సంతోషానికి మార్గం ఆదాయం కాదు, ఆరోగ్యమే!

 


ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది పెద్దల మాట. ఈ మాట నిజమే అన్న విషయం మన అనుభవం అప్పుడప్పుడూ రుజువు చేస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు కొందరు పరిశోధకులు సేకరించిన గణాంకాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.

 

నాలుగురెట్లు తేడా

పేదరికం తగ్గితే సంతోషం పెరుగుతుందా అనే అంశం మీద ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్‌ ఎకనామిక్స్‌కు చెందిన పరిశోధకులు కొన్ని గణాంకాలను సేకరించారు. దీనిలో భాగంగా మనుషులలో పేదరికం తగ్గితే సంతోషంలో కేవలం ఐదుశాతమే వృద్ధి కనిపించిందట. కానీ వారిలో మానసిక సమస్యలకు సంబంధించిన చికిత్సను నిర్వహించినప్పుడు ఏకంగా 20 శాతం మార్పు కనిపించిందట.

 

కారణం ఇదీ!

సంపదతో సంతోషం ఎందుకు పెరగదు అనేదానికి పరిశోధకులు తమదైన విశ్లేషణను వినిపిస్తున్నారు. మన చుట్టపక్కలవారితో పోల్చుకోవడం వల్ల ఎప్పుడూ సంపదని నిర్ణయిస్తాము. అంటే ఇద్దరిలో ఒకరి సంపద పెరిగితే మరొకరికి తక్కువగా తోచడం సహజం. కానీ ఆరోగ్యం అలా కాదు! పోలికలతో సంబంధం లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చు.

 

మారిన ప్రపంచమే సాక్ష్యం

పరిశోధకులు తమ విశ్లేషణ కోసం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రటిన్‌, జర్మనీ దేశాలలోని వేలమందిని గమనించారు. నిజానికి ఇవన్నీ సంపన్న దేశాలే! కొన్ని దశాబ్దాలుగా ఆర్థికఅభివృద్ధిని సాధిస్తున్నవే! కానీ ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా ప్రజలలోని సంతోషపు స్థాయి పెరగలేదు. సంపదకీ సంతోషానికీ అంతగా సంబంధం లేదనేందుకు ఇదే తిరుగులేని సాక్ష్యం!

 

ప్రభుత్వాల తీరు మారాలి

అటు సమాజమూ ఇటు ప్రభుత్వాలు ఎంతసేపూ విద్య, నిరుద్యోగం, పేదరికం, వైద్యం వంటి విషయాల మీద చూపిన శ్రద్ధ పౌరుల మానసిక సమస్యలని పరిష్కరించేందుకు చూపడం లేదన్నది పరిశోధకుల ఆరోపణ. ఫలితంగా గృహహింస, మద్యపానానికి బానిసగా మారడం, క్రుంగుబాటు, పరీక్షల పట్ల విపరీతమైన భయాందోళనలు వంటి కొత్త సమస్యలెన్నో ఇప్పటి తరాన్ని వేధిస్తున్నాయని చెబుతున్నారు. విద్యాసంస్థలు కూడా ఎంతసేపూ పిల్లవాడికి మంచి మార్కులు వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయికానీ, మానసికంగా దృఢమైన వ్యక్తిగా ఎదిగేందుకు అతనికి ఎలాంటి శిక్షణ అందించాలో ఆలోచించడం లేదు. అందుకే ఈ పరిశోధన ఫలితాలు గమనించిన ప్రజలన్నా కనీసం తమ ప్రాధాన్యతలను మార్చుకుంటారని ఆశిస్తున్నారు.

 

- నిర్జర.