TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక వైపు వరద ముంపు.. మరో వైపు మొసళ్ల భయం!

Published on: Sat Jul 23, 2022 3:22PM

కష్టాలు వస్తే ఒకే సారి కట్టగట్టుకుని వస్తాయంటారు పెద్దలు. ఇప్పుడు గుజరాత్ వడోదర వాసుల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఒక వైపు వరదలు ముంచెత్తి ఇళ్లు నీటమునిగి సతమౌతున్న వడోదర వాసులకు మొసళ్ల భయం పట్టుకుంది.  

వడోదర విశ్వామిత్ర నది ఒడ్డున ఉంటుంది. విశ్వామిత్ర నది మొసళ్ల ఆవాసం కూడా. ఈ నది దాదాపు 300కు పైగా మొసళ్లకు ఆశ్రయం ఇస్తోంది. అటువంటి విశ్వామిత్ర నది ఇటీవలి వర్షాలకు పొంగి ప్రవహించింది. భారీగా వరద నీరు పోటెత్తడంతో నది గట్లు తెంచుకుని ప్రవహించింది. వరద నీరు వడోదరను ముంచెత్తింది. కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. ఆ వరద నీటితో పాటు నదిలో ఆవాసం పొందుతున్న మొసళ్లు కూడా వడోదరలోకి వచ్చేశాయి.

కాలనీలకు కాలనీలను ముంచెత్తిన వరద నీటితో పాటు మొసళ్లు కూడా కాలనీల్లోకి వచ్చేశాయి. పలు అపార్ట్ మెంట్ ఆవరణల్లో మొసళ్లు కనిపించడంతో జనం భయంతో బెంబేలెత్తిపోయారు. అసలే వరదలతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న వారికి మొసళ్లు ప్రాణాంతకంగా పరిణమించాయి. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.

వరద నీటితో పాటు కొట్టుకు వచ్చిన మొసళ్లు డ్రైనేజీల ద్వారా ఎక్కడికెక్కడకు కొట్టుకుపోయాయో అన్న ఆందోళన వ్యక్తమౌతోంది. మొత్తం మీద అటవీ అధికారులు శ్రమించి పెద్ద సంఖ్యలో మొసళ్లను పట్టుకుని తీసుకెళ్లినప్పటికీ.. ఇంకా ఎన్ని మొసళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయా అన్న భయం మాత్రం వడోదర వాసులను వెంటాడుతూనే ఉంది.