Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేటీఆర్ వ్యాఖ్యలపై నేతల మాటల యుద్ధం!
posted on: Apr 30, 2022 7:14AM
‘ఏపీలో కరెంట్, నీళ్లు లేవు.. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి’ అంటూ తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన చేసిన విమర్శలు ఇప్పుడు ఇరు రాష్ట్రాల నేతల మధ్య తీవ్ర దుమారమే లేపుతున్నాయి. ఏపీలో మౌలిక వసతులు లేవని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ నేతలు వరసగా విరుచుకుపడుతున్నారు. క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టుందని, దేశం మొత్తంలో హైదరాబాద్ బెస్ట్ సిటీ అని సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి వచ్చిన వారు అంటున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని రోడ్ల అధ్వాన్న స్థితి గురించే మాట్లాడుతున్నాయని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైందని కూడా ఆయన అన్నారు.
ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి స్పందిస్తూ.. ‘కేటీఆర్.. రా.. వచ్చి ఏపీ అభివృద్ధి గురించి కళ్లారా చూసి తెలుసుకో..’ అంటూ ఫైరయ్యారు. కేసీఆర్ మాదిరిగానే కేటీఆర్ కూడా పిట్టకథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. కేటీఆర్ కు స్నేహితుడెవరో ఏమి చెప్పారో కానీ.. నిన్నటి దాకా తాను హైదరాబాద్ లో ఉండి వచ్చానని, కరెంట్ లేక జనరేటర్ వేసుకోవాల్సి వచ్చిందని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏమిటో మీరు చెప్పుకోవచ్చు కానీ.. పక్క రాష్ట్రాలను విమర్శించడం తగదని హెచ్చరించారు.
అయితే.. హైదరాబాద్ లో బొత్స సత్యనారాయణ తన ఇంటి కరెంట్ బిల్లు కట్టలేదేమో.. అందుకే పవర్ కట్ చేసి ఉంటారని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘తెలంగాణలో రెండు నిమిషాలు కూడా కరెంట్ పోదు. వైసీపీ నేతల కుటుంబాలు హైదరాబాద్ లోనే ఉంటున్నాయి. ఇక్కడే ఉన్న జగన్ కుటుంబాన్ని అడిగినా తెలుస్తుంది’ అంటూ రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ గురించి కేటీఆర్ ఉన్న మాటే అన్నారంటూ బొత్స కౌంటర్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఉన్నమాటంటే ఉలుకెందుకు? అని ఆయన ప్రశ్నించారు.
మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ అలా మాట్లాడారన్నారు. ఏపీలో ఒక్క పంచాయతీరాజ్ లోనే 10 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు నిర్మించామని చెప్పారు. తెలంగానలో త్వరలో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే ఎవరో ఒకర్ని కించపరిస్తే ఓట్లు పడతాయని కేటీఆర్ విమర్శించారన్నారు.
అభివృద్ధి అంటే ఏమిటో విజయవాడ వచ్చి చూస్తే తెలుస్తుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కోస్తాంధ్ర ప్రజలు వెళ్లి హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టే అక్కడ అభివృద్ధి జరిగిందని విష్ణు చెప్పారు. తెలంగాణకు కల్చర్ నేర్పి.. డబ్బులు పెట్టుబడి పెట్టినందువల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. కొందరి రెండు కళ్ల సిద్ధాంతం వల్లే రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చిందన్నారు.
మొత్తం మీద ఏపీ మౌలిక వసతుల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల నేతల మధ్య దుమారం రేపుతున్నాయి.


.webp)



