ప్రేమంటే ఇదే!


ప్రేమికుల రోజు వస్తోందంటే చాలు... ప్రేమ గురించి రకరకాల కబుర్లు వినిపిస్తాయి. రోమియో జూలియట్‌, లైలా మజ్నూల కథలెన్నో వినిపిస్తాయి. కానీ ప్రేమంటే ఎప్పుడూ స్త్రీ, పురుషుల మధ్య ఉండే ప్రేమేనా? ఎవరో ఒక మనిషి మీద ప్రత్యేకంగా ఏర్పరుచుకున్న భావనేనా! కాస్త ఓపికపట్టి చూడాలంటే కళ్ల ముందు రకరకాల ప్రేమలు కనిపిస్తాయి. ప్రేమ భౌతికమైనదే కాదంటూ వేరే ఎన్నో నిర్వచనాలు చెబుతుంటాయి. అందుకు ముచ్చటగా మూడు ఉదాహరణలు మీరే చూడండి...

నిక్‌ వ్యూజిసిక్‌- శరీరం సగమే ఉన్నా, దాని మీద ప్రేమ మాత్రం 100%

తరచూ యూట్యూబ్‌నీ, ఫేస్‌బుక్‌లనీ చూసేవారికి ఈ పేరు అంత కొత్త కాకపోవచ్చు. ఒకవేళ గభాలున స్ఫురణకు రాకపోయినా రెండు కాళ్లూ, రెండు చేతులూ లేని ఒక వ్యక్తి స్టేజి మీద నిల్చొని ఉపన్యాసాలు అదరగొట్టే సన్నివేశాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. నిక్‌ ‘ఫొసోమేలియా’ అనే అరుదైన వ్యాధి వల్ల కాళ్లూ, చేతులూ సరిగా ఎదగకుండానే పుట్టాడు. మొదట్లో తనని మామూలు మనిషిగా మార్చమంటూ దేవుడిని ప్రార్థించిన నిక్‌ లేనిదాని కోసం ఆశించడంకంటే, ఉన్నదానితో విజయాన్ని సాధించడం విజేతల లక్షణం అని గ్రహించాడు. ఆశ అనేది మనలో ఉంటే, ఎలాంటి పరిస్థితులలోనైనా సంతోషంగా జీవించవచ్చనీ, మన జీవితం గురించిన విలువను గ్రహించడమే నిజమైన విజయమనీ నిక్‌ అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే నిక్ తన అంగవైకల్యాన్ని సైతం అధిగమించి సాధారణ జీవితాన్ని గడపగగలుగుతున్నాడు. అంతేనా! తనను తానే ఒక ఉదాహరణగా మలచుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని రగిలించగలుగుతున్నాడు. ‘life without limbs’ వంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలను రాయగలిగినా, 50కి పైగా దేశాలని పర్యటించి శ్రోతలను సమ్మోహితులను చేసినా... తన జీవితాన్ని ప్రేమించడం వల్లనే నిక్‌కి ఇదంతా సాధ్యమైంది. అంగవైకల్యంతో ఉన్నందుకు నిక్‌ తన దేహాణ్ని ద్వేషించలేదు. తన జీవితం పట్ల నిక్‌కి ఉన్న ప్రేమ ముందు వైకల్యమన్న మాటకు అర్థమే లేకుండా పోయింది.

అజీమ్‌ ప్రేమజీ- ఈ ప్రేమ్‌జీకి తన దేశమంటే తగని ప్రేమ!

డబ్బున్నవాడు మరింత డబ్బుని పోగుచేయాలని చూస్తాడు. తరతరాలుగా తన వారసులకు ఢోకా ఉండదని తెలిసినా, కాసుల రాశులను ఇంకా పోగుచేస్తూనే ఉంటాడు. ఎక్కడో మాత్రమే ఇలాంటి వారికి మినహాయింపులుంటాయి. అలాంటి కొద్దమందిలో మన దేశానికే చెందిన అజీమ్‌ ప్రేమ్‌జీ ఒకరు. నూనె వ్యాపారం చేసే ‘విప్రో’ అనే సంస్థ, తండ్రి మరణం తరువాత అజీమ్ ప్రేమజీ చేతికి వచ్చింది. అప్పటికి అతని వయసు కేవలం 21 ఏళ్లు. సంస్థ తన చేతికి వచ్చాక బెంబేలుపడిపోలేదు అజీమ్‌. నూనె, సబ్బులు, బల్బులు... ఇలా ఒక్కొక్క రంగంలోకీ తన వ్యాపారాన్ని విస్తరిస్తూ విజయారోహణం చేశాడు. రాబోయే రోజులలో కంప్యూటర్‌దే ప్రపంచం అని గ్రహించి సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి దూకాడు. సబ్బులమ్ముకునేవాడు సాఫ్ట్‌వేర్‌ వ్యాపారం ఏం చేస్తాడు అని వెక్కిరించిన వాళ్లే, ఆయన విజయాల గురించి రాయడం మొదలుపెట్టారు.

ఈ దేశం పట్ల అజీమ్ కుటుంబానికి తగని ప్రేమ. అదే ప్రేమతో అజీమ్ తన దేశ భావితరాలకు ఏదైనా చేయాలని సంకల్పించుకున్నారు. భారతదేశంలో పిల్లలకి తగిన విద్య లభించేందుకు దాదాపు 200 కోట్ల వ్యక్తిగత ఆస్తులను ఆయన వెచ్చించారు. దీంతో దాదాపు 3,50,000 పాఠశాలలు లాభపడ్డాయి. భావితరాల విద్య కోసం ఇప్పటికే తన ఆస్తిలో 25 శాతాన్ని అజీమ్‌ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు రాసేసిన ఆయన, మరో 25 శాతాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధపడతున్నారు. భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద విరాళంగా భావిస్తున్నారు. కానీ ఈ దేశం పట్ల, ఈ దేశ ప్రజల పట్ల తలమునకలు దాకా ప్రేమలో మునిగిఉన్న ప్రేమ్‌జీకి ఇదో లెక్కగా కనిపించడంలేదు. ప్రేమికులు ప్రియురాళ్ల కోసం తమ సర్వస్వాన్నీ అర్పిస్తే, ప్రేమజీ తన దేశం కోసం ఆస్తిని బహుమతిగా ఇస్తున్నాడంతే!

సుందర్‌లాల్‌ బహుగుణ- పర్యావరణ గాంధి!

గాంధీ వారసులమని చెప్పుకునేవారంతా, ఆయన పేరు చెప్పుకుని, అధికారాన్ని అనుభవించేందుకు ఉవ్విల్లూరుతున్నారు. కానీ స్వతంత్ర్య పోరాటంలో పాల్గొన్న సుందర్‌లాల్ బహుగుణ ఎలాంటి పదవులనీ ఆశించలేదు. ప్రచారాన్నీ కోరుకోలేదు. తాను ప్రేమించిన పర్యావరణాన్ని కాపాడేందుకు తుదివరకూ పోరాడుతూనే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా సుందర్‌లాల్‌ దేశంలో గ్రామీణ ప్రాంతాలను సందర్శిస్తూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆధునీకరణ పేరుతో విచ్చలవిడిగా చెట్లను నరికేయడం ఆయన గమనించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పచ్చని భారతావని కాస్తా బీడుగా మారిపోతుందని అర్థమైంది సుందర్‌లాల్‌కు. 1970లో దేశంలోని వృక్షసంపదను కాపాడేందుకు ‘చిప్‌కో’ అనే ఉద్యమం మొదలైంది. సుందర్‌లాల్ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు, ఉద్యమం పట్ల ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఉత్తరభారతదేశంలో 5,000 కిలోమీటర్లు కాలినడకన యాత్ర సాగించారు. సుందర్‌లాల్ పోరాటం పుణ్యమాని చెట్లను ఎడాపెడా నరకకూడదంటూ ప్రభుత్వం కఠిన నిబంధనలను రూపొందించింది. భారీ ఆనకట్టల పేరుతో పర్యావరణానికీ, ప్రజలకూ నష్టం కలిగించడానికి కూడా సుందర్‌లాల్‌ వ్యతిరేకంగా ఉండేవారు. అందుకే ఉత్తరాఖండ్‌లో భగీరధి నది మీద తెహ్రీ అనే ఆనకట్టను నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకోసం ఒకసారి 45 ఉపవాస దీక్షనీ, మరోసారి 74 రోజులపాటు ఉపవాసాన్నీ కొనసాగించారు. ఆయన మాటలు విన్నట్లే ఉన్న ప్రభుత్వాలు చివరికి తెహ్రీ ఆనకట్టను నిర్మించి పారేశాయి. కానీ తరచూ భూకంపాలు వచ్చే ప్రదేశంలో ఈ డ్యామ్‌ను రూపొందించడం వల్ల పెద్ద ప్రమాదం ఉందని ఇప్పుడు పర్యావరణవేత్తలంతా తలలు బాదుకుంటున్నారు. తెహ్రీ డ్యామ్‌ వల్ల జరిగే నష్టాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ప్రేమంటే వెంటనే స్ఫురించే భౌతికమైన ఆకర్షణే కాదని చెప్పేందుకు, ఇవీ ముచ్చటగా మూడు ఉదాహరణలు. చెప్పుకున్నవి మూడు, కానీ కాస్త పరిశీలిస్తే ఇలాంటి భిన్నమైన ప్రేమలు, వాటికోసం తపించే ప్రాణాలు ఎన్నో కనిపిస్తాయి. హ్యాపీ వాలంటైన్స్‌ డే!

-నిర్జర