వ్యాపం...మరణ మృదంగం మ్రోగుతూనే ఉంది

 

వ్యాపం కాదు నాగుపాము:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపం (మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షా బోర్డు) కుంభకోణంలో నానాటికీ అనుమానాస్పద మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ కుంభకోణం గురించి ఆరా తీయాలని ప్రయత్నించిన వాళ్ళు లేదా అందుకు సహకరించిన వారు ఒకరొకరుగా అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. ఇంతవరకు ఈ కుంభకోణంలో 45మంది వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో దేశంలో పెద్ద సంచలనం కలిగిస్తోంది.

 

వ్యాపం అంటే ఏమిటి?

వ్యాపం ద్వారా రాష్ట్రంలో ఉపాద్యాయులు, కానిస్టేబుల్స్, మెడికల్ ఆఫీసర్లు, అటవీశాఖ గార్డులు తదితర అనేక ఉద్యోగాల భర్తీకి, ఉన్నత వృత్తి విద్యాసంస్థలలో ప్రవేశాలకి ఈ బోర్డు అద్వర్యంలో పరీక్షలు నిర్వహించబడతాయి.

 

ఈ భాగోతం ఎప్పడు మొదలయిందంటే...

ప్రభుత్వోద్యోగాలలో నియామకాలు కాబట్టి సహజంగానే లక్షల కోట్లు లంచాలు పంచుకొనే అనేకమంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, దళారులు ఈ వ్యాపం బోర్డుని తెరవెనుక నుండి శాశిస్తున్నారు. ఈ వ్యాపం బోర్డులో చాలా అవక తవకలు జరుగుతున్నాయని 1990 సం.లోనే పిర్యాదులు వచ్చేయి. కానీ 2000 సం.లో వరకు వాటిపై ఎటువంటి విచారణ కానీ కేసు నమోదు చేయడం గానీ జరగలేదు.

 

కమిటీలు విచారణలు:

మొట్టమొదటిసారిగా2000 సం.లో యఫ్.ఐ.ఆర్ నమోదు అయింది. కానీ 2009సం. వరకు కూడా ఆ కేసులో పెద్దగా కదలిక కనబడలేదంటే, తెర వెనుక ఎన్ని పెద్ద తలకాయలు పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది. 2009సం.లో వ్యాపం బోర్డు నిర్వహించిన ప్రీ-మెడికల్ టెస్ట్ పై ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేయగా అదే సుమారు రెండేళ్ళ పాటు అధ్యయనం చేసి 2011సం.లో తన నివేదికని సమర్పించింది.

 

లంచావతారాలు ఎన్నో!

ఆ నివేదిక ఆధారంగా సుమారు 100 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. మళ్ళీ 2012సం.లో దీనిపై ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేశారు. అది ఒక ఏడాది అద్యయనం చేసిన తరువాత వ్యాపం బోర్డులో జరుగుతున్న అవకతవకలలో గవర్నర్ రామ్ నరేష్ యాదవ్, ఆయన కుమారుడు శైలేష్ యాదవ్, గవర్నర్ వద్ద పనిచేసే ఆఫీసర్-ఆన్-స్పెషల్ డ్యూటీ ధనరాజ్ యాదవ్, రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి లక్ష్మి కాంత్ శర్మ తదితరులతో సహా అనేకమంది రాజకీయ నాయకుల, ఉన్నతాధికారుల, వ్యాపారుల ప్రమేయం ఉందని తెలియజేస్తూ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. అది చేతికి అందిన మూడు సం.ల తరువాత ఈ వ్యాపం కుంభకోణం తో సంబంధం ఉందని భావిస్తున్న ధనరాజ్ యాదవ్ తో సహా మొత్తం 2000 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వారిలో 100 మందికి పైగా రాజకీయ నాయకులున్నారు.

 

అరెస్టయిన వారిలో అనేకమంది బడా వ్యాపారవేత్తలు చివరికి విద్యార్ధులు, వారి తల్లితండ్రులు కూడా ఉండటం గమనిస్తే వ్యాపం బోర్డులో అవకతవకలు ఏస్థాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చును. అప్పుడు గవర్నర్ తో సహా వారందరి మీద కేసులు నమోదు చేయబడగా గవర్నర్ మాత్రం తనకున్న రాజ్యాంగ రక్షణ కవచం ఉపయోగించుకొని బయటపడ్డారు. కానీ ఆయన కుమారుడు శైలేష్ యాదవ్ కూడా అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. కానీ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో గవర్నర్ పదవీ విరమణ చేసిన వెంటనే మళ్ళీ ఆయనపై కేసు నమోదు చేసి విచారణ మొదలు పెడతామని సిట్ అధికారులు స్పష్టం చేసారు.

 

మరణ మృదంగం మ్రోగుతూనే ఉంది!

ఈ కుంభకోణంలో అరెస్టులు ఏ స్థాయిలో ఉన్నాయో అనుమానాస్పద మరణాలు అదే విధంగా ఉన్నాయి. ఈ కుంభకోణంలో ఇంతవరకు మొత్తం 45మంది చాలా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు.ఈ వ్యవహారం నానాటికీ తీవ్ర రూపం దాల్చుతుండటంతో దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి సూత్రధారులను కనుగొనేందుకు కొన్ని నెలల క్రితం మధ్యప్రదేశ్ హైకోర్టు ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ (సిట్) ఏర్పాటు చేసింది. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుంటే మరొకవైపు అనుమానాస్పద మరణాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.

 

ఈ వ్యవహారం రాన్రాను విషమిస్తుండటంతో సుప్రీంకోర్టులో దానిపై కొందరు న్యాయవాదులు, ఆమాద్మీ పార్టీ నేతలు మరికొందరు ఇతర వ్యక్తులు పిటిషన్లు వేసారు. వాటిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి హెచ్.యల్. దత్తు, జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్ర మరియు జస్టిస్ అమితావ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును 9వ తేదీన విచారణకు చేప్పట్టబోతోంది. కానీ వ్యాపం మరణ మృదంగం మారుమ్రోగుతూనే ఉంది.

 

మొట్టమొదట 2009సం.నుండి 2014సం.వరకు మొత్తం 14మంది బ్రోకర్లు, ఆరుగురు విద్యార్ధులు, ముగ్గురు విద్యార్ధుల తండ్రులు, ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక జర్నలిస్ట్ (అజ్ తక్ హిందీ న్యూస్ ఛానల్ విలేఖరి), జబల్ పూరులో యన్.యస్. మెడికల్ క్లాలేజి డీన్ అరుణ్ శర్మ తో సహా అనేకమంది అనుమానాస్పద స్థితిలో మరణించారు.

 

ఈ దారుణపరిస్థితి చూసి మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ “ఈ వ్యాపం వ్యవహారంలో నాపైన కూడా యఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడి ఉంది కనుక ఏదో ఒకరోజు నేను కూడా చనిపోతానేమో?”అని భయం వ్యక్తం చేసారంటే పరిస్థితి ఎంత తీవ్రత అర్ధమవుతుంది.

 

దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీతో సహా అనేకమంది కోరుతున్నారు.