, జనం!

దేశమంటే మట్టి కాదోయ్... దేశం అంటే మనుషులోయ్! ఇది తెలుగు వారికి బాగానే తెలుసు. కాని, దేశమే కాదు... ప్రపంచమూ మట్టి కాదు. ప్రపంచం అంటే కూడా మనుషులే! ఈ విషయం 2050నాటికల్లా మరింత సుస్పష్టంగా తెలిసిపోనుంది. ఎందుకంటే, అప్పటికి మానవ జాతి చరిత్రలో మనిషి ఏనాడూ చేరుకోని స్థాయికి చేరుకుంటాడు! సంఖ్యా పరంగా భూమండలానికే అతి పెద్ద భారంగా మారిపోతాడు!. పాప్యులేషన్ రెఫరెన్స్ బ్యూరో అనే సంస్థ మానవ జనాభాకు సంబంధించి తన అంచనాలు ప్రకటించింది. ఈ సంస్థ చాలా దశాబ్దాలుగా వాల్డ్ పాప్యుషన్ గురించి ఆసక్తికర అంశాలు వెల్లడిస్తూ వస్తోంది. అలాగే, ఈసారి వినగానే షాకయ్యే గణాంకాలు బయటపెట్టింది!


ఇప్పటికే ప్రపంచ జనాభ విపరీతంగా పెరిగిపోయింది. ఆ పలితంగానే వుండేందుకు భూమి, తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం దొరక్క సతమతమైపోతున్నాం. అయితే, ఆందోళనకరంగా మన జనాభా ముందు ముందు ఇంకా పెరుగుతుందట! 
2050నాటికి 980కోట్ల సంఖ్యకి చేరతాడట మనిషి!ఆ తరువాత కేవలం మూడు ఏళ్ల వ్యవధిలో, అంటే, 2053సంవత్సరానికి కల్లా వెయ్యి కోట్లకు మానవ జనాబా పెరిగిపోతుందట! ఇంత భారం భూమాతపై వేయటం నిజంగా ఆందోళనపడాల్సిన విషయమే! అంతే కాదు, ప్రపంచ జనాభా వృద్ధి అంతటా ఒక్కలా లేదు. ఇది మరో ప్రమాదకర సంకేతం...


ప్రపంచం మొత్తం జనాభా పెరుగుతూ వుంటే ఒక్క యూరప్ ఖండంలో మాత్రం తగ్గుముఖం పడుతోంది! అక్కడ ఇప్పుడు 74కో్ట్లుగా వున్న జనం 2050నాటికి 72.8కోట్లకు తగ్గిపోతారట! కాని, మిగతా ప్రపంచం మొత్తం జనాభా పెరుగుతూనే పోతోంది. అమెరికాలు, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్ని మినహాయిస్తే ఆసియా, ఆఫ్రీకాల్లో మాత్రం 2053నాటికి పరిస్థితి తీవ్రంగా వుంటుంది!. భారత్, చైనా లాంటి పెద్ద దేశాలున్న అతి పెద్ద ఖండమైన ఆసియాలో జనాభా పెరుగుదల ఆశ్చర్యమేం కాదు. కాని, అత్యంత వెనుకబడిన ఆఫ్రీకాలో కూడా జనాభా అతి వేగంగా పెరిగిపోతోంది. 2053లో చాలా ఎక్కువ జనం వుండేది ఆఫ్రికాలోనే! అక్కడ సగటున ఒక్కో మహిళకు ఆరేడేగురు పిల్లలుంటారని అంచనా!


ప్రపంచ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగితే వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. సహజ వనరులు చాలక పేదల జీవితాలు నరక ప్రాయం అవుతాయి. అంతే కాదు, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు విపరీతంగా ముసలివారితో, ఖతార్ లాంటి దేశాలు విపరీతంగా పిల్లలతో నిండిపోయే ప్రమాదం వుంది. జననాల్లో వృద్ధి, మరణాల్లో తగ్గుదల ఇందుకు కారణం. 


ప్రపంచ దేశాలు అన్నీ కలిసి జనాభా పెరుగుదల  మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. కొన్ని సామాజిక వర్గాలు, మతాలు, ప్రాంతాలు ఎక్కువ జనాభా వృద్ధికి ఎందుకు కారణం అవుతున్నాయో విశ్లేషించాల్సిన అవసరం వుంది. అప్పుడే భూమికి భారం తగ్గి భూమాత ఊపిరి పీల్చుకుంటుంది! లేదంటే... దీర్ఘ కాలంలో ప్రళయాన్ని మనకు మనం ఆహ్వానించినట్టే!