టీ.కాంగ్రెస్‌లో కోవర్టులున్నారా? ఆ కోవర్టులు ఎవరు?
posted on Apr 25, 2016 11:06AM

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్‌లో కొనసాగుతూ టీఆర్ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. పార్టీ నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం, పాలేరు అసెంబ్లీ ఉపఎన్నిక తదితర అంశాలపై నిన్న టీపీసీపీ సమావేశమైంది. కొంతమంది పార్టీతో అంటీముట్టునట్టుగా ఉండటం, టీఆర్ఎస్‌లోకి జంపింగ్‌లతో తలబొప్పికట్టిన ఉత్తమ్ సహనం కోల్పోయారు. కోవర్టులు ఉన్నారని అలా మీరు ఎవరైనా ఉన్నారని భావిస్తే తెలియజేయాలని, లేదా పార్టీ అధ్యక్షునికి సీల్డ్ కవర్‌లో అందజేయాలని ఉత్తమ్ సూచించారు.
పైకి చెప్పనప్పటికి ఆయన ప్రధాన ఉద్దేశం ప్రతిపక్షనేత జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డి అని హస్తం నేతలు గుసగుసలాడుకుంటున్నారు.మొన్నామధ్య ఒక రోజు జీవన్‌రెడ్డి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారు. ఆ తర్వాతి రోజే సీఎం ఛాంబర్‌లో కేసీఆర్‌తో మంతనాలు జరుపుతూ కనిపించారు. ఆ తర్వాత నుంచి ఆయన గట్టిగా మాట్లాడింది లేదు. ఒకవేళ వినిపించినా అది కేసీఆర్‌కు అనుకూలంగానే అవుతోంది. టీ.కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు, ప్రతిపక్షనేత జానారెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఆయన టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం పట్లా, కేసీఆర్ పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నారని కొందరు నేరుగా ఆయనతోనే అన్నా...తన పద్ధతి ఇంతే అని సూటిగా చెప్పారు జానారెడ్డి. దీంతో కొందరు నాయకులు అప్పట్లో జానాపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అమలు చేస్తున్న 5 రూపాయలకే భోజనం పథకం బాగుందని కితాబివ్వడం అప్పట్లోనే కాంగ్రెస్‌కు కోపం తెప్పించింది. పీఏసీ ఛైర్మన్ పదవిలో విషయంలో కేసీఆర్‌పై గట్టిగా పోరాడే నాయకులను కాదని సాఫ్ట్ నేచర్ ఉన్న గీతారెడ్డికి ఆ పోస్ట్ కట్టబెట్టారు.
మరో కీలకనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగతి సరేసరి. నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై కోమటిరెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. అక్కడితో ఆగకుండా మీడియా సాక్షిగా కేసీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లతో పాటు ప్రతి గ్రామానికి 50 ఇళ్లను నిర్మిస్తే..కేసీఆర్‌కు అనుకూలంగా ఓటేయమని తానే ప్రజలకు చెబుతానని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా తయారయ్యాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడంతో ఏం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలోకి కాంగ్రెస్ పడిపోయింది. వలసలను అడ్డుకోలేకపోవడం, పార్టీని సరిగా నడిపించలేక ఇంటా బయట విమర్శల పాలతవుతున్న ఉత్తమ్‌కు వీరి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్టుగా అనిపించాయి. అందుకే కోవర్టులు అంటూ నోరు జారారు.