ఎన్నికలంటే చంద్రబాబు అంతలా భయపడుతున్నారా?

 

తెలుగుదేశం పార్టీ. 37 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన పార్టీ. జాతీయ స్థాయిలో తిరుగులేని పార్టీగా పేరున్న కాంగ్రెస్ ని ఢీ కొట్టిన పార్టీ. మరి అలాంటి పార్టీ ఎన్నికలకు భయపడుతోందా? ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదోక పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది? ఇవి సగటు టీడీపీ కార్యకర్తను వేధిస్తున్న ప్రశ్నలు. బీజేపీ, టీఆర్ఎస్, వామపక్షాలు, జనసేన ఇలా దాదాపు అన్ని పార్టీలతో ఏదోక ఎన్నికల్లో టీడీపీ కలిసి పనిచేసింది. అంతెందుకు ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 37 ఏళ్ళ విరోధాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ తో కూడా కలిసి పనిచేసింది. ఆ సమయంలో ఇక టీడీపీ పొత్తుపెట్టుకోకుండా మిగిలింది ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీనే అంటూ విమర్శలు కూడా వినిపించాయి.

తెలంగాణలో అంటే టీడీపీ మునుపటిలా బలంగా లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది అనుకున్నాం. మరి ఏపీలో ఏమైంది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. రోజురోజుకి మరింత బలపడుతుంది. అయినా ఒంటరిగా పోటీ చేస్తామని కుండబద్దలు కొట్టినట్టుగా ఎందుకు చెప్పట్లేదు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో.. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఆలా ఉంది. ఒక్క సీటు అయినా గెలుస్తుందని నమ్మకం లేకపోయినా.. కాంగ్రెస్ మొత్తం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ధైర్యంగా చెప్తుంది. మరి 175 స్థానాల్లో బలంగా ఉన్న టీడీపీకి ఆ ధైర్యం ఏమైంది? ఎందుకు వచ్చే ఎన్నికల్లో ఏదైనా పార్టీ తమతో కలిసి వస్తుందా అని ఎదురుచూస్తుంది? అంటూ టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'టీడీపీ కొత్తగా వచ్చిన పార్టీ కాదు. ఏపీలో బలంగా లేని పార్టీ కాదు. మరి అలాంటప్పుడు మిగతా పార్టీలతో పొత్తు ఎందుకు?. పొత్తు వల్ల టీడీపీకే నష్టం తప్ప ఒరిగేదేమి లేదు. ఆ పార్టీలకు కొన్ని స్థానాలు కేటాయించడం వల్ల.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆశావహుల్లో అసంతృప్తి పెరుగుతుంది. అదీగాక ఇంతకాలం వ్యతిరేకించిన వారితో కలిసి పనిచేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది' అని టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి ఏపీలో ఒంటరిగా పోటీచేసినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండి కూడా టీడీపీ అధినేత ఇతర పార్టీల వైపు ఎందుకు చూస్తున్నారో? ఇకనైనా కార్యకర్తల ఆవేదన పట్టించుకోని ఒంటరిగా బరిలోకి దిగుతారేమో చూడాలి.