తెలంగాణలో యూరియా మంటలు... కేసీఆర్ సర్కారుపై రైతన్నల ఆగ్రహం

యూరియా కొరత తెలంగాణ రైతాంగం ఉసురు తీస్తోంది. పంటకు బలాన్ని ఇవ్వాల్సిన ఎరువులు... అన్నదాతల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఎరువులు కోసం పడిగాపులు పడీపడి ప్రాణాలు కోల్పోతున్నారు. యూరియా కోసం తెలంగాణవ్యాప్తంగా అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పెళ్లాం-పిల్లలు, ఇళ్లు, పొలాలను వదిలిపెట్టి, తిండీ తిప్పల్లేకుండా యూరియా సరఫరా కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. అయితే, రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా, గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డా... ఎరువులు దొరక్కపోవడంతో... ఆ నిరాశతో కొందరు ఆస్పత్రుల పాలవుతుండగా, మరికొందరు క్యూలైన్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు.

మెదక్ జిల్లా దుబ్బాకలో యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడిన రైతు ఎల్లయ్య... క్యూలైన్లో నిలబడీనిలబడి అలసిపోయాడు. ఎలాగైనా యూరియా తీసుకెళ్లి పంటను కాపాడుకుందామనుకున్న ఎల్లయ్య గుండె క్యూలైన్లోనే ఆగిపోయింది. తన వంతు రాకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తోన్న ఎల్లయ్య... యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడుతున్నాడు. అయినా, యూరియా దొరక్కపోవడంతో.... ఈసారి ఎలాగైనాసరే దక్కించుకోవాలని.... భార్య లక్ష్మితో కలిసి క్యూలైన్లో నిలబడ్డాడు. కానీ, అప్పటికే పడిగాపులు-పడీపడి అలసిపోయిన ఎల్లయ్య క్యూలైన్లో కుప్పకూలాడు. హుటిహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. దాంతో, ఎల్లయ్య మృతికి ప్రభుత్వమే కారణమంటూ రైతులు ఆందోళనకు దిగారు.

మరోవైపు యూరియా సమస్య రాజకీయ వివాదంగా మారుతోంది. యూరియా కొరతపై విపక్షాలు.... ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే, అసలు కొరతే లేదంటోంది కేసీఆర్ సర్కారు. రైతుల అవస్థలకు ఎల్లయ్య మృతి అద్దం పడుతోందని టీఆర్ఎస్ గవర్నమెంట్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికైనా కేంద్రంతో మాట్లాడి, అవసరమైన యూరియాను తీసుకొచ్చి రైతుల కష్టాలు తీర్చాలని సూచిస్తున్నారు. అలాగే దుబ్బాకలో మరణించిన రైతుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటోన్న విపక్షాలు... ఎల్లయ్య కుటుంబానికి 20లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మూడ్రోజుల్లో యూరియా కొరత తీర్చకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవని రైతులు హెచ్చరిస్తున్నారు.