కొండా సురేఖ వ్యాఖ్యలపై పోలీసుల హెచ్చరిక

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగెంలో నిర్వహించిన రోడ్ షో లో కొండా సురేఖ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు పోలీసులను కించపర్చే విధంగా మాట్లాడడం, దూషించడం అలవాటుగా మారిపోయిందని, ఇకపై సహించేది లేదని ఉమ్మడి వరంగల్‌ జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల అశోక్‌కుమార్‌ హెచ్చరించారు. సురేఖ పోలీసులపై అనుచిత వాఖ్యలు చేస్తూ విరుచుకుపడడం, దుర్భాషలాడడం పోలీసు జాతిని కించపరిచే విధంగా ఉందన్నారు. ఆమె వెంటనే మాటలను వెనక్కితీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ కుటుంబాలను విడిచి ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులపై విమర్శలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. కొండా సురేఖ మాటలు పోలీసు సిబ్బంది మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని, ఆమె మాటలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఫెండ్ర్లీ పోలీసింగ్‌ అంటే అందరికీ అలుసైపోయిందని, అధికారులు ఒక్కసారి అనుమతి ఇస్తే అక్రమార్కులను ఏరిపారేస్తామని ఆయన హెచ్చరించారు. మరి పోలీసుల హెచ్చరిక పై కొండా సురేఖ ఏవిధంగా స్పందిస్తారో...?