చలికాలం ఓ తలనొప్పి

 

చలికాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. హాయిగా కాస్త చల్లగాలికి అటూఇటూ తిరిగిరావాలనో... ఎటూ పోలేనంత చలి ఉంటే వెచ్చగా పడుకోవాలనో ఎవరికి మాత్రం తోచదు. కానీ చలికాలంతో పాటుగా వచ్చే అనారోగ్యాలు మనకి నిలకడ లేకుండా చేస్తాయి. జలుబు దగ్గర్నుంచీ పొడిబారిపోయే చర్మాల వరకూ రకరకాల సమస్యలు చిరాకు పెట్టేస్తాయి. వాటిలో ఒకటి తలనొప్పి...

 

ఎందుకు వస్తుంది
విపరీతమైన చలిగాలిలో తిరిగినప్పుడు తలనొప్పి రావడం సహజమే! దీని స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, మన మెదడులో ఉండే కొన్ని రక్తనాళాలు చలికి కుంచించుకుపోవడం వల్ల ఈ తలనొప్పి వస్తుందని ఊహిస్తున్నారు. చాలా సందర్భాలలో ఈ తలనొప్పి ఇలా వచ్చి అలా మాయమైపోతుంది. కానీ అప్పటికే జలుబు, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారిలో ఇది రోజంతా వేధించే ప్రమాదం ఉంది. ఇక మైగ్రేన్, సైనస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో మరింత తరచుగా తలనొప్పి బారిన పడే అవకాశం ఉంటుంది.

 

జాగ్రత్తలు
చలిగాలి బయట తిరగాల్సి వచ్చినప్పుడు తల, గొంతు భాగాలకు గాలి తగలకుండా ఏదన్నా చుట్టుకోవడం తొలి జాగ్రత్త. ఇదే కాకుండా ఈ కింది చర్యలు తీసుకోవడం వల్ల కూడా చలికాలపు తలనొప్పులను నివారించవచ్చు.

- చలికాలపు తలనొప్పి వచ్చిన వెంటనే కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల చాలా సందర్భాలలో వెంటనే ఉపశమనం లభిస్తుంది. వెచ్చని గదిలో, ప్రశాంతమైన మనసుతో తీసుకునే విశ్రాంతితో తలనొప్పి చిటికెలో దూరం అవుతుంది.


- చలికాలపు సూర్యరశ్మిలో తగినంత తీక్షణత ఉండదు. ఫలితంగా మన జీవగడియారంలో అనేక మార్పులు వస్తుంటాయి. దీని వలన మనం నిద్రపోయే వేళలలోనూ మార్పులు సహజం. ఇలా చలికాలంలో సరైన నిద్ర లేకపోయినా, అవసరానికి మించి నిద్రపోయినా తలనొప్పులు ఖాయమంటున్నారు.


- సాధారణంగా చలికాలంలో తక్కువ దాహం వేస్తుంది. పైగా ఏదన్నా పనిలో పడితే ఆ కాస్త దాహాన్నీ మనం పట్టించుకోం. దీని వలన మెదడులో కనుక ఉండాల్సినంత నీటిశాతంలో ఏమాత్రం తక్కువైనా వెంటనే మెదడు హిస్టామిన్లు అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా మనకు తగిన హెచ్చరికలు పంపుతుంది. ఈ హిస్టామిన్ల వలన తలనొప్పి తథ్యం. కాబట్టి ఏ పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా... చెంతనే ఒక నీళ్ల బాటిల్ ఉంచుకోవడం తప్పనిసరి! నీళ్లు పక్కనే ఉంటే దాహాన్ని విస్మరించం కదా!

- చలికాలంలో ఆకలి కూడా పెద్దగా కలగదు. దాంతో సమయానికి ఆహారం తీసుకోవడంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటాము. ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోవడం వల్ల కూడా తలనొప్పి కలిగే ప్రమాదం ఉంటుంది.

- సూర్యరశ్మిలో కాసేపు నిలబడటం వల్ల శరీరం కాస్త వెచ్చదనాన్ని పొందుతుంది. పైగా సూర్యరశ్మి నుంచి లభించే డి విటమిన్లో ఎలాంటి లోటు రాదు. ఒకోసారి విటమిన్ డి శరీరానికి తగినంత లభించకపోవడం వల్ల కూడా తలనొప్పులు వస్తాయని తేలింది.

రోజూ తగిన వ్యాయామం చేయడం, ఐస్ క్రీమ్ వంటి అతి చల్లటి పదార్థాలకు దూరంగా ఉండటం, చీటికీ మాటికీ మందులు వాడకపోవడం వంటి ఇతరత్రా జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా చలికాలపు చిరుగాలులను ఎలాంటి తలనొప్పులూ లేకుండా హాయిగా ఆస్వాదించవచ్చు.

 

- నిర్జర.