TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీహార్ మొగ్గు ఎవరి వైపు?.. సర్వే చెబుతున్నదేంటంటే?

Published on: Mon Oct 13, 2025 6:59AM

బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్డీయే, ఇండియా కూటములు ఈ ఎన్నికలలో హోరాహోరీ తలపడుతున్నాయి. రెండు కూటములూ కూడా సీట్ల సర్దుబాటు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ మల్లగుల్లాలు పడ్డాయి. అసంతృప్తులు, ఆగ్రహజ్వాలలతో రెండు కూటములూ ఇబ్బందులు పడ్డాయి.  అభ్యర్థుల ఎంపిక విషయంలో రెండు కూటములూ కూడా ఇంకా చర్చోపచర్చలు జరుపుతూనే ఉన్నాయి.  ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఊగాహాన సభలు జోరుగా సాగుతున్నాయి.  సరే అవన్నీ పక్కన పెడితే   సీఎంగా బీహార్ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు; నితీష్ కుమారా; తేజస్వి యాదవా; జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిశోరా? అన్న అంశంపై తాజాగా  ఇండియా టుడే-సి ఓటర్ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో మహాఘట్ బంధన్ (ఇండియా కూటమి) అభ్యర్థి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వైపే జనం మొగ్గు ఉందని తేలింది. ఆశ్చర్యకరంగా ఈ సర్వేలో ప్రస్తుత ముఖ్యమంత్రి జేడీయూ అధినేత, ఎన్డీయే కూటమి అభ్యర్థి నితీష్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. తేజస్వియాదవ్ తరువాత  

రెండవ పేరు జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ పేరు ఉంది.    ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మూడో స్థానంలో ఉన్నారు.  సర్వే ప్రకారం బీహార్ లో 36 శాతం మంది ప్రజలు తేజస్విని యాదవ్ ను సీఎంగా కోరుకుంటున్నారు. ఇక జన సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ సీఎం కావాలని కోరుకుంటున్న వారి శాతం 23గా ఉంది. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ వైపు కేవలం 16శాతం మంది మాత్రమే మొగ్గు చూపుతున్నారు.   ఇక   ఎల్‌జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సీఎం అవ్వాలని 8.8 శాతం మంది, బీజేపీ నాయకుడు, ప్రస్తుతం నితీష్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా ఉన్న  సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి కావాలని 7.8 శాతం మంది ప్రజలు  కోరుకుంటున్నారు.  

ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయమేంటంటే.. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్‌డీఏ కూటమిలో బీజేపీ.. జేడీయూ కంటే ఎక్కువ స్థానాలలో విజయం సాధించింది. అప్పటి ఎన్నికలలో  74 స్థానాలు జేడీయూకు 43 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే.. బీజేపీ వెనక్కు తగ్గి నితీష్‌నే ముఖ్యమంత్రిగా చేసింది. ఈసారి కూడా ఎన్‌డీఏ తరపున నితీష్‌ కుమారే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇప్పటికే ప్రకటించేసింది కూడా. అయితే తొమ్మిది సార్లు సీఎంగా ఉన్న నితీష్ కుమార్ కు రాష్ట్రంలో ప్రజాదరణ గణనీయంగా తగ్గిపోయింది. ఆ విషయాన్ని ఈ తాజా సర్వే ఫలితాలు మరోసారి ఎత్తి చూపాయి.  అదలా ఉంటే.. 

బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశలో 121 స్థానాలకు, రెండో దశలో మిగిలిన 122 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఇండియా టుడే- సీఓటర్ సర్వే ఏ మేరకు నిజమౌతుందో తేలాలంటే అప్పటి వరకూ వేచి చూడాల్సిందే.