కోపం ఒక శాపం!

ఓ ఊళ్లో ప్రశాంత్‌ అనే కుర్రవాడు ఉండేవాడు. అతను పేరుకి మాత్రమే ప్రశాంత్‌. కోపం మాత్రం ముక్కుమీదే ఉండేది. రోజూ ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవడం, అవతలి వాళ్ల వయసుకీ, వ్యక్తిత్వానికీ గౌరవం ఇవ్వకుండా నానా మాటలు అనడం… ఇదీ ప్రశాంత్‌ గుణం. ప్రశాంత్‌ చూడటానికి ముచ్చటగా ఉండేవాడు, ఏ పనిని మొదలుపెట్టినా సమర్థవంతంగా పూర్తిచేసేవాడు. కానీ ఏం లాభం! కోపం వస్తే విచక్షణ లేని పశువుగా మారిపోతాడు. ప్రశాంత్‌ గురించి ఊరంతా చెడుగా చెప్పుకుంటుంటే అతని తల్లిదండ్రులకు బాధగా ఉండేది. కానీ నయాన భయాన ఎంతగా నచ్చచెప్పినా వాళ్లు ప్రశాంత్‌లో మార్పుని తీసుకురాలేకపోయారు. చివరికి ప్రశాంత్‌ తండ్రికి ఓ ఉపాయం తట్టింది. ఆ సాయంత్రం ప్రశాంత్‌ను పిలిచి “ఎన్నిరోజులు ఎదురుచూసినా నీలో మార్పు రావడం లేదు బాబూ!” అన్నాడు దీనంగా.

“ఏం చేసేది నాన్నా! కోపం వస్తే నన్ను నేను మర్చిపోతాను. కోపాన్ని అదుపుచేసుకోవడం నా వల్ల కావడం లేదు” అని అంతే దీనంగా బదులిచ్చాడు ప్రశాంత్‌.

“సరే దీనికి నేనో ఉపాయాన్ని ఆలోచించాను విను. నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో మన పెరటిగోడ దగ్గరకి వెళ్లి నీ బలమంతా ఉపయోగించి ఓ మేకుని కొట్టు. అలా నీ కోపం చల్లారుతుందేమో చూద్దాం” అన్నాడు తండ్రి.

తండ్రి చెప్పిన ఉపాయం ప్రశాంత్‌కి నచ్చింది. తనకి కోపం వచ్చిన ప్రతి సందర్భంలోనూ పెరటిగోడ దగ్గరకి వెళ్లి తన కోపమంతా ఉపయోగించి ఓ మేకుని గోడలోకి కొట్టేవాడు. ఆశ్చర్యంగా, రోజులు గడుస్తున్న కొద్దీ అతనిలో తెలియని ఓ ప్రశాంతత అవహించింది. రోజురోజుకీ అతను కొట్టే మేకుల సంఖ్య తగ్గసాగింది. ఒకో రోజైతే అసలు మేకుని కొట్టాల్సిన అవసరమే రావడం లేదు!

“నాన్నాగారూ! మీరు చెప్పిన ఉపాయం భలే పనిచేసింది. నాకు ఇప్పుడు కోపం వచ్చినప్పుడు అదుపు చేసుకోగలుగుతున్నాను” అన్నాడు ఓ రోజు ప్రశాంత్‌ తన తండ్రితో.

“మంచిది! ఇప్పుడో పని చేద్దాం. నువ్వు ఒక రోజంతా నీ కోపాన్ని అదుపుచేసుకున్నప్పుడు, దానికి గుర్తుగా ఇప్పటివరకూ కొట్టిన మేకులలో ఒకదాన్ని బయటకి తీయి” అని సూచించాడు తండ్రి.

“ఓస్‌ అదెంత భాగ్యం! తొందరలోనే ఆ గోడకి ఉన్న మేకులన్నీ ఖాళీ అయిపోతాయి చూడండి” అన్నాడు ప్రశాంత్‌ గర్వంగా.

అన్నమాట ప్రకారమే కొన్నాళ్లకి ఆ మేకులన్నింటినీ బయటకు లాగిపారేసే అవకాశం వచ్చింది ప్రశాంత్‌కు. ఒక శుభదినాన ఆ గోడంతా ఖాళీ అయిపోయింది. ఆబగా తన తండ్రిని ఆ గోడ దగ్గరకు లాక్కువచ్చి “చూశారా నాన్నా! ఈ గోడ ఒకప్పటిలాగే ఉంది. నా కోపం మీద పూర్తిగా పైచేయి సాధించాను” అన్నాడు గొప్పగా!

ప్రశాంత్‌ మాటలకు అతని తండ్రి చిరునవ్వు నవ్వుతూ “ఇంకొకసారి జాగ్రత్తగా చూడు బాబూ! ఈ గోడ ఒకప్పటిలాగానే ఉందా!” అని అడిగాడు. లేదు! ఆ గోడు ఒకప్పటిలా అందంగా లేదు. దాని మీద కొట్టిన మేకుల దెబ్బలకి గోడ మొత్తం తూట్లు పడిపోయి ఉంది.

“మన కోపం కూడా ఇంతే బాబూ! కోపంలో మనం నానా మాటలూ అంటాం. విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తాం. కానీ కాలం గడిచి ఆ కోపం చల్లారాక జరిగిన నష్టాన్ని నివారించలేం. అప్పటికే మనం అన్న మాటలు ఒకరి మనసుని నొప్పించి ఉంటాయి. మన ప్రవర్తన ఎవరికో బాధ కలిగించి ఉంటుంది. ఆ తరువాత నువ్వు ఎన్ని క్షమాపణలు వేడుకున్నా కాలాన్ని వెనక్కి మళ్లించలేవు కదా!” అన్నాడు అనునయంగా. తండ్రి మాటలతో తన ఒకప్పటి ప్రవర్తనను గుర్తుతెచ్చుకుని కుమిలిపోయాడు కొడుకు.