విశాఖ బరి నుంచి తప్పుకున్న సబ్బం హరి

 

విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున బరిలో వున్న సబ్బం హరి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను పోటీలో వుంటే ఓట్లు చీలుతాయని, తద్వారా జగన్ పార్టీ అభ్యర్థి విజయమ్మ గెలిచే అవకాశం వుంది కాబట్టి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సబ్బం హరి చెప్పారు. రాష్ట్ర విభజన అంశంపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఇక రాష్ట్ర విభజన తప్పదని స్పష్టమైపోయిందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేయాల్సిన అవసరం, పార్లమెంటుకు జగన్ పార్టీ నుంచి ఎవరూ వెళ్లకుండా చేయాల్సిన అవసరం వుందని సబ్బం హరి అన్నారు. అందుకే విశాఖలో విజయమ్మ గెలవకుండా వుండటం కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన చెప్పారు. విజయమ్మకు విశాఖ పార్లమెంటు సీటు ఇవ్వడం వెనుక వున్న అసలు రహస్యం తనకు తెలుసని సబ్బం హరి అన్నారు. కొత్త ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ అధికారంలోకి వస్తే అరాచకం ప్రబలుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పార్టీ నుంచి విశాఖని, రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిమీదా వుందని చెప్పారు. ఈ ఎన్నికలలో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని సబ్బం హరి చెప్పారు.