సెల్ఫీలోనూ రకాలు ఉన్నాయట!

 

ఒకప్పుడు సెల్ఫీ దిగేవారిని చూసి జనం నవ్వుకొనేవారు. అలా నవ్వుకొంటున్న జనాలందరికీ కూడా ఇప్పుడు సెల్ఫీ దిగడం అలవాటు అయిపోయింది. మన దేశంలో ఆధారు కార్డు లేనివారు, సెల్ఫీ దిగనివారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. సోషల్‌ మీడియాలోకి లక్షలాదిగా వచ్చి పడే ఈ సెల్ఫీను చూస్తే వాటి మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి. అందుకే చాలా పత్రికలు ఇప్పుడు సెల్ఫీలలో రకాలు అంటూ ప్రకటిస్తున్నాయి. వాటిలో కొన్ని ఇవిగో...

 

కారులో సెల్ఫీ

కారులో సీటుబెల్టు పెట్టుకొని దిగే సెల్ఫీలు మనకి కోకొల్లలుగా కనిపిస్తాయి. తాము బుద్ధిమంతులుగా కనిపిస్తున్నామని మురిసిపోయేందుకో, తనకి కూడా కారు ఉందని చెప్పకుండానే చెప్పేందుకో ఇలాంటి సెల్ఫీలు ఉపయోగపడతాయి.

 

సెల్ఫీ విత్‌ సెలబ్రెటీ

ఎవరన్నా సెలబ్రెటీ కనిపిస్తే వారితో ఫొటో దిగి జీవితాంతం జనాలందరికీ చూపించుకోవాలనుకునే తపన మనది. అయితే ఇప్పుడు ఫొటో ఎవరు తీస్తారా అని వాళ్లనీ వీళ్లనీ బతిమాడవలసిన అవసరం లేదు. సెలబ్రెటీని మన దగ్గరకి ఒక్క గుంజు గుంజి వారితో సెల్ఫీ తీసుకుంటే సరిపోతుంది.

 

పెంపుడు జంతువులతో సెల్ఫీ

మన ఇంట్లో తిరిగే కుక్కల్నీ పిల్లుల్నీ ఎలాగూ ప్రత్యేకించి ఫొటోలు తీయం. పైగా వాటి మీద మనకి ఉన్న అభిమానాన్ని సోషల్ మీడియాలో పంచుకునేదెలా! అందుకే పెంపుడు జంతువులతో దిగే సెల్ఫీలకి కూడా మంచి గిరాకీ ఉంది.

 

తిండి సెల్ఫీ

తింటూ సెల్ఫీ దిగాలంటే మనవారికి అదో సరదా! రెస్టారెంటులో కుటుంబసభ్యులతో కూర్చునో, కేకు ముక్కలు నోట్లో కుక్కుకుంటూనో సెల్ఫీల దిగుతుంటాము. మీరు కూడా ఈ సమయంలో మాతో ఉంటే బాగుండు అన్న అభిలాషతోనో, మేం హాయిగా ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాం అని ఉడికించేందుకో ఇలాంటి సెల్ఫీలు పడుతుంటాయి.

 

బాత్రూం సెల్ఫీలు

విదేశీ సెల్ఫీలలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్నానం చేస్తూనో, పళ్లు తోముకుంటూనో బాత్రంలో దిగే ఇలాంటి సెల్ఫీలకి కొదవ లేదు. మనవారు ఇంతదూరం వెళ్లరు కానీ అద్దం ముందు నిల్చొని దిగే సెల్ఫీలు మాత్రం మన సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తాయి.

 

కండల సెల్పీలు

కుర్రకారు వ్యాయామం చేసేది సగం ఆరోగ్యం కోసం, మిగతా సగం బలప్రదర్శన కోసం. అందుకని వ్యాయామం చేస్తూనో, జిమ్‌లో చెమటలు కక్కుతూనో దిగే సెల్ఫీలకి కొదవ ఉండదు. జాగింగ్ చేస్తూ, సిక్స్‌ ప్యాక్‌ని ప్రదర్శిస్తూనో దిగే సెల్ఫీలు కూడా దర్శనమిస్తూనే ఉంటాయి.

 

సెల్ఫీ ప్రేమ

ప్రేమలో పడినవారు సెల్ఫీలు తీసుకోక తప్పదేమో! ప్రపంచమంతా కుళ్లుకునేలా తమ అన్యోన్యమైన ప్రేమని సెల్ఫీ రూపంలో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తుంటారు ప్రేమికులు. సెలబ్రెటీల దగ్గర్నుంచీ, మధ్యతరగతి భార్యాభర్తల వరకూ జంటలుగా దిగే ఈ సెల్ఫీలు ఇప్పుడు సర్వసాధారణం.

 

విజయగర్వంతో

డిగ్రీ పట్టా పుచ్చుకోగానే ఓ సెల్ఫీ, ఎవరెస్టు ఎక్కగానే ఓ సెల్ఫీ, ఓటు వేయగానే ఓ సెల్ఫీ, ఆఖరికి సినిమా టికెట్టు సాధించగానే ఓ సెల్ఫీ... ఇలా ఏదో సాధించామని గర్వపడే ప్రతిసారీ, సదరు విజయాన్ని నలుగురితో పంచుకునేందుకు తీసే సెల్ఫీలకి కొదవలేదు. చెప్పుకొంటూ పోవాలే కానీ సెల్ఫీలు ఇలా వేయి విధాలు. అప్పుడే పుట్టిన బిడ్డతో సెల్ఫీ దిగడం దగ్గర్నుంచీ శవం పక్కనే నిలబడి దిగే చావు సెల్ఫీ వరకూ... సెల్ఫీ విశ్వరూపాన్ని చూడాలంటే వేయికళ్లూ చాలవేమో!

 

 

- నిర్జర.