Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఓటరా మేలుకో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకో!
posted on: May 9, 2024 11:25AM
అభివృద్ధి జరగాలంటే ఆయుధం ఓటు.. ప్రజా పాలన సాగాలంటే ఆయుధం ఓటు.. అవినీతి ప్రభుత్వాలను కుప్ప కూల్చాలంటే ఆయుధం ఓటు.. కక్షపూరిత పాలన సాగిస్తున్న ప్రభుత్వం మెడలు వంచాలన్నా ఆయుధం ఓటే.. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆయుధం ఓటు.. ఆ ఆయుధం మన చేతుల్లోనే ఉంది. మనది ఒక్క ఓటే కదా వెయ్యకపోతే ఏమవుతుందిలే అనుకుంటే అది పొరపాటే. 2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చేసిన ఆ పొరపాటే ఇప్పుడు వారి జీవితాలకు శాపంగా మారింది. రాజధాని లేని రాష్ట్రంగా చెడ్డపేరు మూటగట్టుకోవడంతోపాటు.. గంజాయికి నిలయంగా మారింది. కక్షపూరిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ మారింది, అభివృద్ధి లేని రాష్ట్రంగా, ఉద్యోగాలు లేని రాష్ట్రంగా, ఉన్న కంపెనీలను తరిమేసిన రాష్ట్రంగా.. మొత్తంగా మరో శ్రీలకం దేశంగా మారేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉంది. అందుకు కారణం ఏపీ ఓటర్ల నిర్లక్ష్యమే. ఏపీలో గత ఎన్నికల సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారింది. అభివృద్ధి లేదు, రోడ్లు వేయలేదు, ఉద్యోగాలు కల్పించలేదు, కనీస సౌకర్యాలు లేవు.. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు మాత్రం పెద్దెత్తున జరిగాయి. గొంతెత్తి అడిగిన వారు జైళ్లకు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు 20శాతం మంది ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. వీరిలో 10శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వచ్చినా ఏపీ ప్రజలు ప్రస్తుతం ఇన్ని ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుండేవారు కాకపోవచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, సీఎం జగన్ మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకే పరిమితం కావడంతో రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారి జీవనోపాధి కోసం చిన్నాచితికా పనులు కూడా దొరకక పోవడంతో హైదరాబాద్, బెంగళూరు రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో వలస వెళ్లిన పరిస్థితి. గత ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో జీవనం సాగిస్తున్న ఏపీ ఓటర్లు.. సొంత రాష్ట్రం వెళ్లి ఓటువేసేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గింది. దాదాపు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో వెయ్యి నుంచి 10వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధులు ఓడిపోయిన పరిస్థితి. ఇతర ప్రాంతాలకు ఉపాధికోసం వెళ్లిన ఏపీ ఓటర్లు ఆశించిన స్థాయిలో తమ రాష్ట్రంకు వెళ్లి ఓటు వేయకపోవడంవల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదేళ్లలో పీకల్లోతు అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది.
గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పటికీ సగానికి పైగా స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలిచిన సీట్లే. 20శాతం మంది ఓటర్ల నిర్లక్ష్యం వల్ల వైసీపీ అధికారంలోకి రావడం.. ఏపీ ప్రజలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే పేదలకు అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఏపీ రాజధానిగా అమరావతిలో వేగంగా జరుగుతున్న పనులను నిలిపివేశారు. ఏపీ సీఎంగా చంద్రబాబు కొనసాగిన సమయంలో అమరావతి, దాని పరిసర ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి దొరికింది. రాజధాని నిర్మాణం జరుగుతున్న సమయంలో కులవృత్తుల వారికి పుష్కలంగా పనులు దొరకడంతో ఆర్థికంగా వారికి వెసులుబాటు ఏర్పడింది. జగన్ మోహన్ రెడ్డి వక్రబుద్ధితో వారి జీవనోపాధిపై దెబ్బకొట్టారు. అంతేకాదు.. జగన్ కక్షపూరిత రాజకీయాలతో ఏపీ అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి పోయింది. చంద్రబాబు హయాంలో ఏపీలో పలు ప్రముఖ కంపెనీలు పెద్దెత్తున పెట్టుబడులు పెట్టాయి. జగన్ సీఎం హోదాలో వాటన్నింటిని ఏపీ నుంచి తరిమేశారు. అలాఅని కొత్త కంపెనీలనుకూడా ఏపీకి తీసుకురాలేదు. దీంతో యువత ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం లేకుండా జగన్ మోహన్ రెడ్డి చేశారు. మట్టి, ఇసుక దోపిడీతో జగన్, వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించి చిత్ర హింసలకు గురిచేశారు. వైసీపీ నేతల ఆగడాలు తట్టుకోలేక పోయిన చాలా మంది ఏపీని వదిలి జీవనోపాధికోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ కారణం.. ఇతర రాష్ట్రాల్లోని ఏపీ ఓట్లు పోలింగ్ సమయంలో ఓటు హక్కు వినియోగించుకోక పోవటం వల్లనేని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
2014 ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చాయి. 2014 నుంచి ఐదేళ్లు ఏపీలో ఎటుచూసినా అభివృద్ధి ఆనవాళ్లు కనిపించాయి. సీఎంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఏపీని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ప్రముఖ కంపెనీలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చేయడం, పాత రోడ్లకు మరమ్మతులు, కొత్త రోడ్లు వేయడం, యువతకు ఉద్యోగాల కల్పన, ముఖ్యంగా అమరావతి రాజధానిని అద్భుతంగా నిర్మించేందుకు తీవ్రంగా శ్రమించారు. చంద్రబాబు హయాలో ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఆర్థికంగా అన్ని వనరులుఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోటీపడింది. కానీ, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత అబివృద్ధి అనే పదాన్ని మర్చిపోయి కేవలం కక్షపూరిత రాజకీయాలతో పాలన సాగించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. జగన్ మోహన్ రెడ్డి సైకో పాలనతో ఐదేళ్లు నరకయాతనకుగురైన ఏపీ ప్రజలకు ప్రస్తుతం ఆ బారినుంచి బయటపడే అవకాశం వచ్చింది. ఓటు ద్వారా జగన్ మోహన్ రెడ్డికి బుద్దిచెప్పి మళ్లీ ప్రజాపాలనను తెచ్చుకొనే అవకాశం ఏపీ ప్రజలకు వచ్చింది. మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోఉన్న ఓటర్లు, ఇతర రాష్ట్రాల్లోఉన్న ఏపీ ఓటర్లు పోలింగ్ రోజు ఏపీలోని వారి స్వంత ప్రాంతాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని. ఐదేళ్ల జగన్ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. జగన్ ప్రభుత్వానికి ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలి. నిర్లక్ష్యం వీడి మేలుకో ఏపీ ఓటరా.. మళ్లీ ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఓటును ఆయుధంగా వినియోగించుకో.






