వేతనాలు తగ్గిస్తే చప్పట్లా! ఉద్యోగ సంఘాల నేతలు అమ్ముడుపోయారా? 

posted on: Jan 8, 2022 8:02AM

ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎంతో అశతో ఎదురుచూస్తుంటారు. పీఆర్సీ ఇస్తే జీతాలు పెరుగుతాయని వాళ్ల ఆశ. కాని ఏపీలో మాత్రం సీన్ రివర్సైంది. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించినా ఉద్యోగులకు నిరాశే మిగిలింది. పీఆర్సీ ప్రకటించాకా ఎక్కడా లేని విధంగా ఏపీలో ఉద్యోగులకు జీతాలు తగ్గనున్నాయి. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. ఉద్యోగులకు ఇప్పటికే ఐఆర్‌ 27 శాతం ఉండగా..ఇప్పుడు ఫిట్‌మెంట్‌ 23 శాతం ఉండడంతో 4 శాతం జీతాలు తగ్గనున్నాయి. తగ్గిన ఫిట్‌మెంట్‌ ప్రభావంతో డీఏలు.. హెచ్‌ఆర్‌ఏల్లో కూడా కోత పడుతుందని ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు. ఐఆర్‌ కన్నా తక్కువ ఫిట్‌మెంట్‌ చరిత్రలో ఎక్కడా ఇవ్వలేదని తెలుస్తోంది. జీతాల్లో కోసేసి, డీఏలతో భర్తీ చేస్తారా? డీఏలను పీఆర్సీగా ఇవ్వడం వైసీపీ సర్కారు మొదలుపెట్టిన దుష్ట సంప్రదాయమని చెబుతున్నారు. రిటైర్మెంట్‌ పీఆర్సీలో భాగమే కాదు. పీఆర్సీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించింది. రిటైర్మెంట్‌ వయసు సర్వీ‌స్ విషయం. రెండింటినీ కలిపేసి ఆ ముసుగులో వేతనాలు తగ్గించేశారనే విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించింది. నిజానికి అక్కడి వేతన సవరణ కమిషన్‌ ఏడు శాతమే సిఫారసు చేసింది. ఉద్యోగుల ఆందోళనలతో ఆ సర్కారు 30 శాతం ఇచ్చింది. ఏపీలో అసలు అశుతోష్‌ కమిషన్‌ ఎంత ఫిట్‌మెంట్‌ సిఫారసు చేసిందో  అసలా నివేదికే బయటపెట్టలేదు. సీఎస్‌ కమిటీ నివేదికపైనే ఉద్యోగ సంఘాలతో చర్చోపచర్చలు, పీఆర్‌సీ ప్రకటన జరిగిపోయాయు. చంద్రబాబు ఇచ్చిన సంఖ్యకు తిరగేసి అయినా (34 శాతం) ఇస్తారని.. లేదంటే తెలంగాణ ఇచ్చినట్లు 30 శాతమైనా ఫిట్‌మెంట్‌ ఇస్తారని ఆశగా ఎదురు చూసిన ఉద్యోగులకు జగన్‌ ఝలక్‌ ఇచ్చారు. ప్రతిదీ చంద్రబాబు కన్నా మిన్నగా చేస్తున్నామని చెప్పే జగన్‌.. పీఆర్‌సీలో ఆయనతో పోటీపడలేక.. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యతో పోటీపడి ఫిట్‌మెంట్‌ ప్రకటించారని కొందరు సోషల్‌ మీడియాలో ఎద్దేవాచేస్తున్నారు

2014లో రాష్ట్ర విభజన జరిగింది. రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటుతో నవ్యాంధ్రప్రదేశ్‌లో పాలన ప్రారంభించిన చంద్రబాబు.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రభుత్వ ఉద్యోగులకు సంతృప్తి కలిగించేలా 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన సెక్రటేరియట్‌ ఉద్యోగులకు మరెన్నో సౌకర్యాలు కల్పించారు. అప్పుడే ఆయన 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే.. ప్రసుత్తం పెరిగిన ధరలతో 55 ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఉద్యోగులు కోరారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం తగ్గి కనీసం 45 శాతానికైనా అంగీకరిస్తుందని భావించారు. ఇందుకోసం ఆందోళనలకు కూడా దిగారు. ఇవేవీ పట్టించుకోని జగన్‌ సర్కారు 20 శాతం కోత పెట్టింది. ‘ఇది పే రివిజన్‌ కాదు.. పే రివర్స్‌’ అని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఫిట్‌మెంట్‌ను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచడం వల్ల ప్రభుత్వానికి డబ్బు మిగులుతుందే తప్ప తమకు ప్రయోజనం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులకు ప్రతినిధులా? లేక ప్రభుత్వం చెప్పింది విని ఊ కొట్టడానికి ప్రభుత్వం ప్రతినిధులా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు పీఆర్సీ ప్రయోజనాలు సాధించడంలో నేతలు దారుణంగా విఫలమయ్యారని మండిపడ్డారు. సీఎంను కలవడం కోసం తహతహలాడిన నాయకులు ఉద్యోగులకు ప్రయోజనాలు సాధించడంలో ఆ తపన కనబరచలేదని ధ్వజమెత్తారు. ఉద్యోగుల సమస్యలను అడ్డం పెట్టుకుని సీఎంను కలిసే ముచ్చట తీర్చుకున్నారని ఎద్దేవా చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...