విజ‌యసాయికి లాస్ట్ డే.. కేసుల‌పై కామెంట్‌.. ఇక ప్యాలెస్‌కే ప‌ర్మినెంట్‌!

posted on: Mar 31, 2022 6:36PM

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ముగిసింది. ఆయ‌న‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు ఎంపీలు రిటైర్ అవుతున్నారు. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు, విజయసాయిరెడ్డి, డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల ఆరేళ్ల‌ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కంప్లీట్ అయింది. మొత్తం 72 మంది పెద్ద‌ల స‌భ నుంచి వైదొలుగుతున్నారు. వారంద‌రి ప్ర‌సంగాల‌తో హౌజ్‌లో ఒక‌ర‌క‌మైన భావోద్రేగం నెల‌కొంది. 

ఎంపీగా రాజ్య‌స‌భ‌లో త‌న ఆఖ‌రి ప్ర‌సంగంలో విజ‌యసాయిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌, త‌న‌పై సీబీఐ, ఈడీ కేసుల‌పై మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు తమపై తప్పుడు కేసులు బనాయించడం వల్లనే తాను రాజ్యసభకు రాగలిగానని విజయసాయి అన్నారు. 

చెన్నైలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న తాను రాజ్యసభ సభ్యుడి స్థాయికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు విజయసాయి చెప్పారు. సభా కార్యక్రమాలలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చిన కాంగ్రెస్‌ సభ్యుడు జైరాం రమేష్‌కు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాజ్యసభకు ఎన్నికైన సమయంలో తనకు మార్గదర్శనం చేసిన అకాలీదళ్‌ సభ్యుడు నరేష్ గుజ్రాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. టూరిజం, ట్రాన్స్‌పోర్ట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా విశేష ప్రతిభ చూపిన టీజీ వెంకటేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. 

రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న వెంకయ్యనాయుడు నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్టు విజ‌య‌సాయి చెప్పారు.

ఇక‌, విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌స‌భ ట‌ర్మ్ పూర్తి కావ‌డంతో మ‌రోసారి ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. ఈ విష‌యం తెలిసే స‌భ‌లో విజ‌య‌సాయి అలా ఎమోష‌న్ అయ్యార‌ని చెబుతున్నారు. ఎంపీగా ఢిల్లీలో సొంతంగా రాజ‌కీయం చేస్తుండ‌టం.. జ‌గ‌న్‌ను కాద‌ని బీజేపీ పెద్ద‌ల‌తో బాగా అంట‌కాగుతుండ‌టం.. విశాఖ‌లో ఓవ‌రాక్ష‌న్‌.. ఇలా అనేక ఆరోప‌ణ‌లు, అనుమానాల‌తో సాయిరెడ్డిని మ‌రోసారి పార్ల‌మెంట్‌కు పంపించే ఉద్దేశం జ‌గ‌న్‌రెడ్డికి లేద‌ని తెలుస్తోంది. అందుకే, ఇప్ప‌టికే ఆయ‌న్ను తాడేప‌ల్లికి ర‌ప్పించి.. పార్టీ అనుబంధ‌ విభాగాల బాధ్య‌త‌లు అప్ప‌గించి విజ‌య‌సాయి స్థాయిని బాగా త‌గ్గించేశార‌ని.. ఒక విధంగా ప్యాలెస్‌కే ఆయ‌న‌ను ప‌రిమితం చేశార‌ని అంటున్నారు. ఇక‌, ఢిల్లీకి ప‌ర్మినెంట్‌గా బై బై చెప్పేసి... తాడేప‌ల్లి ప్యాలెస్‌లో, జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో శాశ్వ‌తంగా ప‌డుండ‌ట‌మే విజ‌య‌సాయిరెడ్డికి ఇక మిగిలింద‌నే టాక్ వినిపిస్తోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...