పెన్సిలుతో పొడిచి, కొరికి కూతుర్ని హింసించిన తల్లి 

సమాజంలో మానవత్వం నశించిపోతోంది. అమానుషాలు పెరిగిపోతున్నాయి. సొంత మనుషులే కిరాతకులవుతున్నారు. మెంటల్ బ్యాలెన్స్ తప్పి సైకోల్లో ప్రవర్తిస్తున్నారు. ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇలాంటి దారుణ ఘటన జరిగింది. కన్నకూతురిపైనే తల్లి కిరాతకంగా ప్రవర్తించింది. కన్నకూతురిని పెన్సిలుతో 12 సార్లు పొడిచింది.  అనంతరం కొరికి గాయాలపాలు చేసింది తల్లి. 

 

కరోనా నేపథ్యంలో విద్యాలయాలు ఆన్‌లైన్‌ కాస్లులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఆరో తరగతి చదువుతున్న 12 ఏండ్ల  బాలిక ఇంట్లో వర్చువల్ పద్ధతిలో క్లాసులు వింటోంది. ఆ సమయంలో టీచర్ ఆ బాలికను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ బాలిక సమాధానం చెప్పకపోవడంతో ఆమె పక్కనే ఉన్న తల్లికి కోపం వచ్చి ఇలా కర్కశంగా ప్రవర్తించింది. టీచర్‌ ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేదంటూ కన్న కూతురిని దారుణంగా గాయపర్చింది. తన చేతిలో ఉన్న పెన్సిల్ తో 12 సార్లు పొడిచింది. అంతటితో ఆగని ఆ మహా తల్లి .. నోటితో కొరికి కూతురిని గాయపరిచింది. 
                      

అక్కను అమ్మ గాయపర్చడంతో అది చూసిన చిన్నకూతురు భయపడిపోయింది. తెలివిగా వ్యవహరించింది. 1098 ఛైల్డ్ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో  ఎన్జీవో ప్రతినిధులు వారి ఇంటికి చేరుకుని ఆ తల్లికి చివాట్లు పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు చికిత్స చేయించారు. కుమార్తెను పెన్సిలుతో పొడిచిన తల్లిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.