ఈ పొరపాట్లతోనే ప్రేమను చేజార్చుకుంటాం (వాలెంటైన్స్ డే స్పెషల్)

 

మనిషి సంఘజీవి. అతని పెరుగుదల, ఎదుగుదల అన్నీ బంధాలతోనే ముడిపడి ఉంటాయి. ఆ బంధాలను సవ్యంగా తీర్చిదిద్దుకుంటే, జీవితం ప్రేమతో నిండిపోతుంది. లేకపోతే మనసు విరిగి, జీవితం మీదే విరక్తి పుడుతుంది. కొన్ని పొరపాట్లు కనుక చేయకపోతే ఏ బంధమైనా అనుబంధంగా మారే అవకాశం ఉంది...

 

లోపం లేని మనిషి ఉండడు

 

ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కారు. ఎవరికి ఉండే లోపాలు వారికి ఉంటాయి. చాలామంది తమలోని లోపాలను వదిలిపెట్టి, తమ తోటివారి లోపాలను ఎంచుతూ ఉంటారు. వాటిని సహృదయంతో అర్థం చేసుకుని మార్గం వెతికే బదులు, దాన్ని గుచ్చి గుచ్చి గాయం చేసేందుకే ప్రయత్నిస్తూ ఉంటారు. ఫలితం! బంధం కాస్తా ఓ బరువుగా మారిపోతుంది.

 

మార్చే ప్రయత్నం చేయవద్దు

 

మన వేలిముద్రలే కాదు, వ్యక్తిత్వాలు కూడా భిన్నంగా ఉంటాయి. చిన్నప్పటి పెంపకమో, జీవితాన్ని ప్రభావితం చేసిన సంఘటనలో, మనం ఏర్పరుచుకున్న విచక్షణో... ఇలా మన ప్రవర్తనలో ప్రతి అడుగుకీ ఓ కారణం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ తనకి అనుగుణంగానే తన చుట్టుపక్కలవారంతా ఉండాలి అనుకుంటారు. అలా తన తోటి వారిని మార్చే ప్రయత్నంలో వారిని చేజార్చుకుంటారు.

 

దాపరికం

 

చాలామంది చిన్నచిన్న విషయాలను కూడా తమ తోటి వారి నుంచి దాచి పెడుతూ ఉంటారు. అలాంటి దాపరికం ఎప్పటికైనా చేటు తేక మానదు. అసలు దాపరికాలు ఉండే పరిస్థితి వచ్చిందంటేనే ఆ బంధంలో ఏదో లోపం ఉందని అర్థం. అవతలవారు అర్థం చేసుకోరనో, అర్థం చేసుకోరనే అనుమానంతోనో, పంచుకోకుండా ఉండాలనే స్వార్థంతోనో, తప్పు బయటపడకుండా ఉండాలనో... విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు మొదలైతే, అవి బంధాన్ని కొండొకచో వ్యక్తిత్వాలనీ చిన్నాభిన్నం చేసిపారేస్తాయి.

 

దేనికైనా హద్దులు ఉంటాయి

 

ఎంతటి అనుబంధానికైనా సరిహద్దులుంటాయి. ఎంతటి మనిషికైనా అహం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రేమికుల మధ్య సైతం, గాలి వీచే చోటు ఉండాల్సిందే! మన స్వేచ్ఛను కాపాడుకుంటూ, అవతలివారి ఏకాంతాన్ని గౌరవించే చోట అహాలు కూడా అదుపులో ఉంటాయి. అవతలివారిని చులకనగా చూసే బంధం ఎప్పటికైనా దెబ్బతినక మానదు.

 

భరోసా – ప్రోత్సాహం

 

బంధం అంటేనే భరోసా. నీకు నేనున్నాననే నమ్మకం. ఒకరికొకరి ఆసరా! ఆ పట్టు కనుక చేజారితే బంధం ఓ తప్పనిసరి తతంగంగా మారిపోతుంది. అవసరం అయినప్పుడు అండగా నిలవడం, అవతలివారు ముందడుగు వేస్తున్నప్పుడు వెన్నుతట్టి వెనకాలే నిలబడడం... నిజమైన బంధానికి నిదర్శనం.

- నిర్జర.