పడుకునే ముందు పోట్లాడుకోవద్దు!

 

 

నిద్ర గురించి కావల్సినన్ని పరిశోధనలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉదాహరణకు తగినంత నిద్రలేకుండా అదేపనిగా పనిచేసేవారిలో రక్తపోటు, గుండెదడ ఎక్కువగా ఉన్నట్లు ఇటీవలే చికాగోలో జరిగిన ఒక సమావేశంలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇదంతా బాగానే ఉంది కానీ నిద్రపోయే ముందు మన ఆలోచనా విధానానికీ, జ్ఞాపకాలకీ ఏదన్నా సంబంధం ఉందా? అన్న విషయాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు కొందరు శాస్త్రవేత్తలు.

భయంకరమైన చిత్రాలు

లండన్‌కు చెందిన పరిశోధకులు తమ ప్రయోగంలో భాగంగా ఓ 73 మంది విద్యార్థులను ఎన్నుకొన్నారు. వీరికి నిద్రపోయే ముందు కొన్ని భయానక చిత్రాలను చూపించారు. గాయపడినవారు, ఏడుస్తున్న పిల్లలు, శవాలు... ఇలా మనసుని తొలచివేసే సన్నివేశాలు ఉన్న చిత్రాలను వీళ్లకి అందించారు. చిత్రాలను చూపించడమే కాదు, అభ్యర్థులలో కొందరికి- ‘మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ చిత్రాల గురించి అంతగా పట్టించుకోవద్దు,’ అంటూ సలహాని కూడా ఇచ్చారట. అలాంటి సలహాని అందుకున్నవారికి ఓ అరగంట తరువాత మళ్లీ అవే చిత్రాలను చూపించారు. వాళ్లంతా ఆ చిత్రాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో.... ఓ 91 శాతం మందే వాటిని గుర్తుచేసుకున్నారు.

ఒక రోజు తరువాత అయితే!

ప్రయోగంలోని రెండో దశలో భాగంగా మిగతా అభ్యర్థులకి ఒక రోజు తరువాత అవే చిత్రాలను చూపించారు. ఆశ్చర్యకరంగా... వారిలో 97 శాతం మంది వాటిని గుర్తుచేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే- చిత్రాలను పట్టించుకోవద్దని నిర్ణయించుకున్న కొందరు అభ్యర్థులు అరగంటలోనే వాటిని మర్చిపోవడంలో సఫలం అయితే, వాటి గురించి జ్ఞాపకాలతో నిద్రలోకి జారుకున్నవారు... రోజు గడిచినా కూడా వాటిని మర్చిపోలేకపోయారు.

జ్ఞాపకాలే కీలకం

నిద్రపోయి లేచిన తరువాత చేదు అనుభవం మరింత తీవ్రంగా నిక్షిప్తం అవడానికి కారణాన్ని కనుగొనేందుకు అభ్యర్తుల మెదడుని స్కానింగ్‌ చేసి చూశారు. దానిలో తేలిన విషయం ఏమిటంటే... మనలోని తాత్కాలిక జ్ఞాపకాలన్నీ కూడా మెదడులోని ‘హిపోక్యాంపస్’ అనే చోట నమోదవుతాయి. ఇక్కడే వీటిని తుంచేస్తే అవి దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారే అవకాశం తక్కువగా ఉంటుంది. అలా కాకుండా వాటిని మనసులోనే ఉంచుకుని నిద్రలోకి జారుకుంటే... ఆ ఆలోచనలు ‘హిపోక్యాపస్‌’ను దాటుకుని మెదడు అంతా పరుచుకుంటాయి.

మరిన్ని సూత్రాలకు ఆధారం

నిద్రపోయేటప్పుడు ప్రశాంతమైన మనసుతో ఉండాలన్న పెద్దల మాటను ఇది నిజం చేస్తోంది. అలా కాకుండా భార్యాభర్తలు గొడవపడుతూనో, పనికిరాని పుస్తకాలు చదువుతూనే పడుకుంటే పీడకలల మాట అటుంచి... అవి మన మెదుడలోనే తిష్టవేసుకుపోయే ప్రమాదం ఉందని తేలిపోతోంది. నిద్రపోయే ముందు ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండాలో, మనసులో ఎలాంటి ఆలోచనలకి చోటు ఇవ్వాలో చెప్పడం మాట అటుంచి... ఏదన్నా చేదు అనుభవం తాలూకు జ్ఞాపకాలు మనసులో ఎలా నిక్షిప్తం అవుతాయో, వాటికి చికిత్స ఎలా అందించవచ్చో సూచించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతోంది.

- నిర్జర.