మోడీ, బాబు వంటి వీఐపీల సెక్యూరిటీ చేతిలో బ్రీఫ్ కేస్.. దానిలో ఏముందో తెలిస్తే షాక్!

జెడ్ లేదా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండే ప్రముఖులను ఎప్పుడైనా గమనించారా?. ప్రధానిని మొదలుకొని ప్రత్యేక రక్షణ అవసరమైన పలువురు ప్రముఖులకు ఈ సెక్యూరిటీ ఉంటుంది. ఈ ప్రముఖుల చుట్టూ సెక్యూరిటీ వారిని సరిగ్గా గమనిస్తే.. ఒకరిద్దరి చేతుల్లో బ్రీఫ్ కేస్ లు కనిపిస్తాయి. ఆ బ్రీఫ్ కేస్ లో ఏముంటదని ఎప్పుడైనా ఆలోచించారా?.. అబ్బే ఏముంది ఆ ప్రముఖులకు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ కానీ, విలువైన వస్తువులు కానీ ఉండి ఉంటాయి అంటారా?.. అలా అనుకుంటే మీరు పప్పు, సాంబార్, రసం ఇలా అన్నింట్లో కాలేసినట్టే. అది బ్రీఫ్ కేస్ లా కనిపిస్తుంది.. కానీ బ్రీఫ్ కేస్ కాదు. బ్రీఫ్ కేస్ లా కనిపించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్.

బ్రీఫ్ కేస్ ఏంటి? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏంటి? అని షాక్ అవుతున్నారా.. నిజం.. ఆ బ్రీఫ్ కేస్ ఓ పోర్టబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది. అది ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఇది జెడ్ లేదా జెడ్ ప్లస్ రక్షణ కల్పించే అందరికీ ఉంటుంది. ఒక వేళ సదరు వీఐపీ మీద దాడి జరిగితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లా పనిచేస్తుంది. దాడి జరిగినప్పుడే కాదు, సదరు సెక్యూరిటీ అధికారికి దాడి జరగవచ్చేమో అనే అనుమానం వచ్చినా ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయవచ్చు. ఇది ప్రముఖులకు తక్షణ మరియు తాత్కాలిక రక్షణ కల్పించే కవచంగా పనిచేస్తుంది. ప్రధాని మోడీ పక్కన ఉండే సెక్యూరిటీ చేతిలో బ్రీఫ్ కేస్ ఉంటుంది. అది పోర్టబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టే. అంతెందుకు టీడీపీ అధినేత చంద్రబాబు  శుక్రవారం విశాఖ పర్యటనకు వెళ్లగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది కదా. విశాఖ విమానాశ్రయంలో వైసీపీ కార్యకర్తలు.. చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్నారు. కోడిగుడ్లు, చెప్పులు విసురుతూ కాన్వాయ్ మీదకు దూసుకొచ్చే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది.. వారి చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేసి రక్షణ కవచంగా ఉపయోగించారు. అలా ఆ  బ్రీఫ్ కేస్ ప్రముఖులకు తక్షణ మరియు తాత్కాలిక రక్షణ కల్పించే కవచంగా ఉపయోగపడుతుంది.