వరల్డ్ హార్ట్ డే.. హార్ట్ అటాక్.. హార్ట్ ఫెయిల్యూర్.. ఈ రెండింటి మధ్య తేడా తెలుసా?


మనిషి శరీరంలో ప్రధాన  అవయవం గుండె.  గుండె ఎప్పుడైతే ఆగిపోతుందో.. అప్పుడు ఇక ఈ శరీరంలో ప్రాణం పోయినట్టే.. శరీరంలో ఏ అవయవ పనితీరు ఆగినా కొద్దికాలం పాటు అయినా శరీరం తట్టుకుని నిలబడుతుందేమో కానీ.. గుండె పని చేయడం ఆగితే క్షణాలలోనే ప్రాణాలు కూడా పోతాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు వివిధ రకాలుగా ఉన్నాయి. వాటిలో హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ ముఖ్యమైనవి.  చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడాలు తెలియవు.  ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన వరల్ట్ హార్ట్ డే జరుపుకుంటారు.  ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ మధ్య తేడా తెలుసుకుంటే..

 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వారే కావడం ఆందోళన కలిగించే విషయం. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ గుండెపోటు,  గుండె వైఫల్యం వంటి సమస్యలు చిన్న వయస్సులోనే వస్తున్నాయి.

గుండెపోటు..

గుండె కండరాలకు రక్త ప్రసరణకు ఆటంకం కలిగినప్పుడు లేదా అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. దీనికి ప్రధాన కారణం ధమనులలో ప్లేక్ పేరుకుపోవడం. కొలెస్ట్రాల్,  కొవ్వు నిక్షేపాలు ఫ్లేక్ లాగా ఏర్పడతాయి. ఈ ప్లేక్ పగిలినప్పుడు అది రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.

గుండెపోటు  లక్షణాలు..

తీవ్రమైన ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి. చేతులు, వీపు లేదా దవడకు  నొప్పి వ్యాపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. చెమట పట్టడం,  వికారం ఉంటుంది. గుండెపోటు  తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన పరిస్థితి. సకాలంలో చికిత్స తీసుకుంటే ప్రాణాలను కాపాడుతుంది.

గుండె వైఫల్యం..

గుండె ఆగిపోవడం అనేది  తీవ్రమైన పరిస్థితి. దీనిలో గుండె కండరం చాలా బలహీనంగా మారుతుంది.  శరీరానికి తగినంత రక్తం,  ఆక్సిజన్‌ను పంప్ చేయలేకపోతుంది. గుండె ఆగిపోవడం అంటే గుండె పూర్తిగా ఆగిపోయిందని కాదు,  గుండె దాని పంపింగ్ సామర్థ్యాన్ని కోల్పోవడం ప్రారంభిస్తుందని అర్థం. దీని అర్థం గుండె శరీరానికి అవసరమైనంత రక్తాన్ని సరఫరా చేయలేకపోతుంది. గుండె పనితీరు క్షీణిస్తుంది.

హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇది నెమ్మదిగా డవలప్ అవుతున్న  పరిస్థితి. ఎక్కువకాలం పాటు అధిక రక్తపోటు, మధుమేహం, పదే పదే గుండెపోటు రావడం, ధూమపానం లేదా ఊబకాయం దీనిని తీవ్రం చేస్తాయి. హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిన వ్యక్తిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్లలో వాపు, అలసట,  హృదయ స్పందన వేగంగా ఉండటం, రాత్రి పదే పదే  మేల్కొనడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

పైన చెప్పుకున్న విధానాన్ని బట్టి గుండెపోటుకు,  గుండె వైఫల్యానికి మధ్య తేడాలు,  అవి రావడానికి గల కారణాలు అర్థం చేసుకుని సమస్యను ముందే గుర్తించడం లేదా జాగ్రత్తలు తీసుకోవడం చేయవచ్చు.

                                   *రూపశ్రీ.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu