చిరంజీవికి రాజకీయంగా ఏమైనా ఉపయోగపడుతుందా?

సినిమాల్లో మెగాస్టార్... లైం లైట్ లో ఉన్నన్ని రోజులు తిరుగు లేని రారాజు... కానీ, రాజకీయాలు వచ్చేసరికి తన సత్తా చాటలేకపోయాడు చిరంజీవి. ఎంతో ఘనంగా ప్రారంభించిన సొంత పార్టీ ప్రజా రాజ్యం 2009 ఎన్నికల్లో బొక్క బోర్లా పడడంతో, దాన్ని కాస్తా తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపాడు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, మరియు సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ నుండే వ్యతిరేకత వచ్చింది. ఇవేవి పట్టించుకోకుండా తనకి తోచింది లేదా తనకి అనుగుణంగా మాట్లాడిన వాళ్ళు చెప్పింది మాత్రమే విన్నాడు చిరు. అతడి త్యాగానికి గుర్తుగా, కాంగ్రెస్ రాజ్యసభ సీట్ ఇచ్చింది.

కాంగ్రెస్ 2014  ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా పోవడంతో, చేసేదేం లేక, చిరు సినిమాల్లోకి తిరిగొచ్చే దిశగా అడుగులు వేశాడు. తన కొడుకు రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ లో ప్రత్యేక పాత్రా చేసినా, అది ఎవరికీ ఉపయోగపడలేదు. ఇక ఇలా కాదని, కొడుకుని నిర్మాత చేసి తమిళంలో హిట్ అయినా కత్తి అనే సినిమా రీమేక్ హక్కులు కొన్నాడు. ఈ సినిమా కి దర్శకత్వం వహించే బాధ్యత వినాయక్ కి ఇచ్చాడు.

అయితే, ఖైదీ నం 150 బాక్స్ ఆఫీస్ దగ్గిర ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. కొందరు మెసేజ్ ని పక్కకు పెట్టి, చిరు పైన ఎక్కువ ఫోకస్ చేసారు అని విమర్శిస్తే, మరి కొందరు చిరు సినిమాలో అవసరమైన అంశాలన్నీ ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు అంతటా జరుగుతున్న ప్రధాన చర్చ ఏంటంటే, ఖైదీ నం 150 చిరంజీవి పొలిటికల్ కెరీర్ కి ఎంత వరకు ఉపయోగపడుతుంది అని. నిజం చెప్పాలంటే, ఒక కమర్షియల్ సినిమాతో చిరంజీవి రైతులకి సంబంధించి సందేశం ఇవ్వడానికి గల ప్రధాన కారణం, పొలిటికల్ మైల్ ఏజ్ కోసమే అనే వాళ్ళు ఉన్నారు.

సినిమా విశ్లేషకులు చెప్పేదేంటంటే, ప్రేక్షకులు ఖైదీ నం 150  ని సినిమా లాగే చూస్తున్నారు తప్ప, మెసేజ్ గురించి ఆలోచించే ఉద్దేశ్యం లో లేరు. దానికి తోడు, వచ్చే ఎన్నికల్లో, చిరంజీవి కి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి వాళ్ళ నుండి గట్టి పోటీ ఏర్పడనుంది. చూద్దాం, చిరు తన తదుపరి చిత్రాలకి ఎలాంటి కథల్ని ఎన్నుకుంటాడో!