విటమిన్ Kతో ఎన్ని ఉపయోగాలో తెలుసా!

 

శరీరానికి అవసరమయ్యే విటమిన్ల పేర్లు చెప్పమంటే టకటకా A నుంచి E వరకూ వల్లెవేస్తాం. కానీ K విటమిన్‌ గురించి మాత్రం మర్చిపోతాం. మనం ఎంతగా మర్చిపోయినా... శరీరానికి మిగతా విటమిన్లు ఎంత అవసరమో కె విటమిన్‌ కూడా అంతే అవసరం అని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అంతేకాదు! కె విటమిన్‌తో ఎముకల దగ్గర్నుంచీ గుండె వరకూ ప్రతి భాగానికీ లాభాలున్నాయని పేర్కొంటున్నాయి.

 


విటమిన్ కె అనగానే మనకి రక్తం గడ్డకట్టడమే గుర్తుకువస్తుంది. నిజానికి ఈ విటమిన్‌కు ‘K’ అన్న పదాన్ని సూచించడం వెనుక కూడా ఇదే కారణం. జర్మన్‌ భాషలో koagulation అంటే గడ్డకట్టడం అని అర్థం. ఈ విటమిన్‌ ముఖ్య బాధ్యత రక్తాన్ని గడ్డకట్టించడం అని జర్మన్ పరిశోధకులు కనుగొనడంతో ఆ పదంలోని మొదటి అక్షరం స్థిరపడిపోయింది. మన శరీరానికి చిన్న గాయమైనా సరే... అక్కడ రక్తం కనుక గడ్డకట్టకపోతే ఇక మనిషికి మరణమే శరణ్యం! పంక్చర్‌ అయిన ట్యూబ్‌లోంచి గాలి ఎలా వెళ్లిపోతుందో మన శరీరం నుంచి రక్తం అలా జారిపోతుంది. ఆ పరిస్థితిని అదుపుచేసేందుకు కొన్ని ప్రొటీన్లు అక్కడి రక్తం గట్టిపడేలా చేస్తాయి. ఆ ప్రొటీన్లకి విటమిన్‌ కె తగిన బలాన్ని చేకూరుస్తుంది. 

 


రక్తస్రావాన్ని అరికడుతుంది కదా అని పెద్దలకు మాత్రమే ఇది ఉపయోగం అనుకోవడానికి లేదు. అప్పుడే పుట్టిన పసిపిల్లలలో విటమిన్‌ కె చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో చాలా తక్కువ మోతాదులో ఈ విటమిన్‌ కనిపిస్తుంది. ఈ కారణంగా వారిలో అంర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అందుకని పసిపిల్లలు పుట్టిన వెంటనే ఇంజక్షన్‌ రూపంలో కె విటమిన్‌ను అందిస్తున్నారు.

 


విటమిన్‌ కె కేవలం రక్తానికే కాదు, ఎముకలకు కూడా ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుందన్నది నిపుణుల మాట. స్త్రీలలో కనిపించే ఆస్టియోపొరోసిస్ అనే వ్యాధి రాకుండానూ, ఒకవేళ వచ్చినా కూడా అది అదుపులో ఉంచడంలోనూ విటమిన్ ప్రభావం చూపుతుందట. ఎముకలకి తగినంత కాల్షియం అందేలా తోడ్పడటం ద్వారా... అవి పెళుసుబారిపోకుండా, దృఢంగా ఉండేలా కె విటమిన్‌ సాయపడుతుందట.

 


విటమిన్ కె వల్ల గుండెకు మేలు జరుగుతుందన్న విషయం చాలామందికి తెలియదు. కానీ గుండెధమనులు గట్టిపడకుండా ఉండేందుకు ఈ విటమిన్‌ దోహదపడుతుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. అంతేకాదు! గుండె ధమనుల మీద కాల్షియం పేరుకుపోకుండా కాపాడి గుండెలకి చేరే రక్తసరఫరాలో ఎలాంటి అడ్డంకులూ లేకుండా నివారిస్తుందట.

 


ఇదీ స్థూలంగా విటమిన్ కె వల్ల కలిగే కొన్ని లాభాలు! రోజులు గడిచేకొద్దీ ఈ విటమిన్‌ వల్ల ఉపయోగాలు ఇబ్బడిముబ్బడిగా బయటపడుతూనే ఉన్నాయి. ఆఖరికి కొన్ని రకాల మొండి కేన్సర్లను కూడా ఇది నివారించగలదని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. ఆందుకనే ఆరోగ్యవంతమైన పురుషులు రోజుకి 120 మి.గ్రాముల విటమిన్ కె తీసుకోవాలనీ, స్త్రీలు రోజుకి 90 మి.గ్రాముల విటమిన్ కె ఉండే ఆహారం స్వీకరించాలనీ ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి.

 


ఆకుకూరలు, మాంసాహారం, సోయాబీన్స్, పాలపదార్థాల వంటి ఆహారంలో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. ఒకవేళ శరీరంలో తగినంత విటమిన్ కె లేదని తేలినా, లేదా ఆ విటమిన్‌ను జీర్ణం చేసుకోవడంలో ఏదన్నా లోపం ఉన్నా... మందుల ద్వారా ఈ విటమిన్‌ను స్వీకరించవచ్చు. అయితే కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే విటమిన్‌ కె మందులు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అది ఇతరత్రా సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా రక్తపోటు, కొలెస్టరాల్‌, జీర్ణసమస్యలతో మందులు వాడేవారిలో విటమిన్‌ కె సప్లిమెంట్లు దుష్ప్రభావాన్నా చూపుతాయి.

 

- నిర్జర.