బీహార్ సీఎం నితీష్ రూట్లో చంద్రబాబు?.. లోకేష్ కు లైన్ క్లియర్ చేస్తారా?
posted on: Mar 6, 2026 9:01AM

ఏపీ, బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమా? ఈ రెండు రాష్ట్రాల్లో అసలేం జరుగుతోంది? గురువారం (మార్చి 5) బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయగా, ఏపీలో కూడా చంద్రబాబు ఉప ప్రధాని లేదా గవర్నర్ గా వెళ్లనున్నారని అంటున్నారు. ఇందులో నిజా నిజాలెంత? లోకేష్ సీఎం అవ్వడానికి మార్గం సుగమం చేస్తూ ఉపముఖ్యమంత్రి పవన్ కూడా కేంద్ర మంత్రిగా వెళ్లేందుకు అవకాశాలున్నాయంటూ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
బీహార్ లో నితీష్ సీఎం పదవికి రాజీనామా చేసి పెద్దల సభకు వెళ్తున్నారన్నది కన్ ఫర్మ్ అయ్యింది. ఆయన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ నుంచి ఒకరు సీఎం పదవిని అలంకరించబోతున్నారు. ఆ ఒక్కరు ఎవరై ఉంటారని చూస్తే.. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, నిత్యానంద రాయ్ అనే ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ పరిస్థితి ఏమిటి? ఆయనకు ఎలాంటి పదవి దక్కవచ్చు అని చూస్తే.. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు జేడీయూ పగ్గాలు కూడా అప్పజెప్పేలా కనిపిస్తోంది. ఇక్కడి వరకూ క్రిస్టల్ క్లియర్.
అయితే ఇక్కడ షిండేతో నితీష్ పోలిక ఏంటంటే పూలమ్మిన చోటే షిండే కట్టెలు అమ్ముతున్నారు. ఒకప్పుడు మహారాష్ట్ర సీఎంగా ఒక వెలుగు వెలిగి షిండే.. ఇప్పుడు తన సీట్ పవర్ సరిపోక డిప్యూటీ సీఎంగా సద్దుకుని రాజీపడ్డారు. అయితే నితీష్ మాత్రం ఆ పరిస్థితి తెచ్చుకోకుండా రాజ్యసభకు సీట్ రిజర్వ్ చేసుకున్నారంటున్నారు పరిశీలకులు. అలాగే బీజేపీ ముందు ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటీ ఇలా తమ ప్రభ కోల్పోయేలా చేస్తున్నదని విశ్లేషిస్తున్నారు. బీజేపీ తీరు ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికే విఘాతంగానూ చెబుతున్నారు.
అయితే ఇలాంటి ప్రభావం చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపై పడనుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను సీఎం చేయడం కోసం ఉప ప్రధాని పదవి, లేదా ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా చేపట్టే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ లోకేష్ పాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా పవన్ కళ్యాణ్ సైతం కేంద్ర మంత్రిగా వెళ్లనున్నారనీ అంటున్నారు. కానీ అదంత తేలికగా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
చంద్రబాబు దృష్టి మొత్తం ఇప్పుడు అమరావతి, పోలవరం, క్వాంటం వ్యాలీ, విశాఖ ఇండస్ట్రియల్ గ్రోత్ పై కేంద్రీకృతమై ఉంది. ఆయన అంతగా ఏపీ గ్రోత్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక.. ఇప్పటికిప్పుడు ఆయన తన కుమారుడికి లైన్ క్లియర్ చేయడం కోసం తప్పుకుంటారనే అధికారిక సంకేతాలు కానీ, ఫీలర్లుగానీ ఏవీ లేవు. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ అంటున్నారు. ఆ ట్రాప్ లో ఎవరూ పడవద్దన్న కామెంట్లు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.



.webp)


