జయప్రద కోసం ఉండవల్లి త్యాగం ఎందుకో

 

ఉత్తర ప్రదేశ్ నుండి సరాసరి ఆంధ్రా వచ్చివాలిన అందాలభామ జయప్రద, ఎన్ని గడపలెక్కి దిగినా రాజమండ్రీకి మాత్రం టికెట్ దొరక్కపోవడంతో, మళ్ళీ హుటాహుటిన డిల్లీలో సోనియమం ఇంట్లో వాలిపోయి, రాజమండ్రీ టిక్కెట్టుకి ఆమె చేత ‘మమ’ అనిపించేసుకొన్నట్లు సమాచారం. కాకపోతే, హట్టాతుగా ఎక్కడి నుంచో ఊడిపడిన ఆమెకోసం, పార్టీకి పాతకాపు వంటి ఉండవల్లిని తప్పుకోమని అడగడం సాద్యమా? అని అందరూ ఆశ్చర్యపోతుంటే, ఆయనే స్వయంగా “జయప్రద రాజమండ్రీ నుండి పోటీ చేస్తానంటే ఆమెకు నా సహకారం ఉంటుందని’ ప్రకటించి జనాలని మరింత ఆశ్చర్య పరిచారు. కానీ, ‘పార్టీ నన్ను రాజ్యసభకు పంపినా ఆ బాధ్యతా ఆనందంగా స్వీకరిస్తానని’ మరొక మాట కూడా చల్లగా అన్నారు.

 

స్వంత అన్నదమ్ములే టికెట్స్ కోసం కత్తులు దూసుకొంటున్న ఈ తరుణంలో, ఎక్కడి నుంచో ఎగిరివచ్చి తన సీటుకే ఎసరు పెడుతున్న జయప్రదపై నిప్పులు కక్కవలసిన ఉండవల్లి ఆమెకే సహకరిస్తానని ఎందుకంటున్నారు? ఇది అర్ధం చేసుకోవాలంటే మనం చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ చూడక తప్పదు. గత ఎన్నికలలో రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గాలి చాలా బలంగా వీస్తున్న తరుణంలో కూడా ఉండవల్లి తన సమీప ప్రత్యర్ధి మురళి మోహన్ పై జయభేరి మ్రోగించడానికి చాలా శ్రమపడవలసి వచ్చింది.

 

కానీ, ఈ సారి ఆయన లేకపోగా స్వయంగా అయన కొడుకు జగన్ మోహన్ రెడ్డి పార్టీతోనే ఉండవల్లి పోటీ పడవలసి ఉంటుంది. ఒకవైపు సర్వే రిపోర్టులన్నీజగన్ వైపు మొగ్గు చూపుతుంటే, మరో వైపు గతంలో చిన్నతేడాతో తన చేతిలో ఓడిపోయిన మురళీ మోహన్ కూడా ఈసారి ఎలాగయినా ఈ ఎన్నికలలో గెలవాలనే పట్టుదలతో పోటీలో ఉండనే ఉన్నారు. ఇక, అధికారం చెప్పటిన నాటి నుండి రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడేసుకొంటున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కష్టపడి సంపాదించిపెట్టిన కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటు కూడా ఉండనే ఉంది.

 

ఇటువంటి సమయంలో రాజమండ్రీ మీద ఎగురుతున్న జయప్రదను చూసి అందరూ కాకిని చూసినట్లు మొహం తిప్పుకొంటుంటే, ఉండవల్లికి మాత్రం ఈ క్లిష్ట సమయంలో తనను రక్షించేందుకే అంత దూరం నుండి ఎగురుకొంటూ వచ్చి రాజమండ్రీ చుట్టూ చక్కర్లు కొడుతున్న ఓ రెక్కలులేని దేవతలా జయప్రద కనిపించారు.

 

అందుకే ఆయన “సోనియమ్మ ఆదేశిస్తే ఎటువంటి త్యాగాలకయినా సిద్దం. ఆమె ఆదేశిస్తే ఏ బాధ్యత (పదవి) అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తానని” రెండు బలమయిన పంచ డైలాగులు పలికాల్సి వచ్చింది. తద్వారా  ఉండవల్లి ఆమె మనసును గెలుచుకోవడంతో బాటు, ఒంటి నుండి చమట బొట్టు చిందించకుండా లోక్ సభ నుండి ఆయన రాజ్యసభకు మారిపోవచ్చును. అదే రాజమండ్రీ పట్టుకు వ్రేలాడితే ఓటమిని ఎదుర్కోవడానికే పోరాడినట్లు ఉంటుంది తప్పవేరే ప్రయోజనం ఉండదు. అందువల్ల రాజమండ్రీ సీటుని జయప్రద కొదిలేస్తే ఆమె తిప్పలేవో ఆమె పడుతుంది, సోనియమ్మ చల్లని చూపులు తనపై ప్రసరిస్తే రాజ్య సభలో సీటు, ఇంకా అదృష్టం బాగుంటే ఏకంగా కేంద్ర మంత్రి పదవి అన్నీ ఈ చిన్న త్యాగంతోనే దక్కే అవకాశం ఉంది.

 

‘మరక మంచిదేనని, సబ్బుకి కూడా సంస్కారం ఉంటుందని’ కనిపెట్టి సబ్బుల కంపెనీలు వాళ్ళు మనకి చెప్పినట్లే, ముక్కు మొహం తెలియని జయప్రద కోసం త్యాగం చేయడం కూడా ఒకందుకు చాలా మంచిదేనని ఉండవల్లి అనుకొంటే మనం కాదనగలమా?.