TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్, కేటీఆర్, హరీష్ మౌనం వెనుక వ్యూహం ఏంటి?

Published on: Fri Sep 5, 2025 4:19PM

కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ ఇప్పటి వరకూ ఎన్నడూ ఎదుర్కొనని మహా సంక్షోభంగా చెప్పుకోవలసి ఉంటుంది.  కేసీఆర్ కుమార్తెగా కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ కూడా అత్యంత క్రియాశీలంగా వ్యవహరించారు. అయితే ఆమె ఉన్నట్లుండి పార్టీకి ఎదురు తిరిగారు. స్వయంగా కన్నతండ్రే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకూ తెచ్చుకున్నారు. అయినా కూడా తగ్గేదే లే అంటూ.. మాజీ  మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. హరీష్ నుంచి పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్ కు ముప్పు ఉందని హెచ్చరించారు. అలాగే తన సోదరుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీని సమర్ధంగా నడిపించడంలో విఫలమయ్యారని నిందించారు. కవిత ఆ ఆరోపణలన్నీ.. తాను పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా చేసినవి. పార్టీలో ఉండగా కవిత చేసిన విమర్శలు, వ్యాఖ్యలపై మౌనం వహించారంటే అర్ధం చేసుకోవచ్చు కానీ.. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం, దానికి ప్రతిగా ఆమె రాజీనామా చేసిన తరువాత  కూడా కవిత విమర్శలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ ల నుంచి స్పందన కరవైంది.

కవిత ఆరోపణలు విమర్శలపై   కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ స్పందించకపోవడంపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  వివాదాస్పద కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంతా హరీష్ రావుదే అన్న విమర్శ కు కూడా   కేసీఆర్, కేటీఆర్, హరీష్ ల నుంచి స్పందన లేకపోవడం పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

కనీసం హరీష్ రావు అయినా కవిత తనపై చేసిన విమర్శలకు దీటుగా బదులిస్తారని ఆశించిన పార్టీ శ్రేణులకు కూడా ఆయన మౌనం అంతుపట్టడం లేదంటున్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న హరీష్ రావు అక్కడి పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులతో భేటీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికే పరిమితమయ్యారు. దీంతో కవిత ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మౌనం వెనుక వ్యూహం ఏమిటన్నది పరిశీలకులకు సైతం అంతుపట్టడం లేదు.