కోహ్లీ ఎందుకంత సూపర్ హిట్‌!

 

పట్టుమని 30 ఏళ్లు కూడా లేవు... క్రికెట్‌లోకి అడుగుపెట్టి పదేళ్లు కూడా కాలేదు. అయినా కోహ్లీ పేరు వినగానే భారతీయులకు ఏదో తెలియని ఉత్సాహం. ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు వ్యతిరేకంగా ఆడుతున్నా, అతణ్ని చూసి తీరాలన్న పంతం! ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన కోహ్లీ ఇంత చిన్న వయసులోనే అంత ఎత్తుకు ఎలా ఎదిగిపోయాడు అని విశ్లేషిస్తే వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఎన్నో బయటపడతాయి.

 

స్పష్టమైన లక్ష్యం- సచిన్‌లాగానే కోహ్లీ కూడా మూడేళ్ల వయసు నుంచే బ్యాట్‌ పట్టుకున్నాడని చెబుతారు. అందరు భారతీయులలాగానే అతను కూడా సచిన్‌ను ఆదర్శంగా తీసుకున్నాడు. కానీ ఆ ఆదర్శం అభిమానంతోనే ఆగిపోలేదు. క్రికెట్‌లో అతనంతటి వాడవ్వాలన్నది కోహ్లీకి చిన్నప్పటి నుంచి లక్ష్యంగా ఉండేది. అందుకే పట్టుమని పదేళ్లు కూడా రాకుండానే దిల్లీ క్రికెట్‌ అకాడెమీలో చేరి శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇటు క్రికెట్‌, అటు చదువు రెండింటిలోనే రాణించే అవకాశం ఉన్న ‘సేవియర్‌ కాన్వెంట్‌’ అనే బడిలో చేరాడు.

 

ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకున్నాడు- కోహ్లీ ఒక్కసారిగా ఏమీ భారతీయ జట్టులోకి రాలేదు. అంచెలంచెలుగా అవకాశాలని అందిపుచ్చుకున్నాడు. అందిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకున్నాడు. అండర్‌ 15, అండర్‌ 17, అండర్‌ 19 ఇలా ఒకో అంచెనీ దాటుకుంటూ 2008 నాటికి భారతీయ జట్టుకి ఎంపికయ్యాడు. ఆ సమయంలో శ్రీలంకకు వ్యతిరేకంగా వన్డే సిరీస్‌ జరుగుతోంది. సిరీస్‌ సమయానికి భారతీయ ఓపెనర్లు సచిన్‌, సెహ్వాగ్‌ ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో కోహ్లీ అరంగేట్రం ఓపెనింగ్‌తోనే ప్రారంభం అయ్యింది. అయినా కూడా భయపడకుండా తన సత్తాను చాటాడు. టెస్టుల్లో అయినా, వన్డేల్లో అయినా కోహ్లీని మొదట్లో అదనపు సభ్యుడి కిందే తీసుకునేవారు. అలాంటప్పుడు ఎవరన్నా ఆటగాడు గాయపడినప్పుడే కోహ్లీకి ఆడే అవకాశం వచ్చేది. కానీ అలా అంది వచ్చిన ప్రతి అవకాశంలోనూ తనేమిటో చూపించడం మొదలుపెట్టాడు.

 

తండ్రి కలని నెరవేర్చేందుకు- కోహ్లీకి తన తండ్రితో చాలా అనుబంధం ఉంది. క్రికెట్‌ అనే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు కోహ్లీకి, తండ్రి అందించిన సహకారం అంతా ఇంతా కాదు. కోహ్లీ 18 ఏళ్ల వయసులో అతని తండ్రి చనిపోయారు. మరొకరైతే ఆ సంఘటన తరువాత పూర్తిగా నిరాశలోకి జారిపోయేవారేమో. కానీ తండ్రి చనిపోయిన మర్నాడు కోహ్లీ దిల్లీ తరఫున ఆడి 90 పరుగులు చేశాడు. ఔటైన వెంటనే నేరుగా తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. దూరమైన తండ్రి కోసం ఏడుస్తూ కూర్చోవడం కంటే, దేశం తరఫున ఆడాలనే ఆయన స్వప్నాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా మారిందంటాడు కోహ్లీ! అప్పటి నుంచి కోహ్లీ ఆటలో తన వ్యక్తిగత లక్ష్యంతోపాటు, తండ్రి ఆశయం కూడా చేరిపోయింది.

 

తనదైన శైలి- కోహ్లీ భారతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేసరికి సచిన్‌, ద్రావిడ్‌ వంటి హేమాహేమీలు ఎందరో ఉన్నారు. గంభీర్‌, రోహిత్‌ శర్మ వంటి యువకులంతా రాణిస్తున్నారు. కానీ కోహ్లీ ఏమీ ఆత్మన్యూనతకు లోనుకాలేదు. ఫాంలో లేని కారణంగా ఒకటి రెండు సిరీస్‌లలో పేలవంగా ఆడినా వెనుకబడిపోలేదు. తన లోపాలను మెరుగుపరుచుకుంటూ సాగిపోయాడు. 4,000-5,000-6,000-7,000... ఇలా పరుగులు చేస్తూనే ఉండిపోయాడు. అది కూడా అత్యంత వేగంగా! విరాట్‌ పరుగులే అతని విమర్శకులకు బదులిచ్చాయి. అతని ఆత్మవిశ్వాసమే విరాట్‌ను భిన్నంగా నిలబెట్టింది. దూకుడుగా ఆగే శైలే, అతనికి శ్రీరామరక్షగా నిలిచింది.

 

ఫార్మాట్‌ ఏదైనా కానీ- కొంతమంది టెస్టు క్రికెట్‌ మాత్రమే అద్భుతంగా ఆడగలరు. మరికొందరు వన్డేలోనే రాణించగలరు. కానీ విరాట్‌ అలా కాదు! టెస్ట్‌, వన్డే, టి-20... ఇలా అడుగుపెట్టిన ప్రతి ఫార్మాట్లోనూ దుమ్ము దులిపాడు. వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయుడు కోహ్లీనే. ఇక టెస్ట్‌ క్యాప్టెన్సీని అందుకున్న వెంటనే మూడు ఇన్నింగ్స్‌లోనూ మూడు సెంచరీలు సాధించి తన దూకుడు వన్డేలకే పరిమితం కాదని నిరూపించుకున్నాడు. T20ల్లో వేగవంతమైన వేయి పరుగులు కూడా విరాట్‌వే!

 

వ్యక్తిగత జీవితం- విరాట్‌ ఆటలోనే కాదు, అతని జీవితంలో కూడా దూకుడు కనిపిస్తుంది. ఎవరో ఏదో అనుకుంటారని విరాట్‌ చాటుమాటు వ్యవహారాల జోలికి పోలేదు. కెమెరా కళ్లన్నీ తన మీదే ఉంటాయని తెలిసినా, అనుష్క శర్మతో కలిసి కనిపించేవాడు. తన వ్యక్తిగత జీవితం వేరు క్రికెట్‌ జీవితం వేరంటూ ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టేసేవాడు. విరాట్‌ పేలవంగా ఆడిన ప్రతిసారీ విమర్శకులు అనుష్కతో అతని ప్రేమను నిందించేవారు. కానీ క్రికెట్‌ పట్ల తనకి ఉన్న నిబద్ధత అన్నింటికంటే అతీతం అని విరాట్ త్వరలోనే నిరూపించేవాడు. విరాట్‌ ఎడమ చేతి భాగంలో ఒక సమురాయ్‌ యుద్ధయోధుని పచ్చబొట్టు ఉంటుంది. సమురాయ్ వీరుల కఠిన శిక్షణ, వారిలోని క్రమశిక్షణ పట్ల తనకి ఉన్న అభిమానానికి గుర్తుగా విరాట్‌ ఆ పచ్చబొట్టు వేయించుకున్నాడట. జీవితంలో దేనికెంత విలువనివ్వాలో విరాట్‌కి స్పష్టమైన అవగాహన ఉన్నట్లు దీనిబట్టే తెలిసిపోతుంది కదా!

 

సమాజానికి కొంత- క్రికెటర్ల క్రీడా జీవితం చాలా తక్కువగా ఉంటుంది. 35 ఏళ్లు వచ్చేలోపుగా వీలైనంత సంపాదించుకుని రిటైర్‌ అయిపోవాలని అనుకుంటారు. విరాట్‌ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ప్రకటనల ద్వారా, ఆటల ద్వారా అతను ఎలాగూ ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తున్నాడు. పైగా ‘చిసెల్’ అనే పేరుతో దేశవ్యాప్తంగా వ్యాయామశాలలను మొదలుపెట్టాడు. ఒక పక్క సంపాదిస్తూనే మరో పక్క సమాజానికి ఎంతో కొంత ఇచ్చే ఉద్దేశం విరాట్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకోసం 2013లో ‘విరాట్‌ కోహ్లీ ఫౌండేషన్‌’ అనే సంస్థను కూడా స్థాపించాడు. తన ఫౌండేషన్ ద్వారా వివిధ స్వచ్ఛంద సంస్థలకి చేతనైనంత సాయం చేస్తుంటాడు కోహ్లి. తీరిక దొరికితే తాను కూడా వృద్ధాశ్రమాల వంటి చోట్లకి వెళ్లి తన స్థైర్యాన్నీ, సాయాన్నీ అందిస్తూ ఉంటాడు.

 

..Nirjara