ఉండవల్లి కబుర్లు

 

 “ఒక అంశంపై ఏ నిర్ణయమూ తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేనని" స్వర్గీయ పీవీ నరసింహ రావుగారు చెప్పిన తరువాతనే ఆ కొత్త సూత్రం గురించి జనాలకి తెలిసివచ్చింది.

 

ఇక విషయంలోకి వస్తే, రాజమండ్రీ యంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, తమ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణాపై ఇదే సూత్రంతో పనిచేస్తోందని శలవిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై రెండు ప్రాంతాల ప్రజలు ఆవేశకావేశాలకు లోనయి ఉన్నారనే సంగతి గ్రహించినందునే ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నానుస్తోందని, పరిస్థితులు కొంచెం చల్లబడ్డాక సరయిన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతోనే ఈవిధంగా వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం జేశారు. మరి ఆయన చెప్పిన మాటలను కాంగ్రెస్ అధిష్టానం కూడా అంగీకరిస్తుందో లేదో?

 

ఇక బీజేపీ కేవలం రాష్ట్రంలో మరికొన్ని సీట్లు సంపాదించుకోవడానికే తెలంగాణా ఇస్తానని చెపుతోంది తప్ప తానూ ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి రాలేమని ఆ పార్టీకి కూడా స్పష్టంగా తెలుసునని, బీజేపీకి తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే ఉండి ఉంటే గతంలో అది అధికారంలో ఉన్నపుడే ఇచ్చి ఉండేదని, అప్పుడు ఈయలేమని చెప్పిన పార్టీ ఇప్పుడు మాత్రం ఇస్తుందని ఎలాగా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు.

 

“రాష్ట్రం విడిపోతే విడిపోనీయండి. కానీ దానిపై పార్లమెంటులో తప్పనిసరిగా చర్చ జరగాలి. ఆచర్చలో సమైక్యరాష్ట్రం కోసం మావాదనలు మేము వినిపిస్తాము. రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలో మావాదనతో సభ్యులను ఒప్పిస్తాము” అని అన్నారు. ఆయన సమైక్యమే కోరుకొంటున్నపుడు రాష్ట్రం విడిపోతే విడిపోనీయండి అని అనడం ఎందుకు? మళ్ళీ విడిపోతామని మొత్తుకొంటున్నవారితో వాదనలు ఎందుకు? సమైక్యం కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకొంటే సరిపోతుంది కదా? 

 

ఇక షరా మామూలుగా ఆయన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖరరెడ్డిని వెనకేసుకువస్తూ చెట్టు మంచిదే కానీ పళ్ళు కుళ్ళిపోతే చెట్టుది తప్పు కాదు కదా అన్నట్లు రాజశేఖర్ రెడ్డి చాలా మంచోడని, ఆయన ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని, గానీ తన కుమారుడు అక్రమ వ్యాపారం చేస్తున్నాడని ఆయన కనిపెట్టలేకపోయాడని, ఉండవల్లి ఒక కొత్త విషయాన్నికనిపెట్టి ప్రజలకి తెలియజేసి పుణ్యం కట్టుకొన్నారు. రాజశేఖర్ రెడ్డి తన అధ్యక్షతన నిర్వహింపబడిన మంత్రివర్గం సమావేశంలో వేలు,లక్షల ఎకరాల ప్రభుత్వభూమిని ముక్కుమొహం తెలియని కంపెనీలకి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు దానపట్టాలు రాసిచ్చేసి, ఆయన ఆపని ఎందుకు చేస్తున్నాడో, అందువల్ల అంతిమంగా ఎవరికి ప్రయోజనం చేకూర్చుతున్నాడో తెలియకుండానే చేసాడని ఉండవల్లి చెప్పడం ఆయన కోర్టులో చేసే వాదనలా గమ్మతుగా ఉంది. అయినా కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పిన రాజశేఖర్ రెడ్డి, ఏమీ తెలుసుకోలేని అమాయక చక్రవర్తి అని ఉండవల్లి చెపితే జనాలు నమ్ముతారా?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu