బస్సు ప్రమాద బాధిత కుటుంబాలపై పోలీస్ ప్రతాపం

 

మెహబూబ్ నగర్ పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు దగ్ధమయి అప్పుడే నెలరోజులవుతోంది. ఈ ఘోర ప్రమాదంలో45మంది నిండు ప్రాణాలు నిమిషాలలో గాలిలో కలిసిపోయాయి. అయితే అందుకు భాద్యులయిన వారిని ఒక్కరిని కూడా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. రవాణా అధికారులు మాత్రం అనుమతి లేకుండా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులను పట్టుకొని, కేసులు వ్రాయడంతో సరిబెడుతున్నారు.

 

బాధిత కుటుంబాలకు ఇంత వరకు న్యాయం చేయలేకపోయినా, రవాణా మంత్రి బొత్ససత్యనారాయణ కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ ప్రభుత్వం తరపున మరెవరూ గానీ,  కనీసం మానవతాదృక్పదంతో వారిని కలిసి ఓదార్చాలని కూడా భావించలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన రాజకీయాలతో ఎవరికీ తీరిక లేకుండా పోయింది. ప్రజలు కూడా ఈ ఘోర దుర్ఘటన గురించి క్రమంగా మరిచిపోవచ్చు గాక. కానీ తమ ఆత్మీయులను, కొడుకులను, భర్తలను, తల్లులను పోగొట్టుకొన్న వారి దుఃఖం, బాధ ఎన్నటికీ తీరేది కాదు, మరిచిపోగలిగేది కాదు.

 

మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ వద్దకు రాకపోతే తామే వారి వద్దకు వెళ్లి గోడు వెళ్ళబోసుకొందామని బాధిత కుటుంబాలవారు కొందరు ఈరోజు మినిస్టర్స్ క్వార్టర్స్ వద్దకు వచ్చినప్పుడు, లోనున్న మంత్రులెవరు బయటకి రాకపోగా, పోలీసులు వారి నందరిని అరెస్ట్ చేసి పోలీసు వ్యానులో కుక్కి బలవంతంగా గోల్కొండ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

 

అరెస్ట్ చేసిన వారిలో వృద్దులు, మహిళలు వాళ్ళ చేతుల్లో పసిపిల్లలూ ఉన్నారు. పోలీసుల తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నవారు, అక్కడకి చేరుకొన్నమీడియాతో మాట్లాడుతూ, “ఈ మంత్రులు, ప్రభుత్వానికి కనీసం మానవత్వం కూడా లేదు. ఈ దుర్ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా ఇంతవరకు ఒక్కరిని కూడ అరెస్ట్ చేయకపోవడాన్ని ఏమని భావించాలి? అసలు ఇంతవరకు ఎవరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేసులు ఎందుకు నమోదు చేయలేదు? దోషులను వదిలి గోడు వెళ్ళబోసుకోవడానికి వచ్చిన బాధితుల మీదనా మీ ప్రతాపం చూపించేది? ఈవిధంగా అరెస్ట్ చేయడానికి మేమేమయినా ఉగ్రవాదులమా లేక క్రిమినల్స్ మా? పసిపిల్లలు, మహిళలు, వృద్ధులతో కూడా ఇంత నిర్దాక్షిణ్యంగా అసలు ఎలా వ్యవహరించగలుగుతున్నారు?మీకు ఎంతసేపు ఆంధ్ర, తెలంగాణా గొడవలే తప్ప ప్రజల ప్రాణాలకు మీ దృష్టిలో అసలు విలువ లేదా? ఒకవేళ మాకు న్యాయం చేయలేమని భావిస్తే మమ్మల్ని కూడా ఈ వ్యానులోనే పెట్టి తగులబెట్టేయండి. ఇక మీరు ఎవరికీ సంజాయిషీ చెప్పుకోనవసరం లేదు. మీకు ఎటువంటి సమస్యా కూడా ఉండదు.” అని ఆక్రోశిస్తున్నారు.

 

వారినందరినీ ఉంచిన వ్యానుని ప్రస్తుతం గోల్కొండ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిలిపి, పై అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.