వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్.. అదీ ఒకే ప్రధాని హయాంలో.. నిర్మలాసీతారామన్ రికార్డ్
posted on: Jan 31, 2026 12:40PM
.webp)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మదో సారి వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. దేశ చరిత్రలో వరుసగా తొమ్మిది వార్షిక బడ్జెట్ లను ప్రవేశ పెట్టిన తొలి విత్త మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. విత్త మంత్రిగా నిర్మలా సీతారామన్ ఆదివారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. పార్లమెంటరీ చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం. సువర్ణాధ్యాయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అయితే నిర్మలాసీతారామన్ సాధించిన ఈ ఘనతను దేశం గర్వించదగ్గ మైలురాయిగా పేర్కొన్నారు.
దేశ ఆర్థిక రంగాన్ని ఇన్నేళ్లపాటు సమర్థవంతంగా నడిపించడం, స్థిరమైన, నిలకడైన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించడం ఆమె పరిణితికి నిదర్శనంగా ప్రధాని అభివర్ణించారు. ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు. అయితే అత్యధిక సార్లు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన రికార్డు ఇప్పటికీ మాజీ ప్రధాని మురార్జీ దేశాయ్ దే. అయితే ఆయన వరుసగా కాకుండా వేరు వేరు సమయాలలో ఈ బడ్జెట్ లను ప్రవేశ పెట్టారు. ఇప్పటి వరకూ వరుసగా అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్, పి.చిదంబరం పేర్ల మీదే ఉంది. మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ వేర్వేరు ప్రధానుల హయాంలో వరుసగా తొమ్మిది, ఎనిమిది సార్లు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. అయితే నిర్మలా సీతారామన్ మాత్రం ఒకే ప్రధాని హయాంలో వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్‌లను ప్రవేశపెట్టి కొత్త రికార్డు సృష్టించనున్నారు.
2019లో ప్రధానమంత్రి మోదీ రెండవసారి గెలిచినప్పుడు, ఆమె భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. 2024లో మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమెను ఆర్థిక మంత్రిగా కొనసాగించారు. ఇప్పటివరకు, ఆమె ఫిబ్రవరి 2024లో తాత్కాలిక బడ్జెట్‌నుపక్కన పెడితే ఎనిమిది వరుస బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. ఆదివారం (ఫిబ్రవరి 1)న ఆమె వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్ ను, అదీ ఒకే ప్రధాని హయాంలో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించనున్నారు.



.webp)






