వెండి రథం సింహాలు మాయం ఘటనలో ట్విస్ట్.. సబ్ కాంట్రాక్టర్ వెంకట్‌ మిస్సింగ్!! 

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి రథానికి ఉండాల్సిన నాలుగు సింహాల్లో మూడు సింహాలు మాయమైన ఘటన ఏపీలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, వైసీపీ పాలనలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, అధికార పార్టీ మాత్రం.. విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని, అసలు ఆ రథాన్ని తాము అధికారంలోకి వచ్చాక ఉపయోగించలేదని, గత ప్రభుత్వ హయంలోనే ఆ వెండి సింహాలు మాయమై ఉంటాయని చెప్పుకొస్తుంది. ఇక ఆలయ ఈవో సంగతి సరేసరి. అసలు ఆ సింహాలు అంతకముందు ఉన్నాయో లేదో, ఉన్నా అసలు ఆ సింహాలు వెండివో కాదో రికార్డ్స్ చూసి చెప్తాం అంటూ వింత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు.

 

ఇదిలా ఉంటే, వెండి రథం సింహాలు మాయం ఘటన మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్ డిసిపి కోటేశ్వరరావు రథాన్ని పరిశీలించారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, ఆలయానికి సంబంధించి వెండి, బంగారం, ఇత్తడి పొలిషింగ్ కి నెలకి 47వేలు రూపాయలు చొప్పున శ్రీ శర్వాని ఇండస్ట్రీ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ శ్రీ శర్వాని ఇండస్ట్రీ నుండి వెంకట్ అనే వ్యక్తి సబ్ కాంటాక్ట్ తీసుకున్నారు. ఈ ఏడాది ఉగాది(మార్చి  2020)కి రథాన్ని సిద్ధం చేసేందుకు 15 రోజుల ముందు రథాన్ని సబ్ కాంట్రాక్టర్ వెంకట్ చూసినట్లు పోలీసులు చెబుతున్నారు.

 

మరోవైపు, దేవస్థానానికి చెందిన అప్రైజర్ షమీ, స్తపతి షణ్ముకం, ఏఈవో ఎన్.రమేష్ ల నుంచి రథం వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రథానికి నాలుగు సింహాలు ఉన్నాయని అప్రైజెర్ షమీ కి వెంకట్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని షమీ పోలీసులకు చెప్పారని సమాచారం.

 

ఈ కేసులో సబ్ కాంట్రాక్టర్ వెంకట్‌ స్టేట్‌మెంట్ కీలకం కానుంది. అయితే ప్రస్తుతం వెంకట్ అందుబాటులో లేరు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో, వెంకట్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

 

గత రెండు రోజులుగా వెండి సింహాలు మాయం మీ హయాంలో అంటే మీ హయంలో జరిగింది అంటూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ.. చివరిసారిగా రథాన్ని సబ్ కాంట్రాక్టర్ వెంకట్ చూసాడని తెలియడం, ఇప్పడు అతను అందుబాటులో లేకుండా పోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.