Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేంద్రం ఆదేశాలు సరే.. కేసీఆర్ ఏం చేస్తారు?
posted on: Aug 30, 2022 7:28AM
ఎట్టకేలకు రాష్ట్ర విభజన చట్టంలోని ఒక అంశంపై కేంద్రంలో కదలిక వచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు నెల రోజుల్లో చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ డిస్కమ్ లకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి విద్యుత్ అసలు వ్యయం రూ.3వేల 441 కోట్లు, ఆలస్యానికి సర్ చార్జీగా రూ.3వేల 315 కోట్లు చెల్లించాలని కేంద్రం తెలంగాణను ఆదేశించింది.
అంటే మొత్తం మూడు వేల ఏడు వందల కోట్లకుపైగా తెలంగాణ సర్కార్ ఏపీకి చెల్లించాల్సి ఉంది. అయితే ఈ విద్యుత్ బకాయిల చెల్లింపు వివాదం 2017 నాటిది. విభజన చట్టంలో ఉందని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం 2014 నుండి మూడేళ్ల పాటు తెలంగాణకు కరెంట్ సరఫరా చేసింది. అయితే సరఫరా చేసిన విద్యుత్ కు తెలంగాణ డబ్బులు చెల్లించకపోవడంతో నిలిపివేసింది. ఆ మూడేళ్ల పాటు సరఫరా చేసిన దానికీ తెలంగాణ సర్కార్ ఇంత వరకూ డబ్బులు చెల్లించలేదు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉందన్న కారణంగా.. విభజన చట్టంలో 57 శాతం కరెంట్ ను తెలంగాణకు కేటాయించారు. ఏపీకి కేవలం 43 శాతం కేటాయించారు.
అదనంగా ఇస్తున్న కరెంట్‌కు తెలంగాణ డబ్బులు చెల్లించాలి. మూడున్నరేళ్ల పాటు కరెంట్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అడిగి.. అడిగి చివరికి ఏపీ ప్రభుత్వం కరెంట్ సరఫరాను తెలంగాణ ప్రభుత్వానికి నిలిపి వేసింది. అయినప్పటికీ కరెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్టీ)కేసు వేసింది. తెలంగాణ జెన్కోను దివాలా దీసినట్లుగా ప్రకటించి తమకు రావాల్సిన నిధులు తమకు ఇప్పించాలని కోరింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్సీఎల్టీలో పిటిషన్ ఉపసంహరించుకుంది.
రెండున్నరేళ్ల పాటు ఒక్క రూపాయి చెల్లించమని అడగలేదు. కానీ గత సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. మరో వైపు తెలంగాణ సర్కార్ ఏపీకి తాము ఇవ్వడం కాదు.. తమకే ఏపీ ఇవ్వాలని అంటోంది. ఏపీ నుంచే తమకు ఐదు వేల వరకూ కోట్లు ఇవ్వాల్సి ఉందని.. లెక్కలు చూసుకుందాం రమ్మంటే రావడం లేదని ఆరోపిస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టులో ఉంది.
అయితే కేంద్రం వద్ద తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి జగన్.. ఆ డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు తెప్పించుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ ఎలా స్పందిస్తుందన్నది కీలకం. ఇప్పటికే అప్పులు కూడా పుట్టక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ ఇప్పుడు కొత్తగా కోర్టులో ఉన్న దానికి డబ్బులు చెల్లించమంటే.. సీఎం అంగీకరిస్తారా అన్నది కీలకం. ఇప్పటికే కేంద్రం ఆదేశాలను తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తప్పుపట్టారు. ఏకపక్షంగా బకాయిలు చెల్లించాలంటూ ఆదేశాలు ఇవ్వడాన్ని దేశ ద్రోహ చర్యగా అభివర్ణించారు. కేంద్రం తెలంగాణ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదనడానికి ఇదే ఉదాహరణ అని జగదీశ్ రెడ్డి అన్నారు.
రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేయాలన్నదే కేంద్రం కుట్ర అని తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన చేసిన ఒక ట్వీట్ లో ఏపీ విద్యుత్ సంస్థలే తెలంగాణకు 12 వేల941 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నఫలితం లేకపోయిందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన నిర్ణయాలను జీర్ణించుకోలేకే కేంద్రం ఇలాంటి ఆదేశాలు జారీ చేసిందని విమర్శించారు. దీనిని బట్టే కేంద్రం ఆదేశాల విషయంలో తెలంగాణ వైఖరి ఏ విధంగా ఉండబోతోందో అర్ధమౌతోందని పరిశీలకులు అంటున్నారు. కోర్టులో ఉన్న అంశంపై కేంద్రం ఇలా ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడం వల్ల ఉపయోగం ఉండదనీ విశ్లేషిస్లున్నారు.






