అర్థం చేసుకోరూ....

 

 

పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. కానీ ఆ పంట, ఫలాలు అందించకుండానే ఎండిపోతోంది. ఈమధ్యకాలంలో వైవాహిక బంధంలో ఆనందం కంటే బాధే ఎక్కువ ఉంటోందని  యువతీ యువకులు గట్టిగా నమ్ముతున్నారని ఓ సర్వేలో తేలింది. అందుకు కారణం ఏంటి అని ప్రశ్నిస్తే... ‘అర్థం చేసుకోరు’అన్న సమాధానం వచ్చిందిట రెండు వైపుల నుంచి. ఎవరు ఎవరిని మొదట అర్థం చేసుకోవాలి, ఎవరు ఎవరి మాట వినాలి... ఇలా ఎన్నో ప్రశ్నలు వివాహ బంధాన్ని శాసిస్తున్నాయని తేలింది. సర్దుకుపోవటం అంటే ఓడిపోవటంగా తీసుకుంటున్నారు . దాంతో ఆ పదమే భార్య భర్తల సంబంధంలో వినిపించటం లేదుట. 

సమస్య గురించి మాట్లాడాలంటే చాలా వుంది. ఒకో జంటది ఒకో కథ. ఎవరి వాదన వారికుంది. తప్పు ఒప్పులు బయట వారు నిర్ణయించలేరు కాబట్టి.., నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. సమస్య సృష్టించుకోవటం ఎందుకు?  ఆ తర్వాత దాని పరిష్కారానికి ప్రయత్నించటం ఎందుకు?  ఇద్దరు ఒకటిగా మారేందుకు సిద్ధపడినప్పుడే ఆ బంధం కోసం, దానితో ముడిపడే వారి జీవితం కోసం ఒకసారి ఆలోచిస్తే మంచిది అని సూచిస్తున్నారు.  మనకి చాలా ముఖ్యం అనిపించినా దేనిని అయినా కాపాడుకోవటానికి చాలా ప్రయత్నిస్తాం కదా. అంటే మనం ముఖ్యం అనుకున్నామా లేదా అన్నదే ఇక్కడ మన ఆలోచనలని రూల్ చేస్తోంది. అందుకే బంధం కలకాలం నిలవాలంటే ఆ బంధం జీవితంలో ముఖ్యమైనది అని మొదట నమ్మాలి. 

సమవుజ్జీల మధ్య గెలుపోటములు వుండవంటారు. అలాగే ఇద్దరు వ్యక్తులు కలసి ఒకటిగా నడిచే జీవితంలో కూడా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. గెలిచినా, ఓడినా అది ఇద్దరిదీ. ఈ విషయం ఒక్కటి అర్థం అయితే పట్టుదలలు వుండవు, ఆరోపణలు వుండవు. నా మాటే నెగ్గాలనే తాపత్రయాలు వుండవు. పక్క మనిషి ఓటమిలోంచి వచ్చే కన్నీటిని చూస్తూ నాదే విజయం అని ఆనందించటానికి ఇది ఆట కాదు, జీవితం. మనిషిని గెలిచి, మనసుని ఓడిపోవటం ఎంత తెలివి తక్కువ చెప్పండి. మనసులని గాయపరుచుకుంటూ, ఇద్దరు మనుషులు నూరేళ్ళు ఒక గూటిలో కలసి వుండటం అంటే అది ఇద్దరూ, ఇద్దరికీ కోరి వేసుకుంటున్న శిక్ష. ఇక్కడ శిక్ష వేసిన వ్యక్తీ కూడా శిక్ష అనుభవిస్తారు, అదే విచిత్రం. అందుకే నూరేళ్ళ పంట... పచ్చగా పదికాలాలు నిలబడాలంటే  ఆ బంధం కోసం కొంచెం ఆలోచించాలి, మరికొంచం తెలుసుకోవాలి. ఇంకొంచం శ్రద్ద పెట్టాలి. 

అసలు ఆడ, మగ ఆలోచనా విధానంలోనే వుంది అసలు చిక్కంతా. అది తెలుసుకుంటే చాలు అన్ని చిక్కుముళ్ళు ఇట్టే విప్పేయచ్చు అంటున్నారు నిపుణులు. ఏంటి ఆ చిక్కులు, వాటిని విప్పే చిట్కాలు? చెప్పుకుందాం, వచ్చేవారం ఇక్కడే కలుసుకుందాం.. అప్పటిదాకా మీ జీవితంలో పెళ్ళి ఎంత ముఖ్యమైనదో ఆలోచించండి... ఆ కారణాలని ఓ పేపర్ మీద రాసి పెట్టండి. ఇప్పటికి ఇదే హోంవర్క్... మళ్ళీ కలుసుకునే దాకా...

-రమ