Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వయనాడ్‌లో ‘సీత సేతు’!
posted on: Aug 5, 2024 12:48PM

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)
వయనాడ్ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయ విధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండె ధైర్యంతో పాటు మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే... సామాన్య ప్రజల నుంచి రిటైర్డ్ ఆర్మీ అధికారుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు. రాముడి సీతను కిడ్నాప్ చేసిన రావణుడు ఎత్తుకెళ్లి శ్రీలంకలో నిర్చంధించాడు అనేది రామాయణం కథ! సీతను కాపాడటం కోసం రాముడు కట్టిన రామసేతు గురించి విన్నాం... కానీ, ఇప్పుడు సీతే.. ప్రజల్ని కాపాడేందుకు ఉరకలెత్తుతున్న వరద మీద వారధి కట్టింది! అలాగని ఇదేమీ రామాయణ గాథ కాదు. .. కేరళ కొండచరియల బాధితులను రక్షించేందుకు భారత సైన్యాధికారిణి మేజర్ సీతా షెల్కే చేసిన కృషి. అందుకే, ఆమె పేరు మారుమోగుతోంది. ఒకవైపు నేల కూలిన చెట్లు, మరోవైపు అడుగు వేయనివ్వని శిథిలాలు, వేగంగా ప్రవహిస్తున్న నది, పై నుంచి వర్షం, పరిమిత స్థలం... ఒక్క అనుకూలత కూడా లేని అత్యంత ప్రతికూల పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిట్టూర్చకుండా బ్రిడ్జీ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చేసిన ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన సీత. ఈ పనిలో కీలకంగా వ్యవహరిస్తోన్న మద్రాస్ ఇంజినీర్ గ్రూప్‌కి నాయకత్వం వహించిన ఏకైక మహిళా అధికారిణిగా జనమంతా ఆమెకు జేజేలు పలుకుతున్నారు.
పశ్చిమ కనుమల్లో పుట్టిన ప్రళయానికి కేరళలోని వయనాడ్... అల్లకల్లోలమైంది. పెద్ద ఎత్తున పేరుకున్న బురద, పొంగిపొర్లుతోన్న వాగులూ, కొట్టుకుపోయిన వంతెనలు... రెస్క్యూ టీమ్‌లు బాధితుల్ని చేరుకునే వీలు లేకుండా చేస్తున్నాయి.. అప్పుడే సీతా షెల్కే సివంగిలా దూసుకొచ్చారు. పరిస్థితులను అంచనా వేశారు. తాత్కాలిక వంతెనలు (బెయిలీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వీటిని నిర్మించేందుకు సీత ఆధ్వర్యంలో ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ పనిలోకి దిగింది. చిమ్మ చీకటి, జోరువాన మధ్యనే వంతెన నిర్మాణం చేపట్టి నిర్విరామంగా పనిచేశారు. జూలై 31 రాత్రి 9 గంటలకు ప్రారంభించి... మర్నాడు సాయంత్ర 5.30 గంటలకల్లా వంతెన పూర్తి చేసేశారు. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను అంత త్వరగా నిర్మించడం అంత సులువేం కాదు. పైగా ప్రతికూల వాతావరణం. ఈ సమయంలో సీత అసాధారణ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. అందుకే ఆమెను సోషల్ మీడియా సూపర్ హీరోగా కీర్తిస్తోంది. ఈ బెయిలీ వంతెన నిర్మాణం... ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కార్యకలాపాల్లో కీలకమైన అడుగులు వేయడానికి సాయపడుతుంది. జాడలేని బాధితులను గుర్తించే వీలు కలుగుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో తనదైన సమయస్ఫూర్తి చూపించిన మేజర్ సీత మాత్రం... 'నన్ను మహిళగా చూడొద్దు. నేనో సైనికురాల్ని, భారతసైన్యం ప్రతినిధిగా నా విధులు నిర్వర్తిస్తున్నా' అని చెప్పడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం .
బెంగళూరులోని మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్‌లో మేజర్ సీతా షెల్కే ఏకైక మహిళాధికారి. ఈ బృందాన్నే మద్రాస్ సాపర్స్.గా పిలుస్తారు. ఈ ఇంజినీరింగ్ యూనిట్... సైన్యంకోసం మార్గాలను క్లియర్ చేయడం, వంతెనలు నిర్మించడం, యుద్ధ సమయంలో ల్యాండ్ మైన్లను గుర్తించడం వంటివి చేస్తుంది. అంతే కాదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెస్క్యూ ఆపరేష న్లలోనూ భాగమవుతారు. సీతది మహారాష్ట్రలోని గాడిల్ గావ్. తండ్రి అశోక్ బిఖాజీ షెల్కే న్యాయవాది. మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన సీత ఐపీఎస్ కావాలనుకున్నారు. సరైన మార్గదర్శకత్వం లేక ఆ లక్ష్యం చేరలేకపోయారు. దాంతో భారత సైన్యంలో చేరడంపై దృష్టి సారించారు. రెండుసార్లు సశస్త్ర సీమాబల్ పరీక్షలో విఫలమయ్యారు. అయినా, నిరుత్సాహపడకుండా పట్టుదలతో మూడో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. ఆపై చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని 2012లో సైన్యంలో చేరారు. శారీరక బలహీనతలు, మానసిక ఉద్వేగాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని, మగవారికి దీటుగా మహిళలూ రాణించగలరనడానికి మేజర్ సీతా షెల్కే సరైన ఉదాహరణ. ‘మహిళ కదా... ఇది రిస్క్ జాబ్ కదా’ అని ఎంతోమంది సీతతో అనేవాళ్లు. ‘రిస్క్ లేనిది ఎక్కడా!’ అనేది ఆమె నోటి నుంచి వేగంగా వచ్చే మాట. రిస్క్ తీసుకోకపోవడం కూడా పెద్ద రిస్కే అనుకునే సీతా అశోక్ షెల్కే ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో ధైర్యంగా పాల్గొంది. నిద్ర, తిండి, నీళ్లు.... ఇలాంటివేమీ పట్టించుకోకుండా పని చేసింది. ‘మగవాళ్లు ఎంత కష్టమైనా పనైనా చేస్తారు. మహిళలకు కష్టం’ అనే మాట ఆమె ముందు నిలిచేది కాదు. వాయనాడ్‌లో సహాయ, నిర్మాణ కార్యక్రమాలలో తన బృందంతో కలిసి నాన్-స్టాప్‌గా పనిచేస్తున్న సీత మోములో అలసట కనిపించదు.... రాకెట్ వేగంతో పనిచేయాలనే తపన తప్ప. ఆ తపనే ఆమెను అందరూ ప్రశంసించేలా చేస్తోంది.






