TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తుడా లో కోట్ల రూపాయల అవినీతి.. చెవిరెడ్డికి విజిలెన్స్ నోటీసులు!

Published on: Thu Jun 5, 2025 1:52PM

జగన్ కోటరీలో  అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి విజిలెన్స్ నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేశారు. వైసీపీ హయాం అనేమిటి.. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కరరెడ్డే తుడా చైర్మన్.  ఇక తుడా చైర్మన్ గా చెవిరెడ్డి అక్రమాలకు కొదవే లేదన్నఆరోపణలూ మెండుగానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తుడా చైర్మన్ గా  ఆ సంస్థ ఆదాయాన్ని సొంత అవసరాలకు విచ్చలవిడిగా వాడుకున్నారన్నఆరోపణలపై ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. తన సొంత గ్రామంలో పనులు చేయించడానికి.. వ్యక్తిగత పనులు, ప్రయాణాలకు కూడా తుడా నిధుల్ని ఇష్టారీతిగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  మొత్తం తుడా నిధుల్లో 90 శాతం నిధులను చెవిరెడ్డి సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరిలో పనులు చేయించడానికే వాడుకున్నారనీ,  తుడా నిధులతో చేసిన పనులకు కూడా ఏదో తన సొంత సొమ్ము ఖర్చు చేసి చేయించినట్లుగా తన పేరే వేయించుకున్నారనీ విమర్శలు ఉన్నాయి.  అంతే కాకుండా ఆ పనుల చేసే కాంట్రాక్టును తన సొంత కంపెనీకే కట్టబెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారనీ ఆరోపణలు ఉన్నాయి.  

ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ హయాంలో అంటే 2019-24 మధ్య కాలంలో తుడాలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జనవరిలో విచారణకు ఆదేశించింది. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దగి దర్యాప్తు చేపట్టారు. తాజాగా చెవిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. మొత్తం 37 ప్రశ్నలు సంధిస్తూ నోటీసులు జారీ చేసిన విజిలెన్స్ అధికారులు ఈ నెల 9లోగా  సమాధానం చెప్పాలని ఆదేశించారు. చెవిరెడ్డితో పాటు మరో 15 మందికి కూడా నోటీసులు జారీ అయ్యాయి.   తుడా సంధించిన ప్రశ్నలకు చెవిరెడ్డి ఇచ్చే సమాధానాల ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.