తెరాసలో అయోమయం!

 

 

 

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఒక పెద్ద అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఆ అయోమయ పరిస్థితికి కారణం రాష్ట్ర విభజనను కేంద్రం ఆలస్యం చేస్తూ వుండటమో, సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమమో, రాయల తెలంగాణ ప్రతిపాదనో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందో లేదోనన్న భయం కాదు... టీఆర్ఎస్‌లోని రెండు అధికార, ఆధిపత్య కేంద్రాలలో ఏ కేంద్రంలో సెటిలవ్వాలనే అయోమయం.

 

టీఆర్ఎస్‌లో హరీష్‌రావు, కేటీఆర్ ఇద్దరూ అధికార, ఆధిపత్య కేంద్రాలు. వీళ్ళిద్దరికీ తెలియకుండా పార్టీలో ఏ పనీ జరగదు. అయితే వీళ్ళిద్దరిదీ చెరోదారి. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. తెలంగాణ ఉద్యమం కూడా ఇద్దరూ ఎవరికి వారే చేస్తూ వుంటారు తప్ప ఇద్దరూ కలసి పనిచేయరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఇద్దరిలోనూ వుండటమే. అధికారం అనేది ఎలాంటి బంధాన్నయినా పుటుక్కున తెంపేస్తుంది. ఆఫ్ట్రాల్ బావ బావమరుదుల బంధమెంత? నిన్నమొన్నటి వరకూ టీఆర్ఎస్‌లో నాయకులు హరీష్ పిలిస్తే హరీష్ వెంట, కేటీఆర్ పిలిస్తే కేటీఆర్ వెంట వెళ్ళేవారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరగబోతోంది. తెలంగాణ ఏర్పడబోతోందని అనుకుంటున్న  తరుణంలో అటు హరీష్, ఇటు కేటీఆర్ ఇద్దరూ పార్టీలో తమ పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.



కేటీఆర్ కంటే హరీష్ కాస్తంత ఫార్వర్డ్‌ గా అడుగులు వేసి తెలంగాణ వచ్చాక హరీషే సీఎం అనే మాటను కొంతమంది కార్యకర్తల చేత పబ్లిగ్గా చెప్పించాడు. దాంతో  దాంతో ఉలిక్కిపడిన కేటీఆర్ తాను సీఎం అవ్వాలని బాహాటంగా చెప్పగలిగే కార్యకర్తలను సిద్ధం చేసుకుంటున్నారు. దాంతో టీఆర్ఎస్‌లో ఇప్పుడు హరీష్, కేటీఆర్ మధ్య విభజన స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు ఈ రెండు విభాగాల్లో ఏ విభాగంలో ఉండాలా అన్న అయోమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వున్నారు. ఎవరు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా వుంటే అటువైపే వుండాలన్న ఆలోచనలో కొందరు వున్నారు. అయితే ఎవరు సీఎం అవుతారన్నదీ అంచనా వేయలేక, ఎటు వైపు వెళ్ళాలో అర్థంకాక అయోమయ స్థితిలో వున్నారు.