పనితో ప్రేమలో పడండి

 

మీరు ఎప్పుడన్నా మీ పనితో ప్రేమలో పడ్డారా ? లేదంటే వెంటనే ఆ పనిలో వుండండి. ఎందుకంటే రోజు సంతోషంగా ఉండాలంటే మీరు చేసే పనితో ప్రేమలో పడండి అంటున్నారు పరిశోధకులు . నిజానికి  చాలామందికి ఈ సీక్రెట్ తెలీక   జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు అంటున్నారు వారు . అదేదో బరువు మోస్తున్నట్టు  జీవితాన్ని ఎంతో కష్టం గా లాక్కు వెళుతుంటారు . అదేమంటే చేసే పని నచ్చితే కదా ! దానిని ఎంజాయ్ చేసేది అంటారు. అయితే  చేసే పని మీకు నచ్చినా నచ్చకపోయినా ముందుగా దానిని వందశాతం ప్రేమించటం మొదలు పెట్టండి.  అప్పుడు అది భారంగా అనిపించదు. అదెలా సాద్యం అంటే, చేసేపని మీద పూర్తిగా మనసుపెట్టి నప్పుడు, ఆ పని పూర్తి అయ్యేసరికి మనకి తెలియకుండానే ఒక సంతృప్తి కలుగుతుంది. 

 

 

సో... మనం చేసే పనిమీద ద్రుష్టి పెట్టాం కాని , అది మనకు నచ్చినదా , కాదా అన్న విషయం మీద కాదు కాబట్టి , ఆ క్షణం లో నిజంగా ఒక పనిని సమర్దవంతం గా పూర్తి చేసినప్పుడు కలిగే ఆనందాన్ని రుచి చూస్తాం. ఈ సూత్రం  చిన్న పని నుంచి పెద్ద పని దాకా అన్నిటికి వర్తిస్తుంది. చేసే పని ఏది అయినా సరే దానిని మనస్పూర్తిగా , శ్రద్దగా చేయటం అనే చిన్న అలవాటు ఒక్కటి చాలు మనకి కొండంత సంతోషాన్ని ఇవ్వటానికి.

 


 

చేసే పని నచ్చనప్పుడు అసహనం, కోపం కలుగుతాయి . అవి ఒకదాని నుంచి ఒకదానికి పాకి పోయి, రోజుని, ఒకో సారి  మొత్తం  జీవితాన్ని నిందిస్తూ  గడిపేస్తాం. దాని వల్ల నచ్చిన పనులని కూడా ఆనందం గా చేయలేము. ఇది ఒక చైన్ లా మొత్తం జీవితాన్ని చుట్టబెట్టేస్తుంది. దాంతో సెల్ఫ్ పిటి లోకి వెళ్ళిపోయి మన జీవితం ఇలా కావటానికి కారణం అంటూ చుట్టుపక్కల వాళ్ళని నిందించటం మొదలు పెడతాం . దానివలన అనుబంధాల మద్య పొరపచ్చాలు వస్తాయి. మళ్ళి దాని నుంచి బాధ .. నైరాశ్యం ..పుట్టుకొచ్చి మనసుని అల్లకల్లోలం చేస్తాయి. 

 

వింటుంటే ...నిజమా ? అన్న అనుమానం కలుగుతుంది కాని ఒక్కసారి మీలోపలకి మీరు ప్రయాణించి, మీ కోపానికి, అసహనానికి కారణాలని వెదకటం మొదలు పెట్టండి. మీరు చేసే పనిని మీరు ప్రేమించకపోవటమే కారణం అని తెలుస్తుంది. అంటున్నారు పరిశోధకులు. కొన్ని ఏళ్ల పాటు, వందల మందిపై వీరు జరిపిన పరిశోధనలలో బయట పడ్డ నిజం అది.


 

అందుకే చేసే ప్రతి పనితో ప్రేమలో పడదాం. అసలే జీవితం ఉన్నదే చిన్నది. అందులో సగం జీవితం పనిని చూసి విసుక్కోవటం తోనే సరిపోతే ఇక ఉన్న జీవితాన్ని హాయిగా ఆస్వాదించే అవకాశమే రాదేమో? కష్టంగా ఉన్నవాటిని ఇష్టంగా మార్చుకుంటే జీవితం ఎప్పుడు మూడు నవ్వులు ఆరు విజయాలతో కళకళలాడుతుంది. మరి మీ పనితో మీరు ప్రేమలో పడ టానికి సిద్దమేగా ? 

- కళ్యాణి