ఎంబీఏలు, బీటెక్ లు చదివారు! డ్రైనేజీలు కడుగుతామంటున్నారు!


గవర్నమెంట్ గొప్పా... గవర్నమెంట్ జాబ్ గొప్పా అంటే... సగటు భారతీయుడు ఏం సమాధానమిస్తాడు? ప్రభుత్వం కంటే ప్రభుత్వ ఉద్యోగమే సేఫ్ అంటాడు! ఎందుకంటే, కష్టపడి గవర్నమెంట్ ఏర్పాటు చేసినా 5ఏళ్లే! కాని, ఒక్కసారి గవర్నమెంట్ డ్యూటీ కొట్టామా... లైఫ్ లాంగ్ సేఫ్! అందుకే, గవర్నమెంట్ జాబ్ కి మన దేశంలో క్రేజ్ అంతా ఇంతా కాదు! అసలు ఒకప్పుడు ఏ మాత్రం ప్రైవేటీకరణ లేనప్పుడు జాబ్ అంటే ... గవర్నమెంట్ జాబే! ఇప్పుడైతే దొరికిందేదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నారు. అయినా కూడా అందరికీ లోలోన సర్కారీ కొలువుపై ఎనలేని ఆశ వుంటూనే వుంటుంది! ఇక అసలు ఉద్యోగమే లేని నిరుద్యోగుల పరిస్థితి ఆలోచించండి? గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అంటే, వారికి ఎడారిలో థమ్సప్పే! 


దేశంలోని చాలా రాష్ట్రాలు 1990 తరువాత ప్రైవేట్ రంగంలో చాలా ఎదిగాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక రంగాల్లో ప్రైవేట్ జాబ్స్ విపరీతంగా అందుబాటులోకి వచ్చాయి. అవ్వి చేజిక్కించుకుంటున్న యూత్ గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆశలు వదిలేశారు. ప్రయత్నాలు మానేశారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే బావుంటుందని మనసులో వున్నా అది అయ్యే పని కాదని డిసైడైపోతున్నారు అత్యధిక శాతం గ్రాడ్యుయేట్లు. ఇతర ఉన్నత చదువులు చదివిన వారైతే అస్సలే ఆలోచించటం లేదు. కాని, ఈ మొత్తం పరిస్థితికి ఉత్తర్ ప్రదేశ్ పూర్తిగా విరుద్ధం... 


దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీ వెనుకబాటులోనూ పెద్దదే! ఇప్పటికీ అక్కడ 1980ల నాటి పరిస్థితుల్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు రాజకీయ నేతలు. ప్రైవేట్ రంగం చాలా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఏ మాత్రం ఎదగటం లేదు. బీహార్ లాంటి ఇతర వెనుకబడిన రాష్ట్రాల్లాగే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా నిరుద్యోగం చాలా ఎక్కువ. అందుకే, ముంబైలో శివసేన, ఎంఎన్ఎస్ ఎప్పుడు దాడులు చేసినా ముందుగా బలయ్యేది యూపీ వారే. అక్కడ్నుంచి వెళ్లిన వారు వలసకు పోని ప్రాంతం దేశంలోనే లేదు. ముంబై, ఢిల్లీ, బెంగుళురు, హైద్రాబాద్ లాంటి నగరాలు మొదలు చిన్న చిన్న టౌన్ల దాకా మనకు ఎక్కడకు పోయినా యూపీ వలస కార్మికులు, ఉద్యోగులు కనిపిస్తారు! దేశంలోనే ఇలాంటి కఠిక నిరుద్యోగ పరిస్థితులున్న రాష్ట్రం మరొకటి లేదు... 


మరి కొన్ని నెలల్లో ఎన్నికలకి వెళ్లబోతోన్న ఉత్తర్ ప్రదేశ్ లో నిరుద్యోగం ఏ స్థాయిలో వుందో కళ్లకు కట్టే ఉదాహరణ తాజాగా చోటు చేసుకుంది. అలహాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వాళ్లు స్వీపర్ పోస్టులకు నోటిఫికేషన్ వేశారట. 250 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఒక లక్ష పదివేల అప్లికేషన్లు వచ్చాయట! ఈ సంఖ్య చూస్తే చాలు మనకు ప్రభుత్వ ఉద్యోగం పట్ల భారతీయుల ఆతృత ఎంత వుందో తెలిసిపోతుంది! అంతే కాదు, అప్లై చేసిన వారిలో చాలా మంది ఎంబీఏ, బీటెక్, పీజీ కోర్స్ లు చేసిన వారు వున్నారట! కాని, వీళ్లలో ఎవరికైనా నిజంగానే స్వీపర్ పోస్ట్ వస్తే ఏం చేయాల్సి వుంటుందో తెలుసా? డ్రైనేజీలు క్లీన్ చేయటం, రోడ్లు ఉడ్వటం! అవును... ఎంబీఏ, బీటెక్ చేసిన వారు ఈ పనులు చేయటానికి సిద్ధపడుతున్నారు! కారణం గవర్నమెంట్ ఉద్యోగంలో వుండే భద్రత! ఎంత చిన్న పోస్టైనా సరే ఏదోలా లభించే ఎక్స్ ట్రా ఇన్ కమ్! ఇవ్వే ఇప్పుడు అందర్నీ గవర్నమెంట్ జాబ్ కోసం తహతహలాడిస్తున్నాయి. ఇక ఏ ఉద్యోగమూ లేని నిరుద్యోగుల సంగతి చెప్పేదేముంది? 


ఒక రోడ్లు ఉడ్చే పోస్ట్ కు వేల సంఖ్యలో అప్లికేషన్లు రావటం దేశ స్థితిగతుల్ని సూచిస్తుంది. అంతే కాదు, మరీ ముఖ్యంగా, ప్రవేటీకరణ ఫలితాల్ని అందుకోకుండా వుండిపోతన్న కొన్ని ఉత్తరాది రాష్ట్రాల దీన స్థితిని స్పష్టం చేస్తుంది! అలాగే, మన దేశంలో జనంలో వున్న గవర్నెమెంట్ జాబ్ కలను కూడా పట్టి చూపుతుంది! ఈ పరిస్థితి త్వరగా మారేలా నేతలు వ్యవహరించాలి. చదువుకు తగ్గ ఉద్యోగం అందరికీ లభించేలా అభివృద్ధి జరగాలి. లేదంటే, బాగా చదువుకున్న వాడూ, చదువుకోని వాడూ ఇద్దరూ అర్థాకలితో అలమటిస్తూనే వుండాల్సి వస్తుంది!