Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పుస్తకాల చదువు కన్నా జీవితంలో విలువలు ముఖ్యం
posted on: May 4, 2025 10:48AM

చదువేరా అన్నిటికీ మూలం.. ఆ చదువు విలువ తెలుసుకొనుటే ధర్మం. ఇది అక్షర సత్యం. అయితే చదువుకోవడం అంటే మార్కులూ, ర్యాంకులూ కాదు. విలువలు, వివేకం. కేవలం పుస్తకాల పురుగులా బట్టీయం పడితే సరిపోదు. అలా బట్టీయం పట్టి ర్యాంకులు సాధించినా మనిషిగా విలువలకు దూరమైతే ప్రయోజనం లేదు. అటువంటి విలువలు లేని విద్యావంతులను చూసే చదవేస్తే ఉన్నమతి పోయింది, చదువుకు ముందు కాకరకాయ, చదివాకా కీకరకాయ వంటి సమేతలు పుట్టాయి. ఈ విషయాన్ని తెలుసుకోకుండా విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ కూడా మార్కులూ, ర్యాంకుల వెంట పడుతున్నారు. వ్యక్తిత్వ వికాసం కంటే.. పరీక్షల్లో వచ్చిన పర్సంటేజీ ఎంత, అధిక ప్యాకేజీతో కొలువులు సంపాదించడం ఎలా అన్నదానిపైనే దృష్టి పెడుతున్నారు. ఆ క్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచేస్తున్నారు. మంచి ర్యాంకు రాకపోతే ఎందుకూ పనికి రామన్న న్యూన్యతా భావం పిల్లలలో పెంచేలా వ్యవహరిస్తున్నారు. ఆ కారణంగానే పరిక్షా ఫలితాలు వచ్చిన తరువాత విద్యార్థుల ఆత్మహత్యల వార్తలను ఎక్కువగా వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదువు అంటే కేవలం ఉత్తీర్ణత మాత్రమే కాదనీ, ఒక వైఫల్యం భవిష్యత్ విజయానికి మొదటి మెట్టన్న సంగతి మరిచిపోతున్నారు. మార్కులు తక్కువ వచ్చినా, ఒక వేళ పరీక్షలో ఫెయిలైనా జీవితం ముగిసినట్లు కాదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు.
ఏపీజే అబ్దుల్ కలాం చదువులో సాధారణ విద్యార్థే.. అయినా శాస్త్రవేత్త అయ్యారు. రాష్ట్రపతిగా గౌరవాన్ని అందుకున్నారు. భారత రత్న పురస్కారం తీసుకున్నారు. అలాగే క్రికెట్ గాడ్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ విద్యార్థిగా టెన్త్ ఫెయిలయ్యారు. అటువంటి వారు ఇంకెందరో ఉన్నారు. చదువు అంటే మార్కులూ, ర్యాంకులే కాదనీ, తమకు నచ్చిన, తమకు నైపుణ్యం ఉన్న రంగాలలో సాధన చేసి ఉన్నత స్థాయిని అందుకోవచ్చనీ చాటిన ఎందరో ఉన్నారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చదువు అనేది విజ్ణానసముపార్జనకు సాధనమే కానీ, చదువంటే ర్యాంకులూ, మార్కులు, కొలువులేకాదని చెప్పాలి. చదువులో వెనుకబడిన పిల్లలలో ఆత్మస్థైర్యం పెంచి.. భవిష్యత్ లో మరింత కష్టపడి పైకి వచ్చే విధంగా ప్రోత్సహించాలి.
సరిగ్గా అలాంటి పనే చేశారు ఆ తల్లిదండ్రులు.. అసలేం జరిగిందంటే.. కర్నాటకకు చెందిన అభిషేక్ ఇటీవల జరిగిన టెన్త్ పరీక్షలు రాశాడు. అయితే అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యాడు. తోటి విద్యార్థల అవహేళలనతో కృంగిపోయాడు. ఇది గమనించిన అతడి తల్లిదండ్రులు.. అతడికి ధైర్యం చెప్పారు. ఈ సారి బాగా చదివి ప్యాసవ్వాలని బోధించారు. అంతే కాకుండా భవిష్యత్ విజయానికి ఈ ఫెయిల్యూల్ స్టెప్పింగ్ స్టోన్ గా భావించాలని చెబుతూ.. తమ కుమారుడి భవిష్యత్ విజయాన్ని కాంక్షిస్తూ కేట్ కట్ చేసి వేడుక చేశారు. ఈ వేడుకకు అభిషేక్ ను గేలి చేసిన తోటి విద్యార్థులనూ ఆహ్వానించారు. మొత్తంగా తమ కుమారుడిలో ఆత్మ స్థైర్యాన్ని ప్రోది చేయడమే కాకుండా, ఇతరులకూ ఆదర్శంగా నిలిచారు.


.webp)



