కొవ్వు కరగడానికి చిన్న చిట్కా


ఒళ్లు తగ్గాలనీ, ఒంట్లోని కొవ్వు కరగాలని ఎవరికి మాత్రం ఆశగా ఉండదు. చేసే పనికంటే తీసుకునే ఆహారం ఎక్కువగా ఉన్న ఈ రోజులలో ఊబకాయం మన జోలికి రాకూడదని ఎవరికి మాత్రం తోచదు. ఓ పరిశోధనా ఫలితాలు అలాంటివారికి శుభవార్తలా తోచడం ఖాయం.

 

ఆహారమే ధ్యాస

సాధారణంగా మనం ఆహారం తీసుకునే సమయం ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా ఉండవచ్చు. అంటే సుమారుగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఎప్పుడైనా ఆహారం తీసుకుంటూ ఉంటాం. దీనికి విరుద్ధంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలలోపు ఆహారం తీసుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేశారు అలబామా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. ఇలా ఆహారాన్ని కాస్త ముందుగానే తీసుకునే విధానాన్ని early time-restricted feeding (eTRF) అంటారు.

 

అన్నీ సర్దుకున్నాయి

eTRF వల్ల ఉపయోగం ఉందో లేదో తెలుసుకునేందుకు పరిశోధకులు, ఊబకాయంతో బాధపడుతున్న ఓ 11 మందిని ఎన్నుకున్నారు. వీరికి ఓ నాలుగు రోజులపాటు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది లోపు ఆహారాన్ని అందించారు. మరో నాలుగురోజులు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండుగంటల లోపే ఆహారాన్ని తీసుకునేట్లు నిర్దేశించారు. ఈ రెండు సందర్భాలలోనూ ఒకే మోతాదు ఆహారాన్ని తీసుకున్నా కూడా, అది వారి శరీరం మీద చూపే ప్రభావంలో స్పష్టమైన మార్పులు ఉన్నట్లు గమనించారు. మధ్యాహ్నం రెండింటి లోపే ఆహారాన్ని తీసుకున్నవారిలో జీవక్రియలు చాలా చురుగ్గా ఉండటాన్ని గమనించారు. వీరిలో కొవ్వు కూడా చాలా వేగంగా కరుగుతున్నాయని తేలింది.

 

ఇదీ కారణం

ప్రతి మనషిలోనూ ఒక జీవగడియారం పనిచేస్తుందనీ, అది ప్రకృతికి అనుగుణంగా నడుస్తుందనీ తెలిసిన విషయమే! ఈ జీవగడియారం ప్రకారం ఉదయం వేళల్లో మనలో అనేక జీవక్రియలు (metabolism) జరుగుతుంటాయి. అదే సమయంలో మన శరీరానికి ఆహారం అందటం వల్ల దానిని వీలైనంత సమర్థంగా జీర్ణం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎలుకల మీద ఇది వరకే చేసిన ప్రయోగాలలో కూడా eTRf వల్ల వాటిలో కొవ్వు వేగంగా కరగడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరలేదని వెల్లడయ్యింది.

 

eTRF తరహా ఆహార పద్ధతికి సంబంధించి ఇవి ప్రాథమిక పరిశోధనలు మాత్రమే. ఎలాంటివారు ఎంతకాలం ఈ పద్ధతిని ఆచరించవచ్చు అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కాకపోతే భారతీయ వైద్య విధానంలో మాత్రం ఈ తరహా ప్రయోగాలు కొత్తేమీ కాదు. ఎందుకంటే ప్రకృతి వైద్యచికిత్స ప్రకారం ఉపవాసం మొదలుపెట్టిన రోజు నుంచి మర్నాడు ఉదయం వరకు కూడా ఏమీ తీసుకోకపోవడమే సత్ఫలితాన్నిచ్చే ఉపవాసం. ఇలాంటి ఉపవాసాల వల్ల ఎంత ప్రయోజనం ఏర్పడుతుందో eTRF పరిశోధనతో మరోసారి రుజువైపోయింది.            

- నిర్జర.